భారత్, చైనా ఒకేమాట: ఐక్యరాజ్యసమితి ఎమర్జెన్సీ సెషన్: ఓటింగ్..
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన యుద్ధం అయిదో రోజుకు చేరుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. క్షిపణులను సంధించుకునే స్థాయికి చేరింది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనిక బలగాలు చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.. తిప్పి కొడుతోంది. ప్రతిదాడులను మరింత ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన ఖార్కీవ్ వంటి కొన్ని నగరాలను కోల్పోయిన నేపథ్యం- కీవ్‌ను కాపాడుకోవడానికి ఆ దేశ సైనికులు సర్వశక్తులను ఒడ్డుతున్నారు.

అణ్వాయుధం పేరుతో..
మరోవంక- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి సమాయాత్తమౌతున్నారనే సమాచారం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తే- సంభవించే పెను నష్టం, ప్రభావం అంచనాలకు అందని విధంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రష్యా దూకుడును నిలువరించడానికి యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా వంటి పలు దేశాలు ఏకం అయ్యాయి. రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలను విధించాయి. అయినప్పటికీ- ఆ దేశం వెనుకంజ వేయట్లేదు.

భద్రత మండలి మరోసారి భేటీ..
ఈ పరిస్థితుల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భద్రత మండలి పలుమార్లు అత్యవసరంగా సమావేశమైంది. శాశ్వత, సభ్య దేశాల అభిప్రాయాలను సేకరించింది. ఆయా దేశాలన్నీ కూడా రష్యాను తప్పు పట్టాయి. ఆర్థిక పరకమైన ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తీర్మానించాయి. రష్యాతో స్నేహసంబంధాలను కొనసాగిస్తోన్న భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు మాత్రం ఐక్యరాజ్య సమితి భధ్రత మండలిలో నిర్వహించిన చర్చల్లో తటస్థంగా ఉన్నాయి.

ఐరాస అత్యవసర సమావేశానికి..
ఇప్పుడు మళ్లీ తాజాగా భద్రత మండలి సమావేశమైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఉగ్రరూపాన్ని దాల్చడం పట్ల సభ్య దేశాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. వ్లాదిమిర్ పుతిన్- అణ్వాయుధ మంత్రాన్ని జపిస్తుండటాన్ని తప్పు పట్టాయి. ఈ విషయంలో ఇక ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని సూచించాయి. అత్యంత అరుదుగా చోటు చేసుకునే ఐక్యరాజ్య సమితి అత్యవసర భేటీని నిర్వహించాల్సి ఉంటుందని తీర్మానించాయి.

15 దేశాల ఓటింగ్..
ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా భేటీ నిర్వహించడానికి సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. ఓటింగ్ ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. దీనికోసం ఓటింగ్‌ను నిర్వహించాయి భద్రత మండలి సభ్యదేశాలన్నీ. మొత్తం 15 దేశాలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సమితి అత్యవసర సమావేశానికి అనుకూలంగా 11 ఓట్లు పోల్ అయ్యాయి. వ్యతిరేకంగా ఒక్క ఓటు పోల్ అయింది. అది రష్యాది.

తటస్థంగా భారత్, చైనా, యుఏఈ
దీనితో అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా భేటీ కానుంది. రష్యా-ఉక్రెయిన్‌పై కీలక తీర్మానం చేయనుంది. కాగా- ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. తటస్థ వైఖరిని అనుసరించింది. భద్రత మండలిలో భారత్‌కు తాత్కాలిక సభ్యత్వం ఉన్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదా అనుకూలంగా గానీ.. వ్యతిరేకంగా గానీ ఓటు వేయలేదు. తటస్థంగా వ్యవహరించింది భారత్.

11వ సారి మాత్రమే..
భారత్‌తో పాటు చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. దూరంగా ఉన్నాయి. ఐరాస అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా రష్యా ఓటు వేసింది. 1950 తరువాత ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా సమావేశం కాబోతోండటం ఇది 11వ సారి మాత్రమే. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐరాస సభ్య దేశాలన్నీ చర్చించనున్నాయి.












Click it and Unblock the Notifications