అమెరికా అనూహ్య చర్య- న్యూయార్క్‌లో మాజీ రా ఏజెంట్‌పై కేసు ఫైల్
Former Intelligence Officer: దౌత్యపరంగా భారత్- కెనడా మధ్య కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విభేదాలు భగ్గుమన్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాదుల అంశం దీనికి ప్రధాన కారణం. తొలుత తమ దేశంలో ఉన్న భారత రాయబారులపై కెనడా బహిష్కరణ వేటు వేయగా.. భారత్ కూడా అలాంటి చర్యే తీసుకుంది. భారత్‌లో కెనడా రాయబారులను బహిష్కరించింది.
ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని, ఈ కేసు దర్యాప్తులో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రకటించడం.. ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగడానికి కారణమైంది. ఆయన చేసిన ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితులే అమెరికాలోనూ తలెత్తాయి. ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నారనే కారణంతో భారత గూఢచర్య విభాగం.. రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)కు చెందిన మాజీ అధికారిపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ రే తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఆ రా మాజీ అధికారి పేరు వికాస్ యాదవ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనపై తరచూ ఘాటు విమర్శలు చేస్తోండటం, అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తోన్నారనే కారణంతో ఖలిస్తానీ వేర్పాటువాది గుర్‌పట్వంత్ సింగ్ పన్నుమ్‌ను హతమార్చడానికి వికాస్ యాదవ్.. గత ఏడాది మే లో కుట్ర పన్నారు.
దీనికోసం భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఇది తమ నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ వెల్లడించారు. మన్‌హట్టన్‌లో వికాస్ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నివేదికను మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టుకు సమర్పించారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను యూఎస్ అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ విడుదల చేశారు. తమ దేశ పౌరసత్వం ఉన్న వారిని హత్య చేయడానికి కుట్ర పన్నడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి కుట్రలు అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల ప్రతిష్ఠను దిగజార్చుతాయని, దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయనీ వ్యాఖ్యానించారు.
కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన సమయంలోనే గుర్‌పట్వంత్ సింగ్ పన్నుమ్‌ను కూడా మట్టుబెట్టాలనేది వికాస్ యాదవ్ లక్ష్యమని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో భారత్ నుంచి ప్రేగ్ వెళ్లిన నిఖిల్ గుప్తాను అక్కడి భద్రత సిబ్బంది అరెస్ట్ చేసి, తమ దేశానికి పంపించినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications