వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులకు తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పిల్లలకు చేసే మసాజ్ వల్ల ప్రయోజనాలుంటాయని అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి.

బెంగళూరుకు చెందిన రేణు సక్సేనా అక్టోబరు నెలలో బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె నెలలు నిండక ముందే 36వ వారంలోనే బిడ్డను కన్నారు. ఆమె బిడ్డ ఎంత బలహీనంగా ఉందో ఆమెకు అర్ధమయింది. ఆ శిశువు అతి చిన్న నరాలు పల్చని శరీరంలోంచి కనిపిస్తున్నాయి. శిశువు 2.4 కేజీల బరువుతో పుట్టారు. అయితే, ఆ చిన్నారికి వెంటనే మసాజ్ మొదలుపెట్టమని ఆమె కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారు. కానీ, ఆమె డాక్టర్లు మాత్రం బిడ్డ బరువు పెరిగే వరకూ మసాజ్ మొదలుపెట్టవద్దని సూచించారు.

సక్సేనా ఒక రెండు వారాల వరకూ ఎదురు చూడాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ రెండు వారాల్లో బిడ్డ బరువేమీ చెప్పుకోదగినంత పెరగలేదు. సక్సేనా పసిపిల్లల సంరక్షణ చూసుకునే ఒక రిటైర్డ్ నర్సును బిడ్డ సంరక్షణ కోసం కుదుర్చుకున్నారు. ఆమె దగ్గర నుంచి పిల్లలకు మసాజ్ చేసే విధానాన్ని నేర్చుకున్నారు. మసాజ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచీ పరిస్థితులు మెరుగవ్వడం మొదలయింది. చిన్నారి పూర్తిగా నిద్రపోవడం మాత్రమే కాకుండా బరువు కూడా పెరిగింది.

దక్షిణాసియాలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు చేసే మసాజ్ వల్ల కూడా ప్రయోజనాలుంటాయని అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి.

మసాజ్‌ను సరైన రీతిలో చేయడం ద్వారా బిడ్డ బరువు పెరగడం మాత్రమే కాకుండా, బ్యాక్టీరియా ద్వారా సోకే ఇన్ఫెక్షన్‌లను కూడా నివారిస్తుందని, శిశు మరణాలను 50శాతం వరకు తగ్గిస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, తమ పిల్లలకు మసాజ్ చేయాలని అనుకునే తల్లితండ్రులు ముందుగా తమ పిల్లలకు అది సురక్షితమో కాదో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించడం మంచింది.

శాస్త్రీయ అధ్యయనాలు సంప్రదాయ పరిజ్ఞానాన్ని బలపరిచాయి. సక్సేనా అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసేవారు. ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారు. ఈ రాష్ట్రంలో బాలింతలకు, పుట్టిన బిడ్డలకు కూడా పుట్టిన దగ్గర నుంచీ మసాజ్ చేసే సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది.

"మేము పుట్టిన తర్వాత మా అమ్మగారు త్వరగా ఎలా కోలుకున్నారో వివరిస్తూ ఉండేవారు. నాకు, నా తోబుట్టువులకు పుట్టిన వెంటనే మసాజ్ ఎలా మొదలుపెట్టారో చెప్పేవారు" అని సక్సేనా చెప్పారు.

సక్సేనా నియమించిన నర్సు, మసాజ్ కు వాడే తైలాలను ఎలా వేడి చేయాలో, కొబ్బరి నూనె, బాదం నూనెలను మార్చి మార్చి వాడే విధానం, రోజూ అరగంట సేపు వాటితో చిన్నారి శరీరాన్ని మర్దనా చేసే విధానాన్ని నేర్పించారు. మసాజ్ తర్వాత వేడి నీటితో స్నానం చేయించేవారు.

"మేము ముందుగా సున్నితంగా, చిన్నారి పొట్టపై హృదయాకారంలో మృదువుగా స్ట్రోక్స్ ఇస్తూ నెమ్మదిగా శరీరంలోని ఇతర భాగాలను కూడా మర్దనా చేసేవాళ్ళం" అని చెప్పారు.

చిన్నారికి మసాజ్

''చిన్నారులకు మసాజ్ చేయడం ద్వారా వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వారికి యుక్త వయస్సు వచ్చే వరకు నిలిచి ఉంటాయి" అని పరిశోధనకారులు చెబుతున్నారు.

"శరీరంలో చర్మం అన్నిటి కంటే పెద్ద అవయవం. కానీ, చర్మ సంరక్షణకు ఇచ్చే ప్రాధాన్యతను మిగిలిన అవయవాల కంటే బాగా తగ్గిస్తాం" అని స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ స్కూలుకు చెందిన నియో నటల్ ప్రొఫెసర్ గేరీ డార్మ్‌స్టాట్ చెప్పారు.

ఆయన బంగ్లాదేశ్, భారత్‌లలో పర్యటించినప్పుడు, ఈ దేశాల్లో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు.. పుట్టిన పిల్లలకు మసాజ్ చేసే ప్రక్రియను గమనించారు.

"ఈ ప్రక్రియను కొన్ని శతాబ్దాలుగా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఆ తర్వాత దీని గురించి అధ్యయనం చేయడం ప్రారంభించాను" అని చెప్పారు.

బంగ్లాదేశ్‌లోని ఒక ఆసుపత్రిలో నెలలు నిండకుండా పుట్టిన, ప్రతీ రోజూ మసాజ్ చేసిన 497 మంది శిశువుల పై నిర్వహించిన అధ్యయనంలో ఈ సంప్రదాయ పద్ధతి పిల్లల ప్రాణాలను కాపాడగలదని డార్మ్‌స్టాట్ ఆయన సహచరులు కనుగొన్నారు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు సోకడంలో 40% తగ్గుదల, శిశు మరణాల్లో 25-50 % తగ్గుదల కనిపించినట్లు తెలిపారు.

శిశువులకు తరచుగా మసాజ్ చేయడం ద్వారా మైక్రోబయోమ్ తయారయేందుకు సహాయపడుతుందని వేర్వేరుగా నిర్వహించిన వివిధ ట్రయల్స్‌లో కనుగొన్నారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్లను తరిమి కొట్టేందుకు ప్రభావవంతమైన నిరోధకంగా పని చేయడంలో మైక్రోబయోమ్ కీలకమైన పాత్రను పోషిస్తుంది.

పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు కూడా వివిధ రకాల తైలాలతో మసాజ్ చేసినప్పుడు మైక్రోబయోమ్ వృద్ధి చెందినట్లు కనుగొన్నారు.

ఈ తైలాలతో మసాజ్ చేయడం ద్వారా శరీరం గట్టిపడి సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వ్యాపించి రక్తంలోకి చేరడాన్ని కష్టతరం చేసి ప్రాణాపాయ రోగాలు రాకుండా కాపాడుతుంది.

నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణ విషయంలో ఈ అధ్యయన ఫలితాలు చాలా కీలక పాత్ర వహిస్తాయి.

"నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో చర్మంపై నిరోధకాలు సక్రమంగా పని చేయవు. దాంతో, శరీరంలోంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దాంతో పాటూ, శరీరంలోని ఉష్ణం కూడా తగ్గిపోతూ ఉంటుంది. శిశువు హైపో థెర్మిక్ కండీషన్ కు సులభంగా లోనవుతారు. శరీర ఉష్ణోగ్రతలు బాగా పడిపోతే, అది ప్రాణానికి ముప్పు కావచ్చు. శిశువు ఎదుగుదలకు, ఇతర శరీర క్రియలకు వినియోగించాల్సిన శక్తిని ఈ ఉష్ణాన్ని కోల్పోవడానికి వినియోగించడం వల్ల కూడా చాలా శక్తిని కోల్పోతారు" అని డార్మ్‌స్టాట్ చెప్పారు.

దక్షిణాసియా దేశాల్లో పుట్టిన పిల్లలకు మసాజ్ చేసే సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది.

డార్మ్‌స్టాట్ అతని బృందంతో కలిసి ఉత్తర్ ప్రదేశ్‌లోని 26,000 మంది శిశువులపై అధ్యయనం నిర్వహించారు.

అందులో సగం మందిని సన్‌ఫ్లవర్ నూనెతోనూ, మిగిలిన సగం మందిని ఆవనూనెతోనూ మసాజ్ చేశారు.

అయితే, పిల్లలందరిలోనూ ఎదుగుదల కనిపించినట్లు అధ్యయనకారులు గమనించారు.

అయితే, సాధారణ బరువుతో పుట్టిన వారిలో ఏర్పడిన శిశు మరణాల్లో దీని ప్రభావం పెద్దగా కనిపించినప్పటికీ, తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మాత్రం ఈ మసాజ్ ప్రక్రియ 52 శాతం వరకూ మరణం ముప్పును తగ్గించినట్లు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ఇంకా ప్రచురించాల్సి ఉంది.

ఇటువంటి ప్రయోజనాలనే ఇతర అధ్యయనకారులు కూడా కనుగొన్నారు.

మసాజ్ చేయడం వల్ల వేగస్ నరాన్ని (మెదడు నుంచి పొట్టకు అనుసంధానంగా ఉండే నరం) ప్రేరేపిస్తుందని మరో అధ్యయనం తెలిపింది. దీంతో, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసి శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో, పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

రోజూ పొట్టను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, నొప్పి కూడా తగ్గుతాయి. ఇది నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు చాలా ముఖ్యం.

"పుట్టిన పిల్లలకు మసాజ్ చేయమని సూచిస్తాం" అని అమెరికాలోని మియామి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో చిన్న పిల్లల వైద్య నిపుణులు టిఫాని ఫీల్డ్ చెప్పారు.

ఆమె వివిధ దేశాల్లో నెలలు నిండకుండా పుట్టిన పిల్లల పై మసాజ్ ప్రభావం గురించి చేసిన అధ్యయనాలను పరిశీలించి ఈ విధానాన్ని ప్రచారం చేస్తున్నారు.

"తేలికపాటి ఒత్తిడితో శరీరాన్ని కదల్చాలి. కానీ, మరీ మృదువుగా చేయడం వల్ల చిన్నారికి కితకితలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలందరూ మసాజ్ ప్రక్రియను ఆస్వాదించలేకపోవచ్చు" అని ఆమె చెప్పారు.

దక్షిణాసియా దేశాల్లో పుట్టిన పిల్లలకు మసాజ్ చేసే సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది.

డార్మ్‌స్టాట్ కూడా మధ్యే విధాన్నాన్నే అవలంబించాలని చెబుతున్నారు.

"ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు గట్టిగా రుద్ది మసాజ్ చేయకూడదు" అని చెప్పారు. అది హానికరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అలాగే, మసాజ్‌కు వాడే తైలాన్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలని చెప్పారు.

ఇందు కోసం కేవలం సంప్రదాయాలను అనుసరిస్తే సరిపోదని అన్నారు.

2013లో దక్షిణ భారతదేశంలో 194 మంది శిశువుల పై నిర్వహించిన అధ్యయనంలో చిన్నారుల తల్లులు చేసే మసాజ్‌లో పిల్లల చెవిలో కంటిలో నూనె వేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటివి చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని అధ్యయనకారులు హెచ్చరించారు.

"సరైన మెళకువలను పాటించి మసాజ్ చేసేందుకు దీని గురించి మరింత విస్తృత అవగాహన అవసరం" అని మంగుళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో కమ్యూనిటీ మెడిసిన్ నిపుణులు నితిన్ జోసెఫ్ అన్నారు.

సన్ ఫ్లవర్ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె అన్నీ ఒకే లాంటి ప్రయోజనాలు కలుగచేస్తాయని డార్మ్ స్టాట్ బృందం చేసిన అధ్యయనం చెప్పింది.

"ఈ నూనెల్లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో తయారవ్వదు" అని డార్మ్‌స్టాట్ చెప్పారు.

ఈ ఫ్యాటీ ఆమ్లాలను గ్రహించేందుకు శరీరంలో గ్రాహకాలు ఉంటాయి. దాంతో, అది శరీరంలోకి చేరుతుంది. నూనెల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయనడానికి అధ్యయనాలున్నాయని చెప్పారు.

దక్షిణాసియా దేశాల్లో పుట్టిన పిల్లలకు మసాజ్ చేసే సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది.

"కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లో ఆవ నూనెను విరివిగా వాడతారు. ఇందులో యూరిసిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో వాపును కలుగచేసి, చర్మం పై ఉండే నిరోధకాలు హాని చేసే ప్రమాదం ఉంది" అని డార్మ్ స్టాట్ చెప్పారు.

పుణెకు చెందిన ప్రాంజలి భోండే కూడా తన 14 నెలల బిడ్డకు రోజుకు రెండు సార్లు మసాజ్ చేస్తారు. ఆమె బిడ్డ పుట్టినప్పటినుంచీ మసాజ్ చేస్తున్నారు. మొదటి నాలుగు నెలలు, ఆమె తల్లి ఆమెకు సహాయం చేసేవారు. ఈ పనిని ఇద్దరూ చాలా ఆస్వాదిస్తూ చేసేవారు.

ప్రస్తుతం ఆమె చిన్నారికి మసాజ్ చేస్తూ బిడ్డ కళ్ళల్లోకి చూస్తూ, జోల పాటలు, పద్యాలూ పాడుతూ ఉంటారు.

"ఇది మా బంధాన్ని మరింత పెంచి, దృఢంగా చేస్తుంది" అని అన్నారు.

ప్రతీ రోజూ మసాజ్ చేయడం వల్ల చిన్నారి నిద్ర, చర్మ కాంతి కూడా మెరుగయ్యాయని చెప్పారు.

"తైలాలతో మసాజ్‌‌ వయసులో ఉన్న వారికి కూడా పని చేస్తాయి. ఇవి వృద్ధులకు కూడా ప్రయోజనకరమే అని మేము కనిపెట్టాం. వయసు పెరిగే కొలదీ చర్మం బలహీనంగా అయిపోతుంది" అని డార్మ్‌స్టాట్ చెప్పారు.

"శరీరం పొడి బారటం వల్ల పగుళ్లు వచ్చి సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నూనెతో మసాజ్ చేయడం వల్ల అది శరీరాన్ని మృదువుగా ఉంచుతుంది" అని చెప్పారు.

తమ కుటుంబ సంప్రదాయాన్ని పాటించడం ద్వారా సక్సేనా కూతురు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలిగారు.

ఆమె 40 సంవత్సరాల వయస్సులో తల్లి అయ్యారు. ఆమెకు గర్భం దాల్చిన సమయంలో గెస్టేషనల్ డైయాబిటిస్ కూడా వచ్చింది.

ఆమె సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

"మసాజ్ చేసిన తర్వాత మా అమ్మాయి నాలుగు గంటల పాటూ లేవకుండా నిద్రపోయింది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు" అని మొదటి సారి ఆమె కూతురికి మసాజ్ చేసినప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు. "దాంతో, నేను కూడా కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాను. ఆరోగ్యకరమైన బాల్యానికి తరచుగా చేసే మసాజ్ కీలకమని నాకనిపించింది" అని అన్నారు.

(ఈ వ్యాసంలో పొందుపరిచిన సమాచారాన్ని వైద్య సలహాగా గాని, వైద్య సలహాలకు ప్రత్యామ్నాయంగా గాని పరిగణించకూడదు. ఇది సాధారణ సమాచారం మాత్రమే. తమ పిల్లలకు మసాజ్ చేయాలని అనుకునే తల్లితండ్రులు వైద్యులను సంప్రదించాలని బీబీసీ సూచిస్తోంది. సక్రమ పద్ధతిలో మసాజ్ చేయకపోవడం వల్ల శిశువులకు హాని జరిగే ప్రమాదం ఉంది.

ఇందులో పొందుపరిచిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని పాల్పడే చర్యలకు బీబీసీ బాధ్యత వహించదు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
US researchers have discovered the secret of traditional massage performed by grandmothers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X