భారత్ వర్సెస్ ట్రంప్..! 24 గంటల అల్టిమేటం-తీవ్ర హెచ్చరిక..!
అమెరికా, భారత్ మధ్య పోరు మరింత ముదిరింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్దంలో ఆ దేశానికి సాయం చేస్తుందన్న కారణంతో భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తానంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేశారు. ఇవాళ దానికి కొనసాగింపుగా మరింత తీవ్ర స్దాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి ఇంకా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై 24 గంటల్లో తీవ్ర స్ధాయిలో పన్నులు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.
భారతదేశం మంచి వాణిజ్య భాగస్వామి కాదని, ఎందుకంటే వారు మాతో చాలా వ్యాపారం చేస్తారు, కానీ మేము వారితో వ్యాపారం చేయమని ట్రంప్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాబట్టి తాము సుంకాల్ని 25శాతానికి పరిమితం చేసినట్లు తెలిపారు. కానీ రాబోయే 24 గంటల్లో తాను దానిని గణనీయంగా పెంచబోతున్నానని ట్రంప్ వెల్లడించారు. ఎందుకంటే భారత్ రష్యన్ చమురును ఇంకా కొనుగోలు చేస్తోందని తెలిపారు.

రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొంటూ దాన్ని అత్యధిక లాభాలకు అమ్ముకుంటోందంటూ భారత్ పై నిన్న ట్రంప్ విరుచుకుపడ్డారు. దీన్ని ఆపకపోతే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఇవాళ ఈ హెచ్చరికల తీవ్రత మరింత పెంచి 24 గంటల డెడ్ లైన్ కూడా ఇచ్చేశారు. నిన్న ట్రంప్ హెచ్చరికల తర్వాత స్పందించిన విదేశాంగశాఖ .. భారతదేశ దిగుమతులు ప్రపంచ మార్కెట్ పరిస్థితి వల్ల తప్పనిసరి అవసరం అయినప్పటికీ, దానిని విమర్శించే దేశాలు అటువంటి వాణిజ్యం కీలకమైన తప్పనిసరి కానప్పటికీ రష్యాతో వాణిజ్యంలో మునిగిపోతున్నాయంటూ విమర్శించింది.

భారత్ నుంచి ఈ ప్రకటన రావడం, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపకపోవడం వంటి కారణాలతో ట్రంప్ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. 24 గంటల్లో భారత్ పై తీవ్ర స్ధాయిలో సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికపై కేంద్రం స్పందించాల్సి ఉంది. అయితే రష్యా చమురు దిగుమతుల్ని మాత్రం ఆపేందుకు కేంద్రం నిరాకరిస్తూనే ఉంది. ట్రంప్ రేపు అత్యధిక సుంకాలు విధిస్తే ఇతర మార్కెట్లపై పోకస్ చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications