US elections 2020: బైడెన్ లాంటి చెత్త అభ్యర్థిని అమెరికా ఎన్నికల చరిత్రలో చూడలేదన్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శలు, ప్రతి విమర్శల తీవ్రత మరింత పెరుగుతోంది .రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా ట్రంప్ మరోసారి బైడెన్ పై నోరు పారేసుకున్నారు. బైడెన్ లాంటి చెత్త అభ్యర్థిని అమెరికా ఎన్నికల చరిత్రలోనే తాను ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు.
యూఎస్ ఎలక్షన్ టైమ్ లో కరోనా ఉధృతి .. కోటికి చేరువగా కేసుల వేగం .. ట్రంప్ కొంప ముంచేస్తుందా ?

బైడెన్ వస్తే అమెరికా మరో వెనిజులాగా మారుతుందని ట్రంప్ ఫైర్
ప్రస్తుత ఎన్నికలు అమెరికా కలలకు సోషలిస్టుల పీడకలలకు మధ్య జరుగుతున్నాయని పేర్కొన్న ట్రంప్ తీవ్రపదజాలంతో బైడెన్ పై విమర్శల వర్షం కురిపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మెలానియా తో కలిసి టంపాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్ ఒకవేళ బైడెన్ అధికారంలోకి వస్తే అమెరికా వెనుజులాలా మారిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. అత్యంత చెత్త అభ్యర్థి పై పోటీ చేయాల్సి రావడం బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

సర్వేలపై స్పందించిన ట్రంప్.. ఎవరెన్ని చెప్పినా రిపబ్లికన్ల విజయం ఖాయం
బైడెన్ సోషలిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అని , ఆయన అధికారంలోకి వస్తే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా వస్తున్న సర్వేలపై స్పందించిన ట్రంప్ ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు కష్టపడి పనిచేసే వారికే ఓటు వేస్తారని రిపబ్లికన్ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగేళ్లు తాను వైట్ హౌస్ లో ఉండటం ఖాయమని ఆయన గట్టిగా చెప్పుకొచ్చారు. ఒకపక్క సర్వేలన్నీ బైడెన్ కు అనుకూలంగా చెప్తున్నా ట్రంప్ మాత్రం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు .

సోషలిజం మాయలో పడి భవిష్యత్ పాడు చేసుకోవద్దన్న ట్రంప్
ఒకవేళ అమెరికన్లు దురదృష్టవశాత్తు డెమోక్రాట్ లకు అధికారం ఇస్తే అమెరికా మరో వెనిజులా లాగా తయారై పోతుందని సోషలిజం మాయలోపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అంటూ ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను అధికారంలో ఉన్నంత వరకు అమెరికా ఎట్టిపరిస్థితుల్లోనూ సోషలిస్టు దేశంగా మారదు అని డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మనం మార్క్సిస్టుల కు, సోషలిస్టులకూ, అల్లరి మూకలకు, వామపక్ష తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం .. వారిని ఓడించబోతున్నామంటూ ట్రంప్ తన ప్రసంగంలో ప్రజలకు ఉద్వేగంగా చెప్పారు .

హద్దులు మీరి మరీ మాటల యుద్ధం ... అధ్యక్ష పీఠమే టార్గెట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్లు, డెమోక్రాట్లు తమ స్థాయిని మరిచి వాదప్రతివాదాలకు , వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. హద్దులు మీరి మరీ మాటల యుద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ మరోసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతున్న వేళ ప్రత్యర్థిపై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. మరి అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికన్లు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికర అంశం .