మోదీ పెద్దన్న పాత్ర: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్ కాల్- కీలక ఫార్ములా
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్న నేపథ్యంలో దీనికి ఉద్దేశించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి. బెంగళూరు, ముంబై, జైపూర్‌లల్లో సన్నాహక సదస్సులు ముగిశాయి.

హాజరయ్యేది వీరే..
జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

జెలెన్‌స్కీ ఫోన్..
ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఈ సదస్సులో ప్రతిపాదించాల్సిన అంశాల గురించి చర్చించారు.

పీస్ ఫార్ములా..
ప్రపంచ శాంతి అంశాన్ని జీ20 శిఖరాగ్ర సదస్సులో పొందుపర్చాలని, దీన్ని ప్రధాన అంశంగా తీసుకోవాలని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ శాంతి అంశంపై ప్రధాని మోదీ ఈ సదస్సులో చర్చిస్తారని తాను ఆశిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా దాడుల్లో ఛిన్నాభిన్నమైన తమ దేశానికి మానవతా దృక్పథం కింద సహాయాన్ని ప్రకటించడం, ఐక్యరాజ్య సమితిలో తమకు అండగా నిలవడం పట్ల మోదీకి కృతజ్ఞతలు తెలిపానంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.

హోరాహోరీపోరు..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి అంతు ఉండట్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం ఇది. నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి ఈ రెండు దేశాలు కూడా. ఈ పోరులో ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

పలు నగరాలపై..
ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికి ధీటుగా ఉక్రెయిన్ సైన్యం బదులిస్తోంది. కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది.












Click it and Unblock the Notifications