వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందులు ఇవ్వకుండా మానసిక చికిత్స.. సైన్స్‌ని తిరగరాస్తున్నారా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆర్ట్ థెరపీ ద్వారా మానసిక రోగులకు చికిత్స చేయవచ్చు

మాలిన్ 21 ఏళ్ల వయసు నుంచీ మానసిక ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడుతూ చికిత్సాకేంద్రానికి వచ్చారు. తాను లావుగా ఉంటానని, ఎందుకూ పనికి రాననే ఆలోచనలతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకునేవారు.

నార్వేలోని ఓ చిన్న పట్టణానికి చెందిన ఆమె కాలేజీ చదువు కోసం ఇల్లు వదిలి దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే, అలా వెళ్లిన కొన్ని రోజులకే ఆమె మంచం పట్టారు. మంచం మీద నుంచి లేవలేని స్థితికి చేరుకున్నారు.

మాలిన్‌ను ఆమె కుటుంబం ఒక మానసిక చికిత్సా కేంద్రంలో ఏడాది పాటు ఉంచింది.

"ఆ మందులకు నా మతి పోయినట్లు ఉండేది. నా ఆలోచనలు, భావాలతో సంబంధం లేకుండా జీవితం సాగుతున్నట్లు అనిపించేది. నేను సాయం అడిగిన ప్రతిసారీ మందులు ఇచ్చేవారు. వాటి వల్ల నా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు" అని మాలిన్ చెప్పారు.

"చాలా దారుణంగా అనిపించేది. 'ఇదే నీ జీవితం. దీనితో నువ్వు సరిపెట్టుకోవాల్సిందే’ అని అందరూ అనేవారు. కానీ, ఈ జీవితం నాకు నచ్చేది కాదు" అని ఆమె అన్నారు.

మాలిన్‌లా మానసిక సమస్యలకు (సైకోసిస్‌కు) చికిత్స తీసుకునేవారిలో 20 శాతం మంది ఔషధాలకు స్పందించనివారు ఉంటారని ఓ అంచనా. ఇలాంటివారికి ఈ మందుల వల్ల అలసట, బరువు పెరగటం, కొలెస్టరాల్, మధుమేహం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఈ మందుల వల్ల వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

ఈ నేపథ్యంలోనే మానసిక ఆరోగ్య కేంద్రాల్లో బలవంతంగా రోగులను పెట్టి, చికిత్స అందించే విధానంలో మార్పులు రావాలని 'యూఎన్ కమిటీ ఎగినెస్ట్ టార్చర్’ చెప్పింది.

మాలిన్

మాలిన్ లాగే మెట్టే ఎల్లింగ్స్డాలెన్ కూడా తన మానసిక సమస్యకు 13 ఏళ్ల పాటు మందులు వాడారు. ఆమె పరిస్థితి మరింత దిగజారిందే కానీ ఏమాత్రం మెరుపడలేదు.

మందులు వాడకుండానే జీవించాలని నిర్ణయించుకున్న ఆమె 2005లో నార్వే వైద్య విధానాలను మార్చే ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం పేషెంట్ యూజర్ గ్రూప్ చెయిర్ పర్సన్‌గా ఉన్నారు.

మానసిక సమస్యలతో బాధపడేవారికి వారికి ఇష్టం ఉంటేనే చికిత్స అందించాలని మెట్టే అంటున్నారు.

మెట్టే లాంటి వారు చేసిన ఉద్యమాల ఫలితంగా... మందులు లేని వార్డులను మొదలుపెట్టాలని నార్వే ఆరోగ్య శాఖ మంత్రి ప్రాంతీయ వైద్య అధికారులను ఆదేశించారు.

ఇలాంటి చికిత్స పద్ధతులు మరి కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్య కేంద్రాలలో మానసిక రోగాలకు ఔషధాలు లేకుండా చికిత్స చేయడం మొదలు పెట్టిన తొలి దేశంగా నార్వే నిలిచింది.

ఈ మందులు లేని వార్డులను నిర్వహించే బాధ్యతను డైరెక్టర్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సబ్స్టన్స్ డాక్టర్ మాగ్నస్ హాల్డ్ తీసుకున్నారు.

"ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను పొందే అవకాశం ఉండాలి. రోగికి మందులు ఎలా పని చేస్తాయో వివరించగలగాలి. ఆ మందుల వలన కలిగే ముప్పును తెలియజేయాలి. తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే రోగుల మెదడులో రసాయనాల సమతుల్యత సరిగ్గా ఉండదనే అపోహ ఉంది. కానీ, ఆ వాదనకు ఆధారాలు లేవు" అని ఆయన చెప్పారు.

మందులు లేకుండా ఇస్తున్న చికిత్స చాలా మంది రోగులకు పని చేస్తోందని మాగ్నస్ తెలిపారు.

డాక్టర్ మాగ్నస్ హాల్డ్

మాలిన్ కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు ఇప్పుడు 34 ఏళ్లు.

ఆమె ఈ మానసిక వైద్య కేంద్రంలో చాలా వారాలు గడుపుతుంటారు. మధ్య మధ్యలో ఇంటికి వెళుతూ ఉంటారు. మాలిన్ ఇప్పుడు ఒంటరిగా నివసిస్తున్నారు. సమస్య నుంచి కోలుకోవడానికి కళను ఆశ్రయించారు. ఉద్యోగం చేయాలని కూడా అనుకుంటున్నారు.

"ఇప్పుడిప్పుడే నన్ను నేను కనుగొంటున్నా. నా మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటున్నాను. భవిష్యత్తు మీద నాకు ఆశ కలుగుతోంది" అని మాలిన్ అన్నారు.

అయితే, ఇలా మందులు లేకుండా చికిత్స చేయడం నార్వేలో వివాదాస్పదంగా మారింది.

20 ఏళ్ల క్లాడియా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో, మతిభ్రంశంతో బాధపడుతూ ఉండేవారు. మందులు వాడిన తర్వాత ఆమె పరిస్థితి కాస్త మెరుగయ్యింది.

మందులు వాడితేనే తనకు హాయిగా ఉంటుందని ఆమె అన్నారు.

ఈ మందులు లేకుండా చికిత్స చేసే విధానం ఆధారాల కంటే కూడా ఆదర్శాల ప్రభావంతో వచ్చిందని విమర్శకులు అంటున్నారు.

ఇలా మందులు లేకుండా చికిత్స చేయడం మానసిక వైద్య శాస్త్రానికి విరుద్ధమని డాక్టర్ జాన్ ఐవర్ రాస్బెర్గ్ అన్నారు.

''ఈ విధానం పని చేయదని చరిత్ర చెబుతోంది. అందుకే దీనిని అమలు చేయడం ఆపేశారు. ప్రభావవంతమైన మందులు లేకుండా చికిత్స చేసే విధానం ఉండదు" అని ఆయన అన్నారు.

సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మందులతో చికిత్స చేయడం మొదలుపెట్టి... పరిస్థితిని బట్టి మందులను తగ్గిస్తూ రావడం మంచిదని ఐవర్ అభిప్రాయపడ్డారు.

కానీ, మాగ్నస్ హాల్డ్ ఈ వాదనతో అంగీకరించడం లేదు.

మందులు లేకుండా కోలుకున్న రోగుల గురించి ఆయన పరిశోధన చేయాలని భావిస్తున్నారు.

అయితే, హాల్డ్ వాదనలను బలపరిచే ఆధారాలు లేవు.

మెట్టే ఎల్లింగ్స్డాలెన్

మందులు లేకుండా చేసే ఈ చికిత్స భవిష్యత్తులో ఎలా పని చేస్తుందనే విషయంపై అనేక ఆందోళనలు, అనుమానాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడే రోగులకు మాత్రం మందులతోనే చికిత్స ఇస్తున్నారు.

మానసిక రోగాలకు చికిత్స తీసుకోలేని చాలా మంది రోగులు వీధుల్లో బతుకుతున్నారని వైద్యులు అంటున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేని వారు నేరాలు చేసే అవకాశం గానీ, సన్నిహితుల పట్ల హింసాత్మకంగా మారే అవకాశం గానీ ఉందని చెబుతున్నారు. తీవ్ర మానసిక సమస్యలతో మతి స్థిమితం కోల్పోయినవారు హత్యలు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

మందులు లేకుండా మానసిక రోగులకు చికిత్స అందించే విధానం గురించి ప్రచారం నిర్వహించిన వారిలో ఒకరైన హాకన్ రియాన్ యులండ్ మాత్రం... మందులతో చేసే చికిత్స వల్ల వచ్చే ప్రమాదాలను చర్చించకపోతే ప్రజలను మభ్యపెట్టినట్లవుతుందని అంటున్నారు. ప్రజలను మత్తులో ముంచడానికి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు.

మానసిక రోగులు తమ జీవితాల గురించి నిర్ణయించుకునే అవకాశం ఇచ్చిన నార్వేలో జరుగుతున్న ఈ పరిణామాలను... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానసిక వైద్యులు, రోగులు కూడా గమనిస్తున్నారు.

మందులు లేకుండా చికిత్స చేయడం అనేది ఓ వెర్రి ఆలోచన అయినా అవ్వొచ్చు. లేక మానసిక వైద్య శాస్త్రాన్నే తిరగరాసే విధానమైనా కావొచ్చు. కాలమే సమాధానం చెబుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Psychotherapy without giving drugs. Is researchers Rewriting the history of science?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X