ఒమిక్రాన్ విస్ఫోటం: లక్షకు చేరువగా: ఆ ఒక్కచోటే 37 వేలకు పైగా కేసులు
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. కల్లోలం రేపుతోంది. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే 89 దేశాలకు పైగా దేశాలకు పాకిందీ వేరియంట్. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. భారత్‌లో 150 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చాయి. యూరప్ దేశాలతో పోల్చుకుంటే భారత్ చాలా బెటర్ అనేలా ఉంది పరిస్థితి. బ్రిటన్, యూరప్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

బ్రిటన్‌పై పంజా..
ప్రత్యేకించి బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. భయానకంగా విస్తరించింది..విస్తరిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలో 12,133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. ఎంత వేగంగా అది వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 37,101కి చేరింది. బ్రిటన్ ఆరోగ్య సంరక్షణా ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఒమిక్రాన్ మరణాల సంఖ్య సైతం పెరుగుదల బాట పట్టింది. ఇప్పటిదాకా ఏడుమంది ఈ వేరియంట్ బారిన పడి ప్రాణాలు వదిలారు. తొలి మరణం ఈ ఇంగ్లీష్ కంట్రీలోనే నమోదైన విషయం తెలిసిందే.

ఏడు మరణాలు..
దీని ప్రభావం రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై పడుతోంది. బ్రిటన్‌లో ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,886. ఇందులో ఒమిక్రాన్ కేసుల వాటా 12,133. వందలాది మందికి చెందిన నమూనాలు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల దశలో ఉన్నాయి. ఆ రిపోర్టులు వచ్చిన తరువాత ఈ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని- బ్రిటన్ లాక్‌డౌన్‌లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

శరవేగంగా పెరుగుతున్న కేసులు..
ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల 62 వేలను దాటింది. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. మూడే మూడు రోజుల్లో ఒకటిన్నర రెట్ల మేర ఒమిక్రాన్ కేసులు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వేగం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. క్రిస్మస్, కొత్త ఏడాది సెలవులు, వేడుకలను దృష్టిలో ఉంచుకుని కఠిన ఆంక్షలను విధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

తొలి 10 దేశాలివే..
అత్యధిక ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదు చేసిన దేశాల జాబితాలో బ్రిటన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ వేరియంట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకొనే దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 150కి చేరుకుంది. ఇరాన్‌లో కొత్తగా తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రిజిస్టర్ అయింది.

డెల్టా కంటే డేంజరస్..
ఇదివరకు కరోనా వైరస్‌కు సంబంధించిన ఒకట్రెండు వేరియంట్లు బయటపడ్డాయి. అవి పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. డెల్టా, డెల్టా వేరియంట్, ఇతర మ్యూటెంట్లు అదృష్టశావత్తూ కరోనా వైరస్ తీవ్రతను పెంచలేకపోయాయి. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేశాయి. దాన్ని నియంత్రించగలిగాయి. ఫలితంగా డెల్టా ప్లస్ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ వేరియంట్ల బారిన పడి మరణించిన వారి సంఖ్య పరిమితంగా నమోదైంది.

అత్యంత ప్రమాదకరంగా..
కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ మాత్రం అత్యంత ప్రమాదకరమైనదిగా తయారైంది. డెల్టా వేరియంట్ల కంటే మూడు నుంచి మూడున్నర రెట్లు తీవ్రతను కలిగి ఉంది. అంతే వేగంతో వ్యాప్తి చెందే లక్షణం దీనికి ఉంది. అందుకే- చాలా వేగంగా ఈ వేరియంట్ అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. భారత్ సహా ఇప్పటిదాకా 39 దేశాల్లో వ్యాప్తి చెందిందీ ఒమిక్రాన్ వేరియంట్. ఇది అక్కడితో ఆగేలా లేదు. రోజుకో కొత్త దేశంలో అడుగు పెడుతోంది.












Click it and Unblock the Notifications