ట్రంప్ సంచలన నిర్ణయం: రష్యాపై ఆంక్షలు ఎత్తివేతకు యోచన! పుతిన్‌తో దోస్తీకి గ్రీన్ సిగ్నల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరలేపబోతున్నారా?. అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ వస్తున్న ట్రంప్, ఇప్పుడు ఏకంగా రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా జరిగితే, ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవచ్చని అటు విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యాపై ఆంక్షల తొలగింపునకు ముసాయిదా రెడీ?
ట్రంప్ రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలనే ఆలోచన వెనుక ప్రధాన కారణం మాస్కోతో సంబంధాలను మెరుగుపరచుకోవడమేనని తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు ,వ్యక్తులపై ఆంక్షలను తొలగించేందుకు ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని వైట్‌హౌస్, విదేశీ వ్యవహారాల, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను ఆదేశించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో అమెరికా అధికారులు రష్యా ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతేకాదు, రష్యా కుబేరులపై (ఒలిగార్క్‌లు) కూడా ఆంక్షలు ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.

చమురు ధరలకు బ్రేక్ ?
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత, అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మాస్కోపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో ఒకటైన రష్యాపై ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తే, చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట కలిగించవచ్చు.
ఉక్రెయిన్‌కు సైనిక సహాయం నిలిపివేత
ఇదిలా ఉండగా, ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చమురు ధరల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఐరోపా దేశాలు ఉక్రెయిన్ రక్షణ కోసం కంటే.. రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడానికే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాయని పేర్కొన్నారు.
ట్రంప్ నిర్ణయంతో కొత్త మలుపు?
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రష్యాపై ఆంక్షలు ఎత్తివేయడం మరియు ఉక్రెయిన్‌కు సైనిక సహాయం నిలిపివేయడం వంటి చర్యలు అమెరికా విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులకు సంకేతం అని చెప్పవచ్చు. అయితే, ఈ మార్పులు ఎంతవరకు ఫలిస్తాయి, ప్రపంచ శాంతి మరియు భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికైతే, ట్రంప్ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
రష్యా నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తోంది
అయితే, రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తే, అమెరికాకు మాస్కో నుండి ఏం లభిస్తుంది, వాషింగ్టన్ ఏం ఆశిస్తోంది అనే ప్రశ్నలు మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఆంక్షల ఉపశమనానికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం రష్యా నుండి ఏదైనా కీలకమైన హామీని కోరుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications