మిత్రదేశం ఇరాన్ కు ఎందుకు సాయం చేయట్లేదంటే ? పుతిన్ భారీ షాక్ ..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం మొదలై పదిరోజులవుతోంది. ఇరుదేశాల మధ్య పోరు ఊహించిన దాని కంటే భారీ స్ధాయిలో సాగుతోంది. మధ్యలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇరాన్ లోని అణు స్దావరాల్ని సైతం ధ్వంసం చేసేసింది. అయినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అలాగని అంతర్జాతీయంగా ఇరాన్ మిత్రదేశాలేవీ సాయం కూడా చేయడం లేదు. ఇందులో ముఖ్యంగా చైనా, రష్యా వంటి అగ్రరాజ్యాలూ కేవలం మాటలతో సరిపెట్టేస్తున్నాయి. దీంతో మిత్రదేశం ఇరాన్ కు రష్యా, చైనా ఎందుకు సాయం చేయడం లేదనే చర్చ జరుగుతోంది.
దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఇరాన్ కు తాము ఎందుకు సాయం చేయడం లేదో ఆయన బయటపెట్టేశారు. దీని వెనుక ఓ కీలక కారణం ఉందని పుతిన్ వెల్లడించారు. దాని వల్లే తాము ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలోకి ఎంట్రీ ఇవ్వలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో పుతిన్ చెప్పిన కారణం ఇప్పుడు ఇరాన్ తో పాటు ఇతర దేశాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. అలాగే పుతిన్ స్వార్ధపూరిత నిర్ణయంపై విమర్శలకూ కారణమవుతోంది.

ఇంతకీ ఇరాన్ కు రష్యా ఎందుకు సాయం చేయడం లేదంటే ఇజ్రాయెల్ లో భారీగా రష్యా పౌరులు నివసిస్తున్నారట. దాదాపు 2 మిలియన్ల మంది రష్యా పౌరులు ఇజ్రాయెల్ లో ఉంటున్నారట. ఇప్పుడు అనవసరంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలో తాము తలదూర్చి మిత్రదేశం ఇరాన్ కు అండగా నిలిస్తే స్వదేశంలో ఇబ్బందులు తప్పవన్న కారణంతోనే పుతిన్ ఇలా వెనక్కి తగ్గినట్లు బహిరంగంగానే చెప్పేశారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో మాట్లాడిన పుతిన్.. "పూర్వ సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్ లకు చెందిన దాదాపు రెండు మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారనే వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని తెలిపారు. ఇజ్రాయెల్ ఇప్పుడు దాదాపుగా రష్యా భాష మాట్లాడే దేశమన్నారు. అలాగే నిస్సందేహంగా రష్యా సమకాలీన చరిత్రలో దీన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దీంతో పుతిన్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications