వద్దంటే కుదరదు: టెక్ దిగ్గజం మెడకు ట్విట్టర్ డోలు: బలవంతంగా అంటగట్టేస్తారా?
వాషింగ్టన్: ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్, ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కష్టాలు మరింత పెరిగాయి. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చిన తరువాత తరచూ ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు. ఆయన ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల విలువ చేసే కొనుగోలు ఒప్పందాలపై ముందుకు వెళ్లాలని ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయించుకుంది.

వెబ్‌కాస్ట్‌గా..
దీనిపై షేర్ హోల్డర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఓటింగ్ రూపంలో ఈ అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన ఈ డీల్‌పై తాజాగా నిర్వహించిన షేర్ హోల్డర్ల ద్వారా ఓటింగ్‌లో అనుకూలంగా ఓట్లు పడ్డాయి. వెబ్‌కాస్ట్ రూపంలో ఈ ఓటింగ్ చేపట్టినట్లు ట్విట్టర్ టాప్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ విషయాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కూ తెలియజేసింది. ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు.

డీల్‌కు అనుకూలంగా..
దీన్ని లైవ్ ద్వారా చూసే అవకాశాన్ని కూడా కల్పించింది. వెబ్ కాస్ట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వివరించింది. ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల డీల్‌కు అనుకూలమా? ప్రతికూలమా? అనే విషయం మీద ఓటింగ్ నిర్వహించింది. మెజారిటీ షేర్ హోల్డర్లు ఈ డీల్‌ను అనుకూలంగా ఓటు వేశారు. తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఇప్పుడు తాజా పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

వెనక్కి తగ్గినా..
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి ఇదివరకే ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. దీన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ఇదివరకే ఆయన ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ట్విట్టర్ యాజమాన్యం దాఖలు చేసిన పిటీషన్ అక్టోబర్‌లో విచారణకు రానుంది. అదే సమయంలో షేర్ హోల్డర్లు కూడా ఈ డీల్‌కు అంగీకరించిన నేపథ్యంలో- ఈ న్యాయపోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

ఒక్కో షేర్‌కు..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్.. ట్విట్టర్ కొనుగోలు డీల్‌ను తెరమీదికి తీసుకొచ్చారు. ఒక్కో షేర్‌కు 54 డాలర్లను చెల్లించి కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు పంపించారు. దీనికి ట్విట్టర్ బోర్డ్ కూడా అంగీకరించింది. ఆయన పంపించిన ప్రతిపాదనలపై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ తరువాత మస్క్ వెనక్కి తగ్గారు. స్పామ్ అకౌంట్స్ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ తొలుత దాన్ని టెంపరరీగా హోల్డ్‌లో పెట్టారు. ఆ తరువాత పూర్తిగా రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications