నావల్ బేస్ లో దాక్కున్న శ్రీలంక మాజీ ప్రధాని మహీంద- నిరసనకారుల దెబ్బకు భయపడి
శ్రీలంకలో ఆర్దిక సంక్షోభం కాస్తా రాజకీయ సంక్షోభంగా కూడా మారిపోవడంతో అక్కడి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ప్రజాగ్రహం ఉందని తెలిసినా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన రాజపక్స కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా పదవులు వదులుకోవాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో వారంతా ఒక్కొక్కరిగా పదవుల నుంచి వైదొలుగుతున్నారు. అయినా ప్రజాగ్రహం చల్లారడం లేదు.
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభంతో తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రజాగ్రహం తట్టుకోలేక నిన్న తన పదవికి రాజీనామా సమర్పించిన ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నివాసాన్ని వీడారు.

ఎవరి కంటపడకుండా ఓ నావల్ బేస్ కు పారిపోయి తలదాచుకుంటున్నారు. శ్రీలంకలోని ట్రింకోమలీ నేవల్ బేస్‌లో మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, ఆయన కుటుంబ సభ్యులు కొందరు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో అక్కడ కూడా నిరసనలు చెలరేగాయి.న్యూస్‌వైర్ మీడియా కథనం ప్రకారం, కొలంబోలోని అధికారిక నివాసం నుంచి బయలుదేరిన తర్వాత మాజీ ప్రధాని, అతని కుటుంబ సభ్యులను నావికా స్థావరంలో ఉంచారు.ట్రింకోమలీ నేవల్ బేస్ ముందు మాజీ ప్రధాని మహీందా రాజపక్సే, అతని కుటుంబ సభ్యులు బస చేశారని ఒక ట్వీట్‌లో న్యూస్ వైర్ పేర్కొంది.

నిన్న రాజపక్సేను తొలగించాలని డిమాండ్ చేస్తున్న శాంతియుత ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై రాజపక్సే మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంకలో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం జరిగిన హింసలో ఐదుగురు చనిపోయారు. వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. అయినా నిరసనలు ఆగలేదు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతున్నా ప్రజలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. దీంతో పాటు ప్రధానితో పాటు అధ్యక్షుడు గోటబాయ రాజపక్స కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజపక్స సోదరుల వల్లే తమకు ఈ దుస్ధితి వచ్చిందని లంకేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications