సూకీకి అగ్ని పరీక్షే: రోహింగ్యా జాతి నిర్మూలనకు మయన్మార్ సైన్యం ఊచకోత

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

తీవ్రవాదులన్న ముద్రతో రోహింగ్యా ముస్లింలపై అకృత్యాలకు పాల్పడుతున్న మయన్మార్‌ సైన్యంపై పట్టు, నియంత్రణ సాధించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, ఆ దేశ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీకి ఇది చివరి అవకాశం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. భయానకంగా మారిన పరిస్థితులపై ఆమె స్పందించాల్సిన అవసరం ఉన్నదని ఇప్పటికే ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

ఇటీవల వరకు సూకీని గ్రుహ నిర్బంధంలో ఉంచి ఇష్టానుసారం పాలన సాగించిన మయన్మార్ సైన్యానికి.. అధికారం దూరం కావడం కంటగింపుగానే ఉంటుంది మరి. సూకీ పట్ల ప్రజల్లో అభిమానాన్ని దెబ్బ తీసేందుకే.. సైన్యం రోహింగ్యాలపై ఉగ్రవాదులు, తీవ్రవాదులన్న ముద్ర వేసి భయానక దాడులకు పాల్పడుతున్నదన్న సంగతి నిష్ఠూర సత్యం.

గత నెల 25న ఒక పోలీస్ పోస్టుపై రోహింగ్యా ముస్లింల దాడిని సాకుగా చేసుకుని సైన్యం ఊచకోతకు దిగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ తమ దేశంలో ఏనాడూ లేని జాతి గుర్తింపు కావాలని కోరుతున్నదని మయన్మార్ ఆర్మీ చీఫ్ మిన్ అంగ్ హ్లాంగ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బెంగాలీల నినాదం జాతీయ ఉద్యమానికి కారణమైందని, నిజానిజాలు వెలుగులోకి తేవాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. సైన్యం ఆపరేషన్స్ పేరుతో చేస్తున్న దాడులతో బతుకు జీవుడా అంటూ రోహింగ్యాలు ప్రాణభీతిలో పొరుగున ఉన్న భారతదేశానికి, బంగ్లాదేశ్‌కు వెల్లువలా శరణార్థులై వచ్చి పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోహింగ్యాల గురించి ఒక పరిశీలన..

ఆధునిక ప్రపంచంలో మనుగడ కోసం రోహింగ్యాలు ఇలా

ఆధునిక ప్రపంచంలో మనుగడ కోసం రోహింగ్యాలు ఇలా

అత్యంత నాగరిక సమాజాన్ని నిర్మించుకున్నామని ప్రపంచ మానవళి సంబర పడుతున్న సమయంలో ఒక జాతి తన అస్తిత్వం కోసం పోరాటం చేస్తోంది. తమకు ఓ గుర్తింపు కల్పించాలని ప్రపంచ దేశాల్ని వేడుకొంటోంది. కనీసం తమను పౌరులుగా గుర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ముందు సాగిలపడుతోంది. ఇంతవరకు ఆ జాతికి ఎక్కడా సొంత దేశం లేదు. ఏ దేశంలోనూ ఆ జాతీయులు పౌరులుగా గుర్తింపునకు నోచుకోలేదు. పైగా వీరిని తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా ముద్రలేశారు. కొన్ని శతాబ్దాలుగా సంచారజాతులుగానే వీరు మిగిలిపోయారు. ఎనిమిది శతాబ్దాల క్రితమే ఇప్పటి మయన్మార్‌ అప్పటి బర్మాలో లక్షల మంది ఈ జాతీయులు తలదాచుకున్నారు. గత కొన్నాళ్ళుగా ఈ జాతిపై మయన్మార్‌ సైన్యం విరుచుకుపడుతోంది. వీరిని నిలువునా ఊచకోత కోస్తోంది. దీర్ఘ కాలం సైనిక నియంతలపాలనలో మగ్గినా ఎప్పుడూ ఇంతటి అరాచకం వీరిపై జరగ లేదు. కానీ నోబుల్‌శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ జాతి ఉనికికే విఘాతం ఏర్పడింది.

అనధికార శరణార్థులుగానే వీరికి గుర్తింపు

అనధికార శరణార్థులుగానే వీరికి గుర్తింపు

సైనికుల ఊచకోతను భరించలేని రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత బట్టుకుని నాటుపడవలు, నావల్లో కాలువలు, నదులే కాదు.. ఏకంగా సముద్రాల్ని కూడా దాటేసి బతుకుజీవుడా అంటూ ఇతర దేశాల్లోకి దొంగచాటుగా పారిపోతున్నారు. వీరే రోహింగ్యా ముస్లింలు. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వీరు 15.58 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు జనాభా ఉంటారు. వీరిలో పది లక్షల నుంచి 13లక్షల వరకు మయన్మార్‌ రఖైన్‌ రాష్ట్రంలోనే ఉంటున్నారు. సుమారు ఐదు లక్షల మంది బంగ్లాలో, రెండు లక్షల మంది పాక్‌లో, లక్ష మంది థాయ్‌లాండ్‌, 40వేల మంది మలేషియా, 35 వేల మంది భారత్‌, 12 వేల మంది అమెరికా, 11 వేల మంది ఇండోనేషి యాలో తలదాచుకుంటున్నారు. ఈ 20 లక్షల మందిలో ఏ ఒక్కరికి ఏ దేశపు పౌరసత్వం కూడా లేదు. వీరందర్నీ ఆయా దేశాలు అనధికార శరణార్థులుగానే గుర్తిస్తున్నాయి. వీరికి ఏ దేశంలోనూ పౌరసత్వం కార్డ్‌, రేషన్‌, ఆధార్‌ వంటి ఏ విధ మైన గుర్తింపు కార్డులు జారీకావు. కొన్ని దేశాల్లో అయితే వీరికి అద్దెకు ఇళ్ళు కూడా ఇవ్వరు. వీర్నెవరూ పనిలో పెట్టుకోరు. వ్యాపారాలు, ఉపాధి కోసం అప్పులివ్వరు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా వీరిని వెలివేసినట్లే చూస్తున్నారు.

 ఐక్యరాజ్యసమితిని కూడా కదిలించిన దాడులు

ఐక్యరాజ్యసమితిని కూడా కదిలించిన దాడులు

అంతర్యుద్ధ సమయంలో సిరియా నుంచి లక్షల మంది ప్రాణాలు అరచేతబట్టుకుని విదేశాల్లో తలదాచుకునేందుకు వీలైనన్ని మార్గాల్లో పారిపోయిన సంఘటన మరువకముందే అంతకంటే భయంకరమైన రీతిలో రోహింగ్యా ముస్లింలు తమ ప్రాణాల్ని, మానాల్ని, బిడ్డల్ని రక్షించుకునేందుకు ఇతర దేశాల సాయం అర్ధిస్తున్న తీరు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని కూడా కదిలించేసింది. ఇప్పటికే ఉగ్రముద్ర పడ్డ వీరిని అనుమతించేందుకు ఏ దేశం కూడా అంగీకరించడం లేదు. ప్రస్తుతం మయన్మార్‌లోని రాఖైన్‌ రాష్ట్రం ఉన్న ప్రాంతాన్ని ఎనిమిదో శతాబ్దంలో అరకాన్‌గా పిలిచేవారు. ఇది బర్మావైపున ఉమ్మడి బెంగాల్‌ ప్రాంతాన్ని ఆనుకుని ఉండేది. బంగ్లాను పాలించిన రాజులే అరకాన్‌ ప్రాంతంపై కూడా అధికారం కలిగి ఉండేవారు. చంద్రవంశీయులు, మ్రాక్‌ రాజులు కూడా ఈ రెండింటినీ కలిపి పరిపాలించారు. ఇరాన్‌ ప్రాంతం నుంచి వచ్చిన అరబ్‌ మిషనరీలు తరచూ బెంగాల్‌ అరకాన్‌లలో తరచూ ఇస్లాం బోధించేవారు. ఇలా అరకాన్‌ ప్రాంతంలోని పలువురు ఇతర మతస్తులు నెమ్మదిగా ఇస్లాంను అనుసరించడం మొదలెట్టారు. మొఘల్‌ సామ్రాజ్య సమయంలోనూ అరకాన్‌లో ఇస్లాం విస్తరించింది. ఇలా ఇండోఆర్యన్‌ ప్రాంతానికి చెందిన అరకాన్‌లో ఇతర మతస్తుల కంటే ముస్లింల సంఖ్య అధికంగా మారింది.

సిల్క్ రోడ్డు తరహాలో భారత్ - చైనా మధ్య రహదారి

సిల్క్ రోడ్డు తరహాలో భారత్ - చైనా మధ్య రహదారి

ఈ ప్రాంతంలోని ప్రజలు బర్మాకంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విద్య, సాహిత్యాల్ని ఎక్కువగా ఇష్టపడేవారు. బ్రిటీష్‌ పాలనాకాలంలో అర కాన్‌లోని ముస్లింలే బర్మాలో బుద్దుల తర్వాత అత్యధికజనాభాగా ఉండేవారు. బంగాళాఖాతం మీదుగా జరిగే వాణిజ్యానికి అరకాన్‌ కీలకకేంద్రంగా ఉండేది. మౌర్యుల పాలనాకాలం నుంచే అరకాన్‌లో వాణిజ్యం విస్తరించింది. 8వ శతాబ్దం లోనే ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మధ్యప్రాశ్చ్యానికి రవాణా జరిగింది. ఇప్పుడు చైనా నిర్మిస్తున్న సిల్క్‌రోడ్‌ తరహాలో ఆ రోజే అరకాన్‌ మీదుగా భారత్‌ - చైనా మధ్య విస్తృత వాణిజ్య వ్యవహారాల కోసం రవాణా వ్యవస్థను నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఆరకాన్‌లో నివసించిన ముస్లింలు తమకు తాము రూయింగాగా చెప్పుకునే వారు. అలాగే వీరికి రోహింగ్యాలుగా పేరొచ్చింది.

బర్మా స్వాతంత్ర్యోద్యమానికి వీరు దూరమే

బర్మా స్వాతంత్ర్యోద్యమానికి వీరు దూరమే

ఇది వాణిజ్య కేంద్రం కావడంతో చిట్టగాంగ్‌తో పాటు బ్రిటీష్‌ వలస ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పెద్దసంఖ్యలో ఇక్కడకు తరలొచ్చేవారు. ఈ ప్రాంతంలో 1872 నాటికి 58,255 మంది ముస్లింలుంటే 1911నాటికి 1,78,647 మందికి జనాభా చేరినట్లు బ్రిటీష్‌ అధికారులు గుర్తించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా బ్రిటీష్‌ పాలకులు పేర్కొన్నారు. బర్మాలో అప్పటికి యాంగాన్‌, సిట్వే, పాథేన్‌, మాల్‌ మైన్‌ పెద్దనగరాలుగా ఉండేవి. కానీ అరకాన్‌లో జనాభా వీటిని మించిపోయింది. అయితే వీరిలో అత్యధికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో వీరికి బర్మాజాతీయులకు మధ్య పొసగలేదు. వీరిని మొదట నుంచి వేరుగానే పరిగణించడం మొదలెట్టారు. ఆఖరికి బర్మా స్వాతంత్ర పోరాటంలో కూడా వీరిని పాల్గొననివ్వ లేదు. అలా అప్పటి నుంచి వీరిపట్ల వివక్ష సాగింది.

నాటి నుంచి రోహింగ్యాలపై ఇలా వివక్ష

నాటి నుంచి రోహింగ్యాలపై ఇలా వివక్ష

బ్రిటీష్‌ పాలన చివరి రోజుల నాటికే ఈ ప్రాంతంలో వాణిజ్యం తగ్గుముఖం పట్టింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలు పెరగడంతోపాటు దేశ విభజన కూడా ఆరకాన్‌ ప్రాధాన్యత తగ్గడానికి కారణమైంది. అప్పటి నుంచి బర్మాలో రోహింగ్యాల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఉపాధి, ఇతర కారణాలతో ఎక్కువసంఖ్యలో పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌కు వీరు తరలిపోయారు. ఇతర దేశాల్లో కూడా నెమ్మదిగా విస్తరించారు. ఏ దేశం కూడా వీరికి పౌరసత్వం ఇవ్వలేదు. 1982లో మయన్మార్‌ ప్రభుత్వం కొత్త పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. ఆ దేశంలోని 135 స్థానిక జాతుల్ని పౌరులుగా గుర్తించింది. ఈ జాబితాలో రోహింగ్యాలకు స్థానం కల్పించలేదు. అసలు రోహింగ్యా అన్నదే తమ పదం కాదన్నది మయన్మార్‌ ప్రభుత్వ వాదన. రోహింగ్యా అన్నది బెంగాలీ పదం దీంతో తమకు సంబంధం లేదు. వీరంతా ఒకప్పటి ఉమ్మడి బెంగాల్‌ నుంచి తమ దేశానికి అక్రమంగా వలసలొచ్చిన వారేనన్నది మయన్మార్‌ ప్రభుత్వ వాదన. పైగా వీరిని తమ దేశం వదిలెళ్లాలని గతకొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల్ని కూడా ప్రభుత్వం కల్పించలేదు.

అరాచకం స్రుష్టిస్తున్న మయన్మార్ సైన్యం

అరాచకం స్రుష్టిస్తున్న మయన్మార్ సైన్యం

కొంతమంది ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్న సమయంలో కొందరు రోహింగ్యాలు కూడా వారిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో మయన్మార్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు రోహింగ్యాల మద్దతు ఉందని తేల్చేసింది. ఈసాకుతో వారిని వెంటనే దేశం వదిలి వెళ్ళాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు రోహింగ్యాలపై సైన్యం దాడులు ప్రారంభించింది. స్త్రీలను మయన్మార్‌ సైన్యం చెరబడుతోంది. వారి మాన, ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చిన్నపిలల్ని కూడా చూడకుండానే వారి తల్లి దండ్రుల ముందే కాల్చి చంపుతోంది. యువకుల్నిపట్టితెచ్చి ఒంటిపై నూనెపోసి నిప్పంటిస్తోంది. రోహింగ్యా ముస్లింల తలల్ని మయన్మార్‌ సైనికులు నరికేస్తున్నారు. వారి తలలతో బంతులాట ఆడుతున్నారు.

దారుణ చర్యలు నిలువరించాలంటూ ట్రంప్ ఆదేశం

దారుణ చర్యలు నిలువరించాలంటూ ట్రంప్ ఆదేశం

మయన్మార్‌లో మీడియాపై సెన్సార్‌షిప్‌ ఉంది. దీంతో వీరి క్రూరచర్యలు వెలుగు చూడలేదు. కానీ బీబీసీ రహస్యంగా కొన్ని దాడుల్ని చిత్రీకరించి ప్రపంచం ముందు పెట్టింది. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. అమెరికా నుంచి ఐక్యరాజ్యసమితి వరకు మయన్మార్‌పై ఒత్తిడి పెంచాయి. సైన్యం దాడులతో లక్షలాదిమంది రోహింగ్యాలు పరిసర దేశాలకు పారిపోతున్నారు. అక్రమంగా సరిహద్దులు దాటి ఆ దేశాల్లోకి చొరబడుతున్నారు. ఇది ఆయా దేశాల్లో కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. రోహింగ్యాలపై సైన్యం దారుణచర్యలకు పాల్పడ్డాన్ని నిలువరించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా మయన్మార్‌ పాలకుల్ని ఆదేశించారు.

దాడులపై మయన్మార్ ఇలా సాకులు

దాడులపై మయన్మార్ ఇలా సాకులు

పారిపోతున్న రోహింగ్యాలకు తమ స్థాయిలో సహకారం అందిస్తున్నామని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ప్రాణాలు అరచేతబట్టుకుని వస్తున్న రోహింగ్యాలకు రక్షణ కల్పించాలని పరిసర దేశాలకు ఐక్య రాజ్య సమితి మానవహక్కుల విభాగం విజ్ఞప్తి చేసింది. మయన్మార్‌ మాత్రం దాడుల వెనుక తమ సైనికుల హస్తం లేదంటూ వాదిస్తోంది. తాము కేవలం తీవ్రవాదుల ఏరివేతకు మాత్రమే పూనుకున్నామని ప్రభుత్వం ప్రక టించింది. పైగా ఇది తమ అంతర్గత సమస్య అని స్పష్టం చేసింది. ముస్లింలు అత్యధికంగా ఉన్న ఇండోనేషియా ప్రభుత్వం కూడా మయన్మార్‌పై ఒత్తిడి ప్రారంభించింది. ఇప్పటికే సుమారు మూడు లక్షల మంది ముస్లింలు నాటు పడవలు, నావలెక్కి సముద్రాలు దాటేసి పోతున్నారంటూ ఇండోనేషియా స్పష్టంచేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధులు నేరుగా మయన్మార్‌కొచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. రోహింగ్యాలకు రక్షణ కల్పించాలని సూచించారు. ఇప్పటికే 1.25 లక్షల మందికిపైగా రోహింగ్యాలు అక్రమంగా బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డారు. ఆ దేశంలోని కాక్స్‌ బజార్‌లో బిక్కుబిక్కుమని తలదాచుకుంటున్నారు. వీరికి కనీసం ఆహారం అందించడం కూడా బంగ్లాదేశ్‌కు గగనంగా మారింది. అయినా సరే వెనుదిరిగి వెళ్లేందుకు వీరు సాహసించడంలేదు. ఓ వైపు సైన్యం మరోవైపు తీవ్రవాదులు తమపై కక్షగట్టి దాడులు చేస్తున్నది. గ్రామాలకు గ్రామాల్ని దగ్ధం చేస్తున్నారంటూ బాధితులు బంగ్లా మీడియా ముందు వాపోయారు.

భీతి గొలుపుతున్న హృదయ విదారక ద్రుశ్యాలు

భీతి గొలుపుతున్న హృదయ విదారక ద్రుశ్యాలు

అంతర్జాతీయ సమితి మానవహక్కుల విభాగం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా రాఖినే రాష్ట్రంలో ఇప్పటికే వేల భవనాలు దగ్ధమైపోయినట్లు గుర్తించింది. ఈ చిత్రాల్లో తలలు తెగిన మొండాలు, కాలుతున్న భవనాలు వంటి హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. భారత్‌లోకి ప్రవేశిస్తున్న రోహింగ్యాల్ని నిలువరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మానవహక్కుల ఉల్లంఘనంటూ కొందరు కోర్టుకెక్కారు. కానీ రోహింగ్యాల్ని అనుమతిస్తే జాతీయ భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఇప్పటికీ రోహింగ్యాల్లో కొందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. రోహింగ్యాల ముసుగులో ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రవాద గ్రూపుల సభ్యులు దేశంలోకి ప్రవేశించే ప్రమాదముందని కూడా కోర్టుకు నివేదించింది. ఇప్పటికే కొందరు రోహింగ్యాలు జమ్మూకాశ్మీర్‌, ఢిల్లిd, హైదరాబాద్‌, కోల్‌కతా, కటక్‌ వంటి ప్రాంతాల్లోని తమ మిత్రులు, బంధువుల వద్ద ఆశ్రయం పొందినట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. వీరందర్నీ తిరిగి దేశ సరిహద్దుల్ని దాటించేయాలని నిర్ణయించింది.

రోహింగ్యాలకు వసతి కల్పనకు వివిధ దేశాల వెనుకంజ

రోహింగ్యాలకు వసతి కల్పనకు వివిధ దేశాల వెనుకంజ

ఉగ్రచర్యల సాకుతో మొత్తం ఓ జాతినే తుడిచిపెట్టేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఒకప్పుడు మయన్మార్‌ హింసకు కేంద్రంగా ఉండేది. దీర్ఘకాలం సైనిక ప్రభుత్వం ఆ దేశ అంతర్గత వ్యవహారాలు ప్రపంచానికి తెలీకుండా చేసింది. లక్షలాది మంది బర్మన్లను ఊచకోత కోసింది. ఇన్నాళ్ళకు అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కానీ శతాబ్దాల తరబడి అక్కడ తలదాచుకుంటున్న ఒక జాతిపట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. అయినా నాగరిక సమాజం ఇప్పటికే రోహింగ్యా ముస్లింల్లో ఉగ్రవాద కోణాన్ని ఒక్కటే చూస్తోంది తప్ప వారిలోని అమాయకుల్ని అకారణంగా, రాక్షసంగా మట్టుబెడుతున్న విషయంపై ప్రపంచం స్పందించడంలేదు. వారికి పౌరసత్వం కాదుకదా.. కనీసం ఆశ్రయం కల్పించేందుకు కూడా ముందుకు రావడంలేదు. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం మేల్కొని రోహింగ్యాలకు రక్షణ కల్పించలేని పక్షంలో ఇది అంతరించిపోయిన జాతుల్లో చేరే ప్రమాదం ముంచుకొస్తోంది. జాతిపేరిట మానవమనుగడకే ముప్పుగా పరిణమిస్తుందని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Myanmar's de facto leader Aung San Suu Kyi has "a last chance" to halt an army offensive that has forced hundreds of thousands of the mainly Muslim Rohingya to flee abroad, the UN head has said. Antonio Guterres told the BBC that unless she acted now, "the tragedy will be absolutely horrible".The UN has warned the offensive could amount to ethnic cleansing.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి