సడన్‌గా రూటు మార్చిన ఇజ్రాయెల్..
Israel attack on Gaza: కొద్ది రోజులుగా లెబనాన్, ఇరాన్‌పై దాడులు ప్రతిదాడులకు దిగుతూ వస్తోన్న ఇజ్రాయెల్.. తన రూటు మార్చింది. తాజాగా గాజాపై దృష్టి సారించింది. హమాస్‌ను లక్ష్యంగా చేసుకుంది. సెంట్రల్ గాజాలో హమాస్ స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది దుర్మరణం పాలయ్యారు. 94 మంది గాయపడ్డారు.
మొన్నటివరకు లెబనాన్, ఆ తరువాత ఇరాన్‌పై వరుస దాడులను చేపట్టింది ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు తనపై వేర్వేరుగా యుద్ధానికి దిగిన నేపథ్యంలో ప్రతిదాడులను నిర్వహించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బలగాలపై మిస్సైళ్లను సంధించింది.

లెబనాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా దారుణ హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇటీవలే ఇజ్రాయెల్‌పై దండెత్తిన విషయం తెలిసిందే. కొన్ని గంటల వ్యవధిలో 181 శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్ సహా అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఇరాన్ టార్గెట్‌లోకి వచ్చాయి.
హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది.
అదే సమయంలో ఒక్క ఇరాన్‌ను మాత్రమే కాకుండా లెబనాన్‌లో గల హెజ్బొల్లా స్థావరాలపైనా యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్. ఇప్పుడు హమాస్‌ను నిర్మూలించడంపై దృష్టి సారించింది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సెంట్రల్ గాజాలో గల దాయిరా అల్- బలాహ్‌లో గల హమాస్ స్థావరాలపై భారీగా బాంబులతో దాడి చేసింది. మిస్సైళ్లను సంధించింది.
ఈ ఘటనలో 24 మంది మరణించారు. 94 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ విషయాన్ని హమాస్ ధృవీకరించింది. మసీదు, దానికి ఆనుకుని ఉన్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడిందని ఆరోపించింది.
దాయిరా అల్- బలాహ్ ప్రాంతంలోని అల్ అక్సా ఆసుపత్రి సమీపంలో గల ఇబిన్ రుషద్ స్కూల్, షుహుద అల్ అక్సా మసీదు ఈ దాడిలో ధ్వంసం అయ్యానట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటోన్న వారిపై ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని హమాస్ విమర్శించింది.












Click it and Unblock the Notifications