గంటల వ్యవధిలో మూడోసారీ 7.6 తీవ్రతతో పెను భూకంపం: వందలాది మంది మృతి
టర్కీని వరుస భూకంపాలు వెంటాడుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి విరుచుకుపడుతున్నాయి. టర్కీ, పొరుగునే ఉన్న సిరియాలో సంభవించిన భూకంపాల్లో 1,300 మందికి పైగా మృత్యువాతపడ్డారు. మధ్యాహ్నం మరోసారి భూమి ప్రకంపించింది.
ఇస్తాంబుల్: టర్కీ మరోసారి వణికింది. ఒకే రోజు మూడు పెను భూకంపాలు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. పొరుగునే ఉన్న సిరియాలోనూ ఇదే పరిస్థితి నెలకింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు భూకంపాలు సంభవించినప్పటికీ- ఈ స్థాయిలో మరణాల సంఖ్య ఎప్పుడూ నమోదు కాలేదు.
ఈ తెల్లవారు జాము నుంచి వరుసగా చోటు చేసుకున్న రెండు భూకంపాల్లో ఇప్పటికే 1,300 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఈ రెండు భూకంపాల ధాటికి కుప్పకూలిన భవనాల శిథిలాల నుంచి ప్రజలకు వెలికి తీసే చర్యలు శరవేగంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ భూమి ప్రకోపించింది.

తాజాగా కహ్రమన్మరాస్ ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ ప్రాంతంలో ఉంటుందీ ప్రావిన్స్. ఇక్కడి ఎల్బిస్తాన్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:24 నిమిషాలకు ఎల్బిస్తాన్ జిల్లాలో తాజా భూకంపం ఏర్పడింది.
ఎల్బిస్తాన్ కు పశ్చిమ దిక్కున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి ఏడు కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు వివరించింది.
7.6 büyüklüğündeki yeni #deprem sonrası Adana'da vatandaşlar büyük panik yaşadı
— Rudaw Türkçe (@RudawTurkce) February 6, 2023
Bir binanın sallanma anı kameralara yansıdı#SONDAKİKA pic.twitter.com/ckvAxCsnLC
భూ ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు సంభవిస్తోండటంతో వారిని మరింత భయాందోళనలకు గురి చేసింది. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడిపారు. పలు భవనాలు బీటలు వారాయి. కొన్ని చోట్ల కుప్పకూలాయి. ఈ తాజా భూకంపం వల్ల ఇప్పటి వరకు ప్రాణాపాయం సంభవించినట్లు వార్తలు అందలేదు.
కొన్ని చోట్ల భవనాలు కూలిపోయిన నేపథ్యంలో వాటి కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తోన్నారు. కాగా సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోనూ మూడోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. ఈ రెండు దేశాల్లో సంభవించిన వరుస భూకంపాలు ఇటలీలో సునామీ హెచ్చరికలకు కారణం అయ్యాయి. ఇటలీ తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications