కోట్ల డాలర్లు కుమ్మరించినా తప్పని ఓటమి.. అగ్రరాజ్యంలో బిలియనీర్లకు బిగ్ షాక్!
అమెరికా రాజకీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచిన 2026 మధ్యంతర ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. బిలియనీర్ల అపరిమిత ఆర్థిక అండదండలు, భారీ విరాళాలు, ఇజ్రాయెల్ అనుకూల లాబీయింగ్ గ్రూపుల కోట్లాది డాలర్ల ప్రకటనల ప్రచారం ఉన్నప్పటికీ.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అమెరికా చట్టసభలైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిలోనూ రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని కోల్పోయి డెమోక్రాట్లకు మెజారిటీని అప్పగించాల్సి వచ్చింది.
చరిత్రలోనే అతిపెద్ద పొలిటికల్ ఫండింగ్
రాజకీయ నిధుల సమీకరణను పర్యవేక్షించే 'ఓపెన్ సీక్రెట్స్' నివేదిక ప్రకారం.. ఈ మధ్యంతర ఎన్నికల వ్యయం ఊహించని స్థాయిలో దాదాపు 11.9 బిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ.98,000 కోట్లు) చేరింది. అత్యధికంగా విరాళాలు ఇచ్చిన మొదటి 50 సంస్థలు, దాతల లెక్కలను పరిశీలిస్తే రిపబ్లికన్ వర్గానికి చెందిన కోటీశ్వరులు ఏకంగా 1.67 బిలియన్ల డాలర్లు గుమ్మరించగా.. డెమోక్రటిక్ మద్దతుదారుల దాతలు మాత్రం 832 మిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేశారు.

రిపబ్లికన్లకు మద్దతుగా నిలిచిన బిలియనీర్లలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఒక్కరే ఈ ఎన్నికల చక్రంలో దాదాపు 446 మిలియన్ డాలర్ల భారీ నిధులను అందించారు. వీరితో పాటు రిచర్డ్-ఎలిజబెత్ 150 మిలియన్ డాలర్లు, జెఫ్-జెనిన్ యాస్ 110 మిలియన్ డాలర్లు, మిరియమ్ అడెల్సన్ 67 మిలియన్ డాలర్లు వెచ్చించి రిపబ్లికన్ల విజయానికి కోట్ల డాలర్లను నీళ్లలా ఖర్చు చేశారు.
ఇజ్రాయెల్ లాబీయింగ్ గ్రూపుల హవా.. ఫలితాల్లో భంగపాటు!
ఈ ఎన్నికల ప్రచారంలో ఇజ్రాయెల్ మద్దతుగల పొలిటికల్ యాక్షన్ కమిటీలు వెచ్చించిన నిదులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల కోసం పనిచేసే ప్రముఖ లాబీయింగ్ సంస్థ 'ఏఐపాక్'(AIPAC), దాని అనుబంధ సూపర్పాక్ 'యునైటెడ్ డెమోక్రసీ ప్రాజెక్ట్' డెమోక్రటిక్ పురోగతిని అడ్డుకునేందుకు భారీగా నిధులను రంగంలోకి దించాయి. 'ఏఐపాక్' దాదాపు 30 మిలియన్ డాలర్లు ఇవ్వగా.. దాని సూపర్పాక్ 53.6 మిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. మొత్తం ఇజ్రాయెల్ అనుకూల సంస్థలు చేసిన ప్రచార వ్యయం 70.8 మిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే ఈ నిధులన్నీ ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చినవి కావు. అమెరికా చట్టాల ప్రకారం విదేశీ ప్రభుత్వాలు లేదా పౌరులు అమెరికా ఎన్నికలకు ఆర్థిక నిధులు సమకూర్చడం నిషేధం.
కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసినా దాటి విజయం సాధించారు..
కోట్లాది డాలర్లు వెచ్చించి ఓడించాలని చూసినప్పటికీ.. పలువురు డెమోక్రాట్ అభ్యర్థులు ఓటర్ల ఆదరణతో ఘన విజయం సాధించి విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచారు. మిచిగాన్ రాష్ట్ర సెనేట్ రేసులో పోటీ చేసిన అబ్దుల్ ఎల్-సయ్యద్‌ను ఓడించేందుకు ప్రో-ఇజ్రాయెల్ సంస్థలు ఏకంగా 22.3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.185 కోట్లు) ఖర్చు చేసి తీవ్ర ప్రతికూల ప్రకటనల ప్రచారం నిర్వహించాయి. అయినప్పటికీ అబ్దుల్ ఎల్-సయ్యద్ తన సమీప రిపబ్లికన్ ప్రత్యర్థి మైక్ రోజర్స్‌పై ఘన విజయం సాధించారు.
ఓటర్ల నిర్ణయానని మార్చిన ప్రధానాంశాలు
అత్యధిక ధనబలం ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ఓడిపోవడానికి అమెరికాలోని ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విపరీతంగా పెరిగిన జీవన వ్యయం, నిత్యావసరాల ధరలు ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని నింపాయి. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా శైలి, వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానాలపై సాధారణ పౌరుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ సర్కారు ఇరాన్ దేశంపై ప్రారంభించిన యుద్ధం సృష్టించిన ఆర్థిక భారం, ప్రాణనష్టం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనబలం, భారీ రాజకీయ విరాళాలు, నెగెటివ్ ప్రచారాలు మాత్రమే ఎన్నికల విజయాలను ఖరారు చేయలేవని 2026 మధ్యంతర ఎన్నికలు స్పష్టం చేశాయి.














Click it and Unblock the Notifications
