గెలుస్తున్నాం.. గొడవలొద్దు: అప్పటిదాకా శాంతం, సహనం: కమలా హ్యరిస్‌తో కలిసి: జో బిడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అనుమానాలు, ఆందోళనలు చెలరేగుతోన్న వేళ.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. తాము గెలవబోతున్నామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తాము విజయం సాధించామని అధికారికంగా ప్రకటించడానికి ఎక్కవ సమయం తీసుకోకపోవచ్చని చెప్పారు. త్వరలో వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నానని, అధ్యక్షుడిగా తానను, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ను అమెరికన్లు ఎన్నుకున్నారని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకూ ఓపికగా ఉండాలని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.
ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్నారని, రీకౌంటింగ్ చేపట్టాలంటూ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు కొన్ని నగరాల్లో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో ఓ బ్యాలెట్ల లెక్కింపు కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆగ్రహించిన రిపబ్లికన్ మద్దతుదారులు చికాగో, న్యూయార్క్, టెక్సాస్, పోర్ట్‌ల్యాండ్ వంటి నగరాల్లో రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అవి హింసాత్మకంగా రూపుదాల్చాయి. డెమొక్రటిక్ మద్దతుదారులతో ఘర్షణలకు దారి తీశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో జో బిడెన్.. పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి డెల్వర్‌లోని విల్మింగ్టన్ నుంచి మాట్లాడారు. తన గెలుపుపై ఎవరికీ సందేహాలు వద్దని సూచించారు. ఫలితాలు ముగిసేసరికి తాను, కమలా హ్యారిస్ ఛాంపియన్లుగా ఆవిర్భవించబోతున్నామని అన్నారు. చిట్టచివరి ఎన్నికల ఫలితం వెలువడేంత వరకూ శాంతంగా ఉండాలని, సహనాన్ని కోల్పోవద్దని ఆయన డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులకు సూచించారు. విజయానికి అతి చేరువగా ఉన్నామని, ఈ పరిస్థితుల్లో ఎవరూ తన గెలుపుపై అనుమానాలను పెట్టుకోవద్దని అన్నారు. నిస్సందేహంగా తామే గెలవబోతున్నామని స్పష్టం చేశారు.
అమెరికన్ల కలలు నిజం చేసే ప్రభుత్వం ఇంకొన్ని రోజుల్లో ఏర్పడటం ఖాయమని బిడెన్ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ఓటూ ఎంతో విలువైనదని, అమెరికన్ల ఆశలను ప్రతిబింబింపజేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి ఓటును తప్పనిసరిగా లెక్కించక తప్పదని, ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరగొచ్చని అన్నారు. అందుకే- చిట్టచివరి ఓటును లెక్కించేంత వరకూ సహనంతో ఉండాలని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే సహనంగా ఉండాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications