శ్రీలంకలో ఇక కనిపిస్తే కాల్చివేత-నేతల ఇళ్ల దహనం, దాడులతో రంగంలోకి సైన్యం
ఆర్ధిక సంక్షోభం బారిన పడి ఆ తర్వాత రాజకీయ సంక్షోభానికి దిగజారిన శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించినా పరిస్ధితులు అదుపులోకి రావడం లేదు. అధ్యక్షుడు గోటబాట రాజపక్స కుటుంబంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి రాజకీయ నేతలపై దాడులు చేయడం, వాళ్ల ఇళ్లు తగులబెట్టడం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగుతోంది. ఇప్పటికే ఆర్మీకి ఆదేశాలు ఇవ్వడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లోకి తెచ్చింది.
శ్రీలంకలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినప్పటికీ ఆర్థిక సంక్షోభంపై హింసాత్మక నిరసనలు ఇప్పటివరకు కనీసం ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. రాజపక్స కుటుంబంతో సహా పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిపైనే దాడులకు దిగుతూ మరీ ప్రజలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతల్ని టార్గెట్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. వారి ధాటికి మాజీ ప్రధాని మహీంద రాజపక్స సైతం నావల్ బేస్ లో కుటుంబంతో సహా వెళ్లి దాక్కున్నారు. దీంతో అక్కడ పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

జైళ్లలో ఖైదీల్ని జనంపైకి వదిలి హింసకు ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మహీంద రాజపక్సపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం రోడ్లెక్కుతున్నారు. ఎమర్జెన్సీని, కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా సాగుతున్న ఈ నిరసనలతో ప్రభుత్వానికి ఊపిరాడటం లేదు. దీంతో దేశవ్యాప్తంగా కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు విపక్షాలతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు గోటబాట రాజపక్స చేస్తున్న ప్రయత్నాలు కూడా ముందుకు సాగడం లేదు. విపక్ష నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు నిరాశక్తత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో అధికారం చేతుల్లోకి తీసుకున్నా మార్పు కష్టమేనని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం.












Click it and Unblock the Notifications