కాల్పుల మోత: ముగ్గురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. జార్జియా రాజధాని నగరం అట్లాంటాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు వివరాలను పోలీసులు వెల్లడించారు. బక్‌హెడ్ జిల్లాలోని పీచ్‌ట్రీ రోడ్డు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలిపారు.
ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు డ్రగ్స్ వ్యవహారమే కారణమైన ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించగా.. ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కాల్పుల్లో ఏ తరహా ఆయుధాలను వాడారో గుర్తించేందుకు ఘటన స్థలంలో లభ్యమైన తుపాకులను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదన్నారు. నిందితుల సమాచారం కూడా ఇంకా తెలియలేదన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఇది ఇలావుండగా, మనదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని ఆస్‌పూర్ దేవ్‌సర పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో గత శుక్రవారం హల్దీ వేడుకలో తుపాకీ కాల్పులకు 16 ఏళ్ల దళిత బాలుడు అజయ్‌కుమార్ మృతి చెందాడు. నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతోష్ సింగ్ ఆదివారం వెల్లడించారు. ఫూల్‌చంద్రదూబే కుమార్తె వివాహం శనివారం జరగవలసి ఉండగా ముందుగా నిర్వహించే హల్దీ వేడుకలో ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications