కూలుతున్న ట్విట్టర్ మూలస్తంభాలు: సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయ గద్దె అవుట్..!!
వాషింగ్టన్: టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మూల స్తంభాలు కదులుతున్నాయి. ఒక్కటొక్కటిగా కూలుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా కంపెనీలో తాజా పరిణామాలు సంభవిస్తోన్నాయి. ఊహించినట్టే టాప్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఇంటిముఖం పట్టారు.

డీల్ ఓకే..
ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోవడానికి ఉద్దేశించిన 44 బిలియన్ డాలర్ల డీల్‌ను ఎలాన్ మస్క్ ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీని తరువాత ఆయన ఆఫీస్‌లో కూడా అడుగు పెట్టారు. లాంఛనంగా ఈ ప్రతిపాదనలకు ముగింపు పలికారు. టేకోవర్ కార్యక్రమాలకు తెర దించినట్టయింది. అమెరికా న్యాయస్థానం నిర్దేశించిన గడువు కంటే ముందే టేకోవర్ ప్రక్రియను ముగిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చీఫ్ ట్వీట్‌గా..
ట్విట్టర్ ఆఫీస్‌లోకి అడుగు పెట్టిన తరువాత తనను తాను చీఫ్ ట్వీట్‌గా అభివర్ణించుకున్నారు ఎలాన్ మస్క్. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ప్రొఫైల్‌ను కూడా మార్చుకున్నారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి గతంలో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. దీన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ఇదివరకే ఆయన ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

డెడ్‌లైన్ నేపథ్యంలో..
ట్విట్టర్ యాజమాన్యం దాఖలు చేసిన పిటీషన్ ఇటీవలే విచారణకు వచ్చింది. ఈ శుక్రవారంలోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. దీనితో ఆయన గడువు కంటే ముందే దీన్ని ముగింపు పలికారు. ట్విట్టర్ షేర్ హోల్డర్లు కూడా ఈ డీల్‌కు అంగీకరించిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లదలచుకోలేదు. ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను ముగించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ కార్యాలయంలో కూడా లాంఛనంగా అడుగు పెట్టారు.

పరాగ్ అగర్వాల్ అవుట్..
ఈ పరిణామాల తరువాత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుడ్‌బై చెప్పనున్నారు. ట్విట్టర్.. ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన నేపథ్యంలో తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దె కూడా తప్పుకోనున్నారు. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్ సైతం కంపెనీని వీడనున్నారు. 2012 నుంచీ సీన్ ఎడ్గెట్.. ట్విట్టర్‌లో కొనసాగుతున్నారు.

సరిగ్గా ఏడాది..
గత ఏడాది నవంబర్‌లో ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ అపాయింట్ అయ్యారు. సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పరాగ్ నియమితులయ్యారు. 10 సంవత్సరాలుగా ఆయన ట్విటర్‌లో పని చేస్తోన్నారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రమోట్ అయ్యారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడాన్ని ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్నారు.

తొలగించాల్సి వస్తే..
ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగ్రవాల్‌ను తొలగించాల్సిన పరిస్థితే వస్తే- ఆయనకు ఎంత నష్ట పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. 12 నెలల వ్యవధిలో ఈ అత్యున్నత హోదా నుంచి తొలగించాల్సి వస్తే- ట్విట్టర్ కొత్త మేనేజ్‌మెంట్ ఆయనకు 42 మిలియన్ డాలర్లను నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తాన్ని కంపెన్సేషన్‌గా చెల్లించి ఆయనను తొలగించే సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలు మొదట్లో వ్యక్తం అయ్యాయి. దీనికి భిన్నంగా పరాగ్ అగర్వాల్ తానే కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications