జెలెన్ స్కీ భావోద్వేగం- బతికే ఉన్నాం, పోరాడుతున్నాం..బైడెన్ కూ, అమెరికాకు థ్యాంక్స్.. !
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై 10 నెలలు గడుస్తున్నా ముగింపుపై మాత్రం క్లారిటీ రావడంలేదు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అసాధారణ పోరాటం ఓ ఎత్తయితే, పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా అందిస్తున్న సహకారం మరో ఎత్తు. మరోవైపు రష్యా తాజాగా అసహనంతో అణుదాడి హెచ్చరికలు చేస్తోంది. దీంతో అమెరికా సాయం అర్ధించిన జెలెన్ స్కీ.. ఆ దేశంలో పర్యటించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ తాజా పరిణామాలపై చర్చించిన జెలెన్ స్కీ.. అనంతరం యూఎస్ కాంగ్రెస్ లో కీలక ప్రసంగం చేశారు. ఇందులో పలు కీలక విషయాల్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రష్యాతో యుద్ధంతో తమకు అడుగడుగునా అండగా నిలుస్తున్న అమెరికాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూఎస్ కాంగ్రెస్ తో పాటు అమెరికాలోని సాధారణ ప్రజలకు సైతం ధన్యవాదాలు చెబుతున్నట్లు జెలెన్ స్కీ యూఎస్ కాంగ్రెస్ లో చేసిన ప్రసంగంలో తెలిపారు. అంతేకాదు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ పోరాటంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

యూఎస్ కాంగ్రెస్‌లో, మీతో, అమెరికన్లందరితో మాట్లాడటం తనకు లభించిన గొప్ప గౌరవమని జెలెన్ స్కీ తెలిపారు.
తాము అనుభవిస్తున్న చీకటి గురించి భయంలేదని, ఉక్రెయిన్ ఇప్పటికీ సజీవంగా ఉందని, పోరాడుతోందని జెలెన్ స్కీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు.
ప్రపంచంలో మనసుల విషయంలో జరిగిన యుద్ధంతో తాము ఇప్పటికే రష్యాను ఓడించినట్లు జెలెన్ స్కీ తెలిపారు. ఆయన ప్రసంగం సమయంలో యూఎస్ కాంగ్రెస్ లో ముగ్గురు సభ్యులు ఉక్రెయిన్ జెండాను కూడా ప్రదర్శించారు.
ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సాయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రిపబ్లికన్లు కూడా ఇప్పుడు జెలెన్ స్కీకు అండగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications