పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి శ్రీలంక షాక్: నరేంద్ర మోడీ అంత రేంజ్ కాదు!, మరో కారణం కూడా
కొలంబో: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు శ్రీలంక ప్రభుత్వం షాకిచ్చింది. ఆ దేశ పర్యటనలో పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఇందుకు జమ్మూకాశ్మీర్ అంశమే కారణం కావడం గమనార్హం.

అందుకే ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం రద్దు..
ఇమ్రాన్ ఖాన్‌కు అంతర్జాతీయ వేదికలపై జమ్మూకాశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం అలవాటుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఇక్కడ కూడా ఆ అంశంపై మాట్లాడతారనే అనుమానంతో ఆయన ప్రసంగాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసింది. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతోంది.

నరేంద్ర మోడీకిచ్చిన ప్రాధాన్యత ఇమ్రాన్‌కు అవసరం లేదు
2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక పార్లమెంటులో ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, అంతటి ప్రాధాన్యతను పాక్ ప్రధానికి ఇవ్వాల్సిన అవసరం లేదని శ్రీలంక భావించినట్లు తెలుస్తోంది. ఆ దేశ మీడియాలో ఈ మేరకు వార్తలు కూడా రావడం గమనార్హం. అంతర్జాతీయ వేదికలపై జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం, అబద్ధాలు ప్రచారం చేయడంపై ఇప్పటికే భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 22న శ్రీలంకకు పాక్ ప్రధాని ఇమ్రాన్
కాగా, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 22 నుంచి రెండ్రోజులపాటు ఇమ్రాన్.. శ్రీలంకలో పర్యటించనున్నారు. పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు సాగుతాయని వెల్లడించాయి.

శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానితో భేటీ కానున్న ఇమ్రాన్
కోవిడ్ -19 మహమ్మారి తర్వాత దేశాన్ని సందర్శించిన తొలి దేశాధినేత ఖాన్ అవుతారని, పర్యటన సందర్భంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహీంద రాజపక్సే, విదేశాంగ మంత్రి దినేష్ గుణవర్ధనలతో చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం, ముస్లిం కరోనావైరస్ బాధితుల ఖననంపై శ్రీలంక ఇచ్చిన హామీని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. కరోనావైరస్ నుంచి మరణించిన వారిని ఖననం చేయడానికి ముస్లింలను అనుమతిస్తామని పార్లమెంటులో ప్రధాన మంత్రి మహీంద రాజపక్సే ఇచ్చిన హామీని స్వాగతిస్తూ ఖాన్ ట్వీట్ చేశారు. కాగా, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శ్రీలంకలో పర్యటించిన నెల రోజుల తర్వాత పాక్ ప్రధాని ఆ దేశంలో పర్యటించడం గమనార్హం.