శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే- ఇవాళ బాధ్యతలు చేపట్టే అవకాశం
ఆర్ధిక సంక్షోభం బారిన పడి దాన్ని సరిదిద్దకుండా రాజకీయ సంక్షోభం వరకూ తెచ్చుకున్న శ్రీలంకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలతో ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా చేసి వెళ్లిపోగా.. ఇప్పుడు ఆయన స్ధానంలో విపక్ష యూఎన్పీ నేత రణిల్ విక్రమసింఘేకు అవకాశం ఇస్తున్నారు. ఆయన్ను ఇవాళ అధ్యక్షుడు గోటబాట రాజపక్స అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించే అవకాశముంది.
యూఎన్పీ నాయకుడు రణిల్ విక్రమసింఘే ఇవాళ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని శ్రీలంక నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన సొంత పార్టీ నేతలు ధృవీకరిస్తున్నారు. దీనిపై తుది చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన కార్యనిర్వాహక అధికారాలను చాలా వరకు వదులుకుంటానని తాజాగా ప్రకటించారు. అయితే దేశ ఆర్థిక సంక్షోభంపై రాజీనామా చేయాలనే డిమాండ్‌లకు మాత్రం ఆయన తలొగ్గలేదు. కానీ త్వరలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం ఆయన ప్రయత్నిస్తున్నారు.

పార్లమెంటులో మెజారిటీ, ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రధానమంత్రిని తాను సూచిస్తానని ఇప్పటికే రాజపక్సే టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు. సోమవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తన అన్నయ్య మహింద రాజపక్సే వారసుడి పేరును ఆయన నేరుగా ప్రకటించలేదు. అయితే కొత్త కేబినెట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేయడానికి ఆయన విపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో విక్రమసింఘే పేరుపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications