Russia Ukraine Crisis : చేతులెత్తేస్తున్న ఉక్రెయిన్-స్వాధీనం దిశగా రష్యా అడుగులు
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి 24 గంటలు దాటిపోయింది. తొలిరోజు కీలకమైన పోర్టులు, ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసుకుని క్షిపణిదాడులు కొనసాగించిన రష్యా.. భూభాగంపైనా ఉక్రెయిన్ ను చుట్టుముట్టింది. దీంతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీ పౌరుల్ని దృష్టిలో ఉంచుకుని పరిమిత దాడులు చేస్తున్నా తట్టుకునేందుకు ఉక్రెయిన్ అపసోపాలు పడుతోంది. దీంతో ఈ యుద్ధం తక్కువ సమయంలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న ముప్పేట దాడితో ఇప్పటివరకూ 137 మంది పౌరులు చనిపోయినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రెయిన్ దండయాత్ర మొదటి రోజు తన లక్ష్యాలన్నింటినీ సాధించిందని, 83 భూ-ఆధారిత ఉక్రెయిన్ లక్ష్యాలను ధ్వంసం చేసిందని తెలిపింది. రష్యా 203 దాడులకు పాల్పడిందని, అందులో కనీసం 137 మంది ఉక్రేనియన్లు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది.

ఉక్రెయిన్ సైన్యం ఖార్కివ్ సమీపంలో నాలుగు రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేసింది, లుహాన్స్క్ ప్రాంతంలోని ఒక పట్టణం సమీపంలో 50 మంది సైనికులను చంపింది. అళాగే తూర్పున ఆరు రష్యన్ యుద్ధ విమానాలను కూల్చివేసింది. తమ విమానం, సాయుధ వాహనాలు ధ్వంసమయ్యాయని వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులు రెండు ఉక్రెయిన్ విమానాలను కూల్చివేశారని పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యాపై అంతర్జాతీయంగా తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు తప్పేలా లేవు. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యాలో రెండు అతిపెద్ద బ్యాంకులైన సెబెర్ బ్యాంక్, వీటీబీ సహా నాలుగు అతిపెద్ద బ్యాంకులు దెబ్బతింటాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. అలాగే సున్నితమైన విడి భాగాలపై విధించిన ఎగుమతి నియంత్రణలు రష్యా హై-టెక్ దిగుమతుల్లో సగానికి పైగా తగ్గిస్తాయన్నారు. జరిమానాలు తీవ్రంగా ఉంటాయని, రష్యా ఆర్థిక వ్యవస్థపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని బిడెన్ చెప్పారు.












Click it and Unblock the Notifications