
బైడెన్ గేమ్ ఓవర్? - ట్విట్టర్ బాస్ ఎంట్రీ..!!
వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిన అనంతరం కీలక పరిణామాలు సంభవిస్తోన్నాయి. ఈ టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కేంద్రబిందువుగా చేసుకుని పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అవి కాస్తా ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి దారి తీస్తోన్నాయి. వివాదాలకు కారణమౌతోన్నాయి.

అమెరికా రాజకీయాల్లో..
అమెరికా రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటోన్నారు ఎలాన్ మస్క్. ఇదివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించారు. దీని కోసం ఆయన నిర్వహించిన ఓటింగ్‌లో మెజారిటీ ట్విట్టర్ యూజర్లు అనుకూలంగా తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో అకౌంట్‌ను రీయాక్టివేట్ చేశారు. దీన్ని డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ట్విట్టర్ అకౌంట్‌ను వాడదలచుకోలేదని ప్రకటించారు.

బైడెన్ కుమారుడిపై..
ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై దృష్టి సారించారు ఎలాన్ మస్క్. అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోన్న హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ కాంట్రవర్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సోషల్ మీడియా ట్విట్టర్ ఫైల్స్ అని పేరు పెట్టింది. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హంటర్ బైడెన్ ఎలా జోక్యం చేసుకున్నాడనే విషయాన్ని బయటపెట్టబోతోన్నానంటూ ప్రకటించాడు ఎలాన్ మస్క్.

వేలాది ఇంటర్నల్ డాక్యుమెంట్స్..
హంటర్ బైడెన్‌కు సంబంధించిన వేలాది ఇంటర్నల్ డాక్యుమెంట్స్.. ట్విట్టర్‌లో ఉన్నాయని, వాటన్నింటిని బహిర్గతం చేయబోతోన్నానని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అమెరికాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మ్యాట్ తైబ్బీ గతంలో రాసిన డాక్యుమెంట్లన్నీ ట్విట్టర్‌లో పోస్ట్ అయ్యాయి. అప్పట్లో హంటర్ బైడెన్ వివాదాలన్నింటినీ బ్లాక్ చేయాలంటూ ట్విటర్‌కు విజ్ఞప్తులు అందాయని వివరించారు.

ల్యాప్‌టాప్ కథనాలన్నీ..
హంటర్ బైడెన్‌కు చెందిన ల్యాప్‌టాప్ వివాదాలకు సంబంధించిన పోస్టులు ఏవీ ట్విట్టర్‌లో పబ్లిష్ కాలేదని తైబ్బీ స్పష్టం చేశారు. ఇందులో అప్పటి లీగర్ డిపార్ట్‌మెంట్ హెడ్ విజయా గద్దె కీలక పాత్ర పోషించారని వివరించారు. బైడెన్స్ సీక్రెట్ ఈమెయిల్స్ పేరుతో ప్రముఖ దినపత్రిక ది న్యూయార్క్ పోస్ట్ చేసిన కథనాలు కూడా ట్విట్టర్‌లో పబ్లిష్ కాలేదని తైబ్టీ చెప్పారు. దీని స్క్రీన్ షాట్‌ను ఆయన పోస్ట్ చేశారు.

అనైతిక కార్యకలాపాలు..
అప్పట్లో హంటర్ బైడెన్ అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అధ్యక్ష ఎన్నికల సమయంలో అవేవీ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని మ్యాట్ తైబ్బీ పేర్కొన్నారు. హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌లో అతని చరిత్ర మొత్తం ఉందని చెప్పారు. వ్యసనాలకు బానిస అయ్యాడని, ఓ మహిళతో లైంగిక చర్యల్లో పాల్గొన్నప్పటి 12 నిమిషాల నిడివి ఉన్న వీడియో కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అదే సమయంలో ట్విట్టర్ యాజమాన్యం డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను బ్లాక్ చేసిందని గుర్తు చేశారు.