Ramayana Review: రణబీర్ రాముడిగా ప్రశాంతం.. రావణుడిగా యష్ విధ్వంసం! ‘రామాయణ ’ ఎలా ఉందంటే?
Ramayana Review: భారతీయ ఇతిహాసాల్లో 'రామాయణ' గాథకు విశిష్టమైన స్థానం ఉంది. తరతరాలుగా కథలుగా వింటూ, బుల్లితెరపై వీక్షిస్తూ పెరిగిన ఈ పవిత్రమైన కథను డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో నమిత్ మల్హోత్రా నిర్మాణంలో 'రామాయణ పార్ట్-1'గా వెండితెరపైకి తీసుకువచ్చారు.రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి అగ్ర తారలతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
రామాయణ పార్ట్-1లో నేరుగా శ్రీరాముడు, రావణాసురుని మధ్య జరిగే మహా సంగ్రామానికి వెళ్లకుండా, పాత్రల స్వభావం, భావోద్వేగాలు, కథా పునాదిని బలంగా స్థాపించడంపై డైరెక్టర్ దృష్టి పెట్టారు. అయోధ్య రాజకుమారుడిగా శ్రీరాముడి ప్రారంభ జీవితం, విశ్వామిత్రునితో ప్రయాణం, మిథిలా నగరంలో శివధనస్సును ఎత్తి సీతాదేవిని పరిణయమాడటం వంటి ఘట్టాలతో స్టోరీ ప్రారంభమవుతుంది. అయితే కైకేయి కోరిన వరాల వల్ల శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్యవాసానికి సిద్ధపడటం, ఆయనను అనుసరిస్తూ సీతాదేవి, లక్ష్మణుడు అడవికి పయనం కావడం వంటి కీలక ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శూర్పణఖ ఘట్టం, మారీచుని స్వర్ణ లేడి ఉదంతం, రావణాసురుడు సీతను అపహరించే కీలక సన్నివేశాలతో మొదటి భాగాన్ని ముగించి సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలను పెంచారు.

నటీనటులు ఎలా నటించారంటే?
ఈ సినిమాలో నటీనటుల ఎంపిక అతిపెద్ద ప్లస్ పాయింట్. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ అత్యంత వినయం, ధర్మబద్ధత, శాంత స్వరూపాన్ని అద్భుతంగా పండించారు. శ్రీరాముడిని అనవసరమైన ఆవేశంతో చూపించకుండా పాత్రలోని ప్రశాంతతను, ఆంతరంగిక శక్తిని ఎంతో హుందాగా ఆవిష్కరిచారు. సీతాదేవిగా సాయి పల్లవి తన సహజ నటన, రాజసం, ఆత్మస్థైర్యంతో మెప్పించారు. ఇక రావణాసురుడిగా నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, గాంభీర్యం, నటనలోని తీవ్రత సినిమాకు సరికొత్త గంభీరతను తెచ్చి పెట్టాయి. లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా భావోద్వేగ, ప్రముఖ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్‌స్కోర్ అద్భుతంగా కుదిరింది. ప్రపంచ ప్రసిద్ధ వీఎఫ్ఎక్స్ సంస్థ 'DNEG' అందించిన విజువల్ ఎఫెక్ట్స్ భారతీయ సినిమాలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదించినప్పటికీ.. క్లైమాక్స్ సన్నివేశాలు ఆ లోపాన్ని పూర్తిగా సరిదిద్దాయి. అయితే కొన్ని చోట్ల లిప్-సింక్ సరిగ్గా కుదరలేదనే సాంకేతిక లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
మొత్తం మీద..
మొత్తంగా చూస్తే రామాయణ పార్ట్-1 అనేది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు.. వెండితెరపై ఆవిష్కృతమైన ఓ విజువల్ వండర్. శ్రీరాముడు, రావణాసురుని మధ్య రాబోయే మహా యుద్ధానికి ఇది బలమైన పునాది వేసింది. ముఖ్యంగా అద్భుతమైన విజువల్స్, నటీనటుల అత్యుత్తమ ప్రదర్శన, సంగీతం కోసం ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఫైనల్‌గా.. తప్పక చూడాల్సిన బిగ్ స్క్రీన్ వండర్!
*రేటింగ్: 3.5/5.













Click it and Unblock the Notifications
