వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కులు ధరించడం కొందరికి ఇష్టమే... ఎందుకని?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ముఖాన్ని దాచే మాస్కులు, ముసుగులను కొందరు ఇష్టపడతారు. సౌకర్యంగా ఉండటం మొదలుకుని... దాని వెనుక సంక్లిష్టమైన సైకలాజికల్ కారణాలు కూడా ఉంటాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది మేలుచేస్తుందా?

ఒక చోట కదలకుండా ఉండటం జే లీకి అంత కష్టమైన పని కాదు. ఇంట్లో కూర్చుని సినిమా చూడటం, ఆన్‌లైన్‌ ద్వారా ఆహారం తెప్పించుకోవటం అతడికి చాలా ఇష్టం. లీసెస్టర్‌లో నివసించే లీ వయసు 32 ఏళ్లు. ఓ చిరు వ్యాపారి. తాను అంతర్ముఖుడినని చెప్తాడు. 2020లో అతడు పలు కష్టాలు ఎదుర్కొన్నాడు. ఓ పెద్ద బ్యాంకులో చేస్తున్న ఉద్యోగం పోయిన వసంత కాలంలో పోయింది. కానీ అతడికి నచ్చిన ఒక అంశం కూడా గత ఏడాది అందించింది. అది ఫేస్ మాస్కులు విస్తృతంగా ఉపయోగించటం.

ఊర్లో పాత మిత్రులు, పరిచయస్తులకు ఎదురుపడటం అతడికి ఎప్పుడూ భయంగానే ఉండేది. ఈ ఆకస్మిక కలయికలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. షాపింగ్ చేయటానికి వెళ్లాలన్నా షాపులు మూసే సమయం వరకూ ఆగేవాడు.

''నేను మాస్కులు ధరించటం మొదలైనప్పటి నుంచీ స్నేహితులు, బంధువులతో ఆకస్మిక ఇబ్బందికర కలయికలు చాలా తగ్గిపోయాయి’’ అని చెప్తున్నాడు లీ. ఇప్పుడు తనను ఎవరైనా చూస్తారేమోననే ఆందోళన లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు షాపింగ్‌కు వెళ్తున్నాడు.

కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత కూడా మాస్కులు ధరించటం సామాజికంగా అంగీకారయోగ్యంగానే ఉంటుందని ఆశిస్తున్నాడు.

మాస్కు ధరించటం మనలో చాలా మందికి విసుగుపుట్టించే సమస్య. కానీ, కోవిడ్ నుంచి రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో త్యాగం చేస్తున్నాం. మనలో చాలా మంది ఈ మాస్కులు ధరించాల్సిన అవసరం లేని రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం.

మాస్కుల వల్ల మన కళ్లద్దాలపై శ్వాస ఆవిరి అలముకుంటుంది. చర్మం మీద స్వేదరంధ్రాలు మూసుకుపోతాయి. ఎదుటివారిని చూసి నవ్వలేం. స్నేహితులను గుర్తుపట్టలేం.

అయినా కానీ కొంతమంది ఈ మాస్కులు ధరించాలనే ఆదేశాల పట్ల చాలా సంతోషిస్తున్నారు. అందుకు కారణాలుగా.. అవి సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. సంక్లిష్టమైన సైకలాజికల్ అంశాలూ ఉన్నాయి.

అపరిచితులుగా ఉండటంలోని శక్తి

అందంగా కనిపించటం, వేషధారణ ఒత్తిళ్ల నుంచి కాస్త వెసులుబాటు లభిస్తుందని కొందరి సంతోషం. పాత మేకప్ పక్కనపెట్టేసిన వారు కొందరు. నిత్యం షేవింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కాస్త డబ్బులు, సమయం, ఒత్తిడి ఆదా చేస్తున్నవారు ఇంకొందరు.

నోటిని మాస్కుల కింద దాచటం వల్ల.. కస్టమర్లను చూసి నకిలీ నవ్వులు నవ్వాల్సిన అవసరం లేదని రెస్టారెంట్ సర్వర్లు చెప్తున్నారు. దీనివల్ల వారి మీద ఎమోషనల్ బరువు తొలగిపోతోంది.

''మహమ్మారి సమయంలో మనం తీవ్ర ఒత్తడిలో ఉన్నాం. మన అవతారం ఎలా ఉందోననే ఆందోళన కావచ్చు, ఎవరైనా మనన్ని వేధిస్తారనో, ఈల వేస్తారనో భయం కావచ్చు.. మనం బయటకు అడుగుపెట్టినపుడు మన మెదడులో సుడితిరిగే ఈ ఆలోచనల నుంచి మాస్కులు మనకు విముక్తి కలిగిస్తాయి. మనకు ముఖ్యమైన అంశాల గురించి ఆలోచించటానికి, లేదా ధ్యానం చేయటానికి మరింత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది’’ అంటారు న్యూయార్క్ లోని ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్, మెంటల్-హెల్త్ కౌన్సిలర్ కాథరిన్ స్టామోలిస్ వివరిస్తున్నారు.

ఇక కొందరికి ఈ మాస్కులు మానసిక, శారీరక రక్షణ కవచంలా ఉపకరిస్తున్నాయి. వార్విక్‌కు చెందిన 38 ఏళ్ల రచయిత, బిజినెస్ కన్సల్టెంట్ సౌరవ్ దత్.. ''తీక్షణమైన చూపులు, తేరిపార చూడటం, ఇబ్బందికరమైన తీర్పులు ఇవ్వటం, పై నుంచి కింది దాకా గుచ్చిగుచ్చి చూడటం’’ వంటి వాటి నుంచి మాస్కులు రక్షణ కల్పిస్తున్నాయని చెప్తున్నారు. కోవిడ్-19 దాడి చేయటానికి ముందు అతడు లండన్‌లో సంచరించే అనునిత్యం తనను చూసి ఎవరు ఏమనుకుంటున్నారో, తన అవతారం ఎలా ఉందో అనే ఆలోచనలతో సతమతమయ్యేవారు.

ఇప్పుడు అలాంటి ఆందోళన లేదని.. మాస్క్ వెనుక అపరిచితుడిగా ఉండటం వల్ల తనకు రక్షణ లభిస్తున్న భావన ఉందని ఆయన చెప్తున్నారు.

సోషల్ యాంగ్జయిటీ ఉన్న వారు భయపడే ఆకస్మిక కలయికల ఒత్తిడిని మాస్కులు తగ్గిస్తాయని స్టామోలిస్ వివరిస్తున్నారు. ''మాస్కులు ధరించి బయటకు వెళ్లటం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. ఎందుకంటే మన గుర్తింపును దాచిపెట్టవచ్చు. అంతేకాదు.. మన ముఖంలో వ్యక్తమయ్యే భావనలను సులభంగా విశ్లేషించటం కుదరదు. సిగ్గు పడటం, మాట తడబడటం వంటి భావోద్వేగ భౌతిక లక్షణాలు తగ్గిపోతాయి. అయిష్టంగానైనా పలకరించి, కబుర్లు చెప్పాలనే ఒత్తిడి లేకుండా పోతుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

''అపరిచితంలో శక్తి లభిస్తుంది’’ అంటారు లాస్ ఏంజెలెస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజిస్ట్, సైకాలజీ ప్రొఫెసర్ రమణి దుర్వాసుల. ''మాస్కు ధరించినపుడు మనం వేరే పాత్ర ధరించినట్లుగా భావించొచ్చు. మున మూడ్ బాగోలేకపోయినా నవ్వు తెచ్చిపెట్టుకోవటం వంటి కృత్రిమ స్పందనల అవసరం ఉండదు. ఇటువంటి ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

మాస్కులు చిన్నవే కావచ్చు. అవి మన శరీరాన్ని, కళ్లను, జుత్తును కప్పివేయవు. కానీ కేవలం మన నోటిని కప్పేయటం ద్వారా.. మన మనోభావాల వ్యక్తీకరణలను దాచేస్తాయి.

మాస్కులంటే ఇష్టపడేవారు

ముఖ్యమైన కలయికలను మిస్సవుతామా?

ఒత్తిడి కలిగించే సామాజిక సందర్భాల నుంచి మాస్కులు మనకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇవి దీర్ఘకాలంలో కొనసాగటం మంచిది కాకపోవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

''అంతర్ముఖంగా ఉండేవారికి మాస్కులు ధరించటం చాలా బాగుండొచ్చు. వారికి అంతగా తెలియని వారితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కానీ దీర్ఘ కాలంలో.. మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనని మనం సవాల్ చేసుకున్నపుడు.. ఒక మంచి సానుకూల సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు’’ అని స్టామోలిస్ పేర్కొన్నారు.

అలాగే.. ఆమె టీనేజీ పేషెంట్లలో చాలా మంది స్కూల్‌లో తరగతి గదులకన్నా జూమ్ క్లాసులే బాగున్నాయంటున్నారు. సహ విద్యార్థులతో కలిసి కూర్చోవటంలో ఉండే ఒత్తిడి ఇందులో అంతగా లేదని, టీచర్లతో నేరుగా మాట్లాడాల్సినప్పుడు ఉండే ఒత్తిడి కూడా లేదని వారు చెప్తున్నారు.

కానీ దీనివల్ల దీర్ఘకాలంలో వారు సోషల్ యాంగ్జైటీకి లోనయ్యే అవకాశం ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు.

మాస్కులంటే ఇష్టపడేవారు

టీనేజర్లే కాదు.. వయోజనులు కూడా తమకు మేలు చేసే, సంతోషకరమైన సామాజిక కలయికలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని స్టామోలిస్ చెప్పారు.

''సామాజిక కలయికల్లో రెండు నిమిషాల ముచ్చట కావచ్చు, పరస్పరం చిరునవ్వు నవ్వుకోవటం కావచ్చు.. అలాంటి సందర్భాలు ఎండార్ఫిన్లు రిలీజ్ చేస్తాయి. కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తాయి. అంటే మనలో ఒత్తిడి తగ్గుతుంది’’ అని ఆమె వివరించారు.

బహిరంగ ప్రదేశాల్లో పూర్తి అపరిచితులతో స్వల్ప సంభాషణలు సైతం మన మూడ్‌ను మెరుగుపరచగలవు. రైలు, బస్సు ప్రయాణాల్లో పక్క సీటులోని అపరిచితులతో సంభాషించేవారు.. మౌనంగా ఉన్న వారికన్నా (వారు అంతర్ముఖులు అయినప్పటికీ) సంతోషంగా ఉంటారని ఒక అధ్యయనంలో గుర్తించారు.

అయితే.. మాస్కులు ధరించటం వల్ల ఉండే దీర్ఘకాలిక పర్యవసానాల గురించి స్టామోలిస్ పెద్దగా ఆందోళన చెందనటం లేదు. ''మన పురోభివృద్ధి, భావోద్వేగ సంబంధాల విషయంలో ఇది ఏళ్లు, సంవత్సరాల తరబడి కొనసాగటం మంచిదని నేను అనుకోను. కానీ ప్రస్తుతం సార్వజనీనంగా మారిన ఒత్తిడి, ఆందోళనల్లో కొంతమందికి ఈ మాస్కులు కాస్త ఊరట కలిగించవచ్చు’’ అంటారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
some people still like to wear masks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X