పాక్ ప్రతీకార దాడులు: 57 మంది తాలిబన్లు హతం
ఇస్లామాబాద్: పెషావర్‌లో సైనిక పాఠశాలపై కాల్పులకు తెగబడి వందలాది మంది విద్యార్థుల మరణానికి కారణమైన తాలిబన్లపై పాకిస్థాన్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. సైన్యం దాడిలో 57మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో పాక్ సైన్యం తాలిబన్ల స్థావరాలపై బుధవారం నుంచి పాకిస్థాన్ సైన్యం ఈ దాడులను జరుపుతోంది. ఖైబర్ ప్రాంతంలోని తాలిబన్ల స్థావరాలపై పాకిస్థాన్ వాయుసేన బుధవారం 20సార్లు దాడులను చేసిందని, ఈ దాడుల్లో 57మంది తాలిబన్లు మృతి చెందారని సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

పెషావర్‌లోని సైనిక పాఠశాలలో కాల్పులు జరిపిన తాలిబన్లు 132 మంది విద్యార్థులతోపాటు 16మంది పాఠశాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం తాలిబన్ల స్థావరాలపై దాడులకు దిగారు.
తమ దాడులను కొనసాగిస్తామని పాకిస్థాన్ తెలిపింది. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని బుధవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. కాగా, అంతకుముందు తమ కుటుంబాలపై పాకిస్థాన్ సైన్యం దాడులకు ప్రతీకారంగానే పెషావర్ పాఠశాలపై తాము కాల్పులకు పాల్పడ్డామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications