వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఎన్నికలు: తదుపరి అధ్యక్షుడు ఎవరో ఈ రోజే తేలిపోతుందా? ఫలితాలు ఆలస్యమవుతాయా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమెరికా ఎన్నికలు

అమెరికా అధ్యక్ష పదవికి మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి.ఇందులో గెలిచేది ఎవరో తెలియడానికి ఎంత సమయం పడుతుందన్నదే అసలు ప్రశ్న.

ఫలితాలు రాత్రి వరకూ తేలుతాయా? ఇంకా ఆలస్యమవుతాయా? కౌంటింగ్‌కు సంబంధించిన వ్యవహారాలు కోర్టు దాకా వెళ్లి, కొన్ని రోజుల పాటు వేచిచూడాల్సి వస్తుందా? ఇవన్నీ ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్న సందేహాలు.

ఎందుకు ఈ గందరగోళం?

2016 అమెరికా ఎన్నికల్లో 3.3 కోట్ల మంది అమెరికన్లు పోస్టు ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది కరోనావైరస్ సంక్షోభం కారణంగా 8.2 కోట్ల మంది పోస్టు ద్వారా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు.

అయితే, పోస్టల్ ఓట్లు అన్నీ లెక్కలోకి రావడం లేదు. ఇందుకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి.

అమెరికా ఎన్నికలు

ఉదాహరణకు మిషిగన్ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది పోస్టు ద్వారా ఓటు వేస్తారని అంచనా.

అయితే, మిషిగన్ సహా కొన్ని రాష్ట్రాల్లో పోస్టల్ ఓట్ల లెక్కింపును పోలింగ్ రోజున ఉదయం ఏడు గంటలకు మొదలు పెడతారు. వీటిని లెక్కించి, ఫలితం ప్రకటించడానికి చాలా సమయం పట్టొచ్చు.

కరోనావైరస్ సంక్షోభం, ఎన్నికల కారణంగా పోస్టల్ సేవలు సరిగ్గా నడవడం లేదు. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అమెరికా పోస్టల్ సర్వీస్‌కు అత్యవసర నిధులు రాకుండా చేశారు.

ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారుల కన్నా, అధికార రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులే నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారని ఇదివరకటి ఎన్నికల సమాచారం సూచిస్తోంది.

అమెరికా ఎన్నికలు

పోస్టు ద్వారా ఆలస్యంగా అందిన బ్యాలెట్లను ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారు. అందులో ఇతర లోపాలున్నా, రహస్య ఎన్వెలప్ సరిగ్గా లేకపోయినా కూడా వాటిని తిరస్కరించవచ్చు.

అయితే, అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా మరీ దగ్గరగా ఉన్నప్పుడు, తిరస్కరించిన బ్యాలెట్ల గురించి ఎవరైనా కోర్టుల్లో దావాలు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా జరిగితే, ఫలితం మరింత ఆలస్యమవుతుంది.

ఈ సారి పోస్టు ద్వారా వచ్చే ఓట్లు భారీ స్థాయిలో ఉండటంతో, తిరస్కృత బ్యాలెట్లు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.

2016 ఎన్నికల్లో ట్రంప్ మిషిగన్ రాష్ట్రంలో 11వేల ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఇదే మిషిగన్‌లో ఆగస్టులో ప్రైమరీ ఎన్నికల సమయంలో ప్రధానంగా ఆలస్యంగా వచ్చాయన్న కారణంతో 10 వేల బ్యాలెట్లను తిరస్కరించారు.

ఓట్ల తేడా మరీ తక్కువగా ఉంటే, తిరస్కృత బ్యాలెట్ల విషయం పెద్ద వివాదంగా మారొచ్చు.

పోస్టల్ ఓట్ల ఆలస్యంతో సంబంధం లేకుండా, సాధారణ పోలింగ్‌ను బట్టే ఫలితం తేలవచ్చు. కానీ, అందుకు అభ్యర్థి మెజార్టీ చాలా ఎక్కువగా ఉండాలి.

బైడెన్

రాత్రికే ఫలితం వస్తుందా?

అధ్యక్ష పదవి దక్కాలంటే ట్రంప్ గానీ, బైడెన్ గానీ 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తెచ్చుకోవాలి.

అమెరికాలో ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఎంత మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఉండాలన్నది జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణయిస్తారు.

2016 ఎన్నికల్లో విస్కాన్సిన్ రాష్ట్రం ఫలితాలు వెల్లడవ్వడంతో ట్రంప్‌ విజయానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్ల మార్కును చేరుకున్నారు.

అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ ఒకే పార్టీకి మొగ్గు చూపుతుంటాయి. వీటిని ఆయా పార్టీలకు 'సేఫ్’ రాష్ట్రాలు అంటారు. అలాగే, ఒకే పార్టీకి మొగ్గు చూపని రాష్ట్రాలను 'స్వింగ్’ రాష్ట్రాలు అంటారు.

మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో పోలింగ్ రోజునే పోస్టల్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇవి స్వింగ్ రాష్ట్రాలే. ఈ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా ఒకవేళ తక్కువగా ఉంటే రీకౌంటింగ్, దావాలతో ఫలితం ఆలస్యం కావొచ్చు.

డోనల్డ్ ట్రంప్, అమెరికా ఎన్నికలు

స్వింగ్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఫ్లోరిడా రాష్ట్రానికి 29 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఫలితాల్లో ఈ రాష్ట్రానిది నిర్ణయాత్మక పాత్ర.

ఫ్లోరిడాలో పోలింగ్ రోజుకు 40 రోజుల ముందు నుంచే పోస్టల్ ఓట్ల తనిఖీ మొదలవుతుంది. కాబట్టి, ఆ రాష్ట్రంలో రాత్రి వరకూ ఫలితాలు రావొచ్చు.

ఒపినీయన్ పోల్స్‌లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ముందంజలో కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయన ఫ్లోరిడాలో ఓడిపోతే, రాత్రిలోపే ఆయన విజయం ఖాయం అయ్యే అవకాశాలు తక్కువ. అయితే, ఉత్తర కరోలినా, అరిజోనా, ఐయోవా, ఒహాయో రాష్ట్రాల్లో అనుకూల ఫలితాలు వస్తే, ఆయనకు ఆధిక్యం దక్కవచ్చు.

బైడెన్, అమెరికా ఎన్నికలు

ఇక ఒపినీయన్ పోల్స్‌ ప్రకారం వెనుకంజలో ఉన్న ట్రంప్, ఒకవేళ ఫ్లోరిడాలో గెలిచినా విజయం ఖాయం అయ్యే అవకాశాలు కాస్త తక్కువే. స్వింగ్ రాష్ట్రాల్లో చాలా వరకూ ఫలితాలు రాత్రి లోపు రాకపోయే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం.

అయితే, ఒపినీయన్ పోల్స్ అంచనాలు తప్పొచ్చు.

2016 ఎన్నికల్లో ఇదే జరిగింది.

టీవీ నెట్‌వర్క్‌లు తేలుస్తాయా?

ఎన్నికల ఫలితాల వెల్లడిలో అమెరికా మీడియా పోషిస్తున్న పాత్ర కాస్త కలవరపెట్టేదే.

ఇదివరకటి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కూడా పూర్తికాకముందే చాలా టీవీ నెట్‌వర్క్‌లు విజేత ఎవరన్నది 'ప్రకటించేశాయి’.

మీడియా ఇలా 'ప్రకటించిన’ తర్వాత 'ఓడిపోతున్న’ అభ్యర్థి సాధారణంగా బయటకువచ్చి ఓటమిని అంగీకరించడం సంప్రదాయం. ఇదంతా పోలింగ్ రోజు రాత్రే జరుగుతుంది. ఆ తర్వాత 'గెలిచిన’ అభ్యర్థి తమ విజయాన్ని ప్రకటించుకుంటారు.

కానీ, లెక్కించాల్సిన పోస్టల్ ఓట్లు భారీగా ఉండటంతో అవన్నీ తేలేవరకూ అమెరికా మీడియా ఓపిక పడుతుందా అన్నది ఇప్పుడు మనం వేచి చూడాలి.

జార్జ్ బుష్

2000 ఎన్నికల్లో జార్జ్ బుష్, అల్ గోరె పోటీపడ్డప్పుడు రేగిన గందరగోళమే ఇప్పుడు కూడా తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

అప్పుడు పోటీ చాలా తీవ్రంగా ఉందని ఒపినీయన్ పోల్స్ సూచించినా, ఫ్లోరిడాలో గోరే విజేత అని కొన్ని టీవీ నెట్‌వర్క్‌లు ప్రకటించాయి. ఆ తర్వాత ప్లేటు మార్చి మళ్లీ బుష్‌ను విజేతగా ప్రకటించాయి. ఆ తర్వాత గోరే తన ఓటమిని అంగీకరించారు.

కానీ, ఫ్లోరిడాలో పోటీ అనుకున్నదాని కన్నా తీవ్రంగా జరిగిందని తర్వాత అర్థమైంది. దీంతో గోరే తన అంగీకారాన్ని వెనక్కితీసుకున్నారు. ఈ అంశం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. 36 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా గోరేకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ప్రకారం మాత్రం బుష్ నెగ్గారని తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
New President of US will be known today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X