అదానీ కేసులో బిగ్ ట్విస్ట్-అరెస్టు వారెంట్ నిలిపివేత..?
భారతీయ బిలియనీర్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీపై లంచం, మోసం ఆరోపణలపై అమెరికా కోర్టులో మోపిన అభియోగాలు, అరెస్టు వారెంట్ వ్యవహారంలో భారీ ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటివరకూ సోలార్ కాంట్రాక్టుల కోసం అదానీతో పాటు మరో ఏడుగురు భారత్ లో వివిధ ప్రభుత్వాలకు 2 వేల కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన అమెరికా ఎఫ్బీఐ వీరిపై అభియోగాల నమోదుతో పాటు అరెస్టు వారెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే అమెరికా కోర్టులో ఏం జరిగిందో పరిశోధించింది. ఇందులో గౌతం అదానీపై నమోదైన నేర అభియోగాలతో పాటు అరెస్టు వారెంట్ ను గత నెలలోనే కోర్టు రద్దు చేసినట్లు తెలిసింది. అక్టోబర్ 31న వాటిని రద్దు చేయాలని న్యాయమూర్తి రాబర్ట్ ఎమ్ లెవీ ఆదేశించారని ఇండియా టుడే పేర్కొంది. విదేశీ చట్ట అమలు సంస్థలకు కేసు పత్రాలను అందించడానికి నేరారోపణ, అరెస్టు వారెంట్‌ను నిలిపేశారని తెలుస్తోంది.

వాస్తవానికి అమెరికా చట్టాల ప్రకారం నిందితులు స్వచ్ఛందంగా కోర్టుకు హాజరవుతారనే బలమైన అంచనా లేకపోతే కోర్టులు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాయి.కానీ ఇక్కడ అలాంటి పరిస్ధితి లేదని యూఎస్ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించినట్లు తెలుస్తోంది. ఆయన సిఫార్సు ఆధారంగా గౌతం అదానీపై అరెస్టు వారెంట్ రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ భారీగా రుణాలు సేకరించిన అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుండి ఈ వాస్తవాన్ని దాచిపెట్టారని అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అదానీ గ్రూప్ 20 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాభాలను ఆర్జించగలదని అంచనా వేశారు. దీంతో ఈ వ్యవహారంపై తదుపరి ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications