భారత్-యూఎస్ డీల్ ఖరారు ? 15-20 శాతానికి సుంకాలు ! కండిషన్స్ అప్లై..!
రష్యా నుంచి డిస్కౌంట్ పై భారీగా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారన్న కారణంతో గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకాల కారణంగా భారత ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఓవైపు దేశీయ ఉత్పత్తుల్ని పెంచుతున్న కేంద్రం.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతూనే ఉంది. ఈ చర్చలు ఇప్పుడు ఫలించేలా కనిపిస్తున్నాయి.
భారత్ పై ప్రస్తుతం ఉన్న 50 శాతం సుంకాల్ని కనీసం 15-16 శాతానికి తగ్గించేందుకు అమెరికా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ప్రతిగా రష్యా చమురు దిగుమతుల్ని వెంటనే పూర్తిగా కాకపోయినా క్రమంగా తగ్గించాలని షరతు పెట్టినట్లు సమాచారం. రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్ పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్దితి లేదని తేలిపోవడంతో కనీసం క్రమంగా అయినా తగ్గించుకునేందుకు భారత్ అంగీకరిస్తే సుంకాల తగ్గింపును ఖరారు చేసేందుకు అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరుతో ఆసియాన్ సదస్సు ఉంది. దీనికి ముందే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా కథాలు ప్రచురిస్తోంది. అయితే రష్యా చమురు దిగుమతుల తగ్గింపు షరతుతో అమెరికా సుంకాల తగ్గింపుకు అంగీకరించిందన్న వార్తలపై ఇరువర్గాలు ప్రస్తుతానికి నోరు మెదపడం లేదు. అయితే రష్యా చమురు దిగుమతులు క్రమంగా తగ్గించుకోవడంతో పాటు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు భారీగా కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించాల్సి ఉంటుంది. ఇందులో జన్యువులతో కాకుండా సహజంగా అభివృద్ధి చేసిన సోయా మీల్, కార్న్ ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే భారత వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్ ను తిరిగి తెరిచేందుకు ఆ దేశం అంగీకరిస్తుంది. అలాగే భారతీయ వస్త్రాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు స్వీకరించేందుకు కూడా అంగీకరించనుంది. దీపావళి సందర్భంగా భారత్-అమెరికా అధినేతలు మోడీ, ట్రంప్ చర్చల నేపథ్యంలో ఈ డీల్ ఖరారుకు ఇరువర్గాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, ఇంధన అంశాల ప్రాతిపదికన ఈ డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications