మోడీపై డాక్యుమెంటరీ-బీబీసీ నిషేధాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. !
భారత్ లోని గుజరాత్ లో 2002లో చోటు చేసుకున్న గోద్రా అలర్ల తర్వాత అక్కడ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ ఉద్దేశవూర్వకంగా అల్లర్లకు సహకరించారని ఆరోపిస్తూ బీబీసీ తాజాగా రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించింది. ఇది భారత్ ప్రతిష్ట దెబ్బతీయడంగా భావించిన కేంద్రం నిషేధం విధించింది. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులోపిటిషన్లు దాఖలయ్యాయి.
అదే సమయంలో ప్రధాని మోడీపై వివాదాస్పద డాక్యుమెంటరీని రూపొందించిన బీబీసీపై భారత్ లో నిషేధం విధించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హిందూసేన ఛీఫ్ విష్ణుగుప్తా చేసిన వాదనను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా విషయాన్ని తప్పుదోవన పట్టించేలా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాదు ఓ డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు ప్రశ్నకు బదులిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది పింకీ ఆనంద్.. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ మరో వాదన వినిపించారు. ఈ డాక్యుమెంటరీ వెనుక ఉన్న కుట్రపై జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ డాక్యుమెంటరీ మన దేశం, ప్రధాని ఎదుగుదలకు వ్యతిరేకంగా జరిగిన లోతైన కుట్రలో భాగమని వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అటువంటి ఆదేశాలను ఎలా జారీ చేస్తుందని ప్రశ్నించింది. రిట్ పిటిషన్ పూర్తిగా తప్పుగా అన్వయించారని, ఇందులో ఎలాంటి మెరిట్ లేదని, అందుకే కొట్టేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.












Click it and Unblock the Notifications