పాక్ తో మరోసారి జతకట్టిన టర్కీ, అజర్ బైజాన్ ఆర్మీలు.. భారత్ నెక్ట్స్ స్టెప్ ఇదేనా..?
ఆగస్టు 14న పాకిస్థాన్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. ఈ మేరకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆర్మీ పరేడ్ జరిగింది. ఈ పరేడ్ లో పాకిస్థాన్ సైనికులతో పాటు టర్కీ, అజర్ బైజాన్ దేశాల సైనికులు సైతం పాల్గొన్నారు. కవాతు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిదాడిగా భారత్ పై పాకిస్థాన్ వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో విధ్వంసానికి పాల్పడింది.
అయితే ఆ డ్రోన్ లు, క్షిపణులను భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్-400 సమర్థవంతంగా నేలకూల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్లు, క్షిపణులను పాకిస్థాన్ కు టర్కీ, అజర్ బైజాన్ లు చేరవేశాయి. అంతేకాక ఇరు దేశాల నుంచి సైనికులను కూడా మోహరించాయి. అందుకు ప్రతీకారంగా టర్కీ వస్తువులను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పాకిస్థాన్ తో జతకట్టాయి టర్కీ, అజర్ బైజాన్ దేశాలు. పాకిస్థాన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాము పాకిస్థాన్ కు అండగా ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చాయి. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
🚨BREAKING: Türkiye and Azerbaijan's army join Pakistan's military parade on Independence Day, celebrating 78th independence of Pakistan. pic.twitter.com/1V98B5WMNh
— The Daily CPEC (@TheDailyCPEC) August 14, 2025
మరోవైపు పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా ఈ రాకెట్ ఫోర్స్ పనిచేస్తుందని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ లో భారత్ క్షిపణుల ధాటికి పాకిస్థాన్ అట్టుడికిపోయిన నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా భారత్ ను ఎదుర్కోవాలని పాకిస్థాన్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఇక పాకిస్థాన్ 78వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు జిన్నా స్టేడియంలో జరిగాయి. ఈ వేడుకలకు పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ఫీల్డ్ మార్షల్, ఆర్మీ ఛీఫ్ జనరల్ అసిమ్ మునీర్ , సైనిక అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పై నాలుగు రోజుల్లోనే విజయం సాధించామని అన్నారు. తాము భారత్ కు ఇచ్చిన గుణపాఠం ఆ దేశం ఎప్పటికీ మరచిపోదని కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications