భారత్‌తో సంబంధాలపై తొలిసారి పెదవి విప్పిన రష్యా: యుద్ధం ఆరంభమైన తరువాత..
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టేశాయి రష్యా సైనిక బలగాలు. రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోన్నాయి. సుమీ, ఖార్‌కీవ్ నగరాల్లో పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటోన్నాయి. ఖార్‌కీవ్‌ను సొంతం చేసుకున్నట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. సుమీని కైవసం చేసుకోవడానికి రష్యా సైన్యం దాడులు చేస్తోన్నాయి. బేబిన్యార్, మరియోపోల్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి.

ఉక్రెయిన్‌కు మానవతా సాయం..
మరోవంక- ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో సహాయ, సహకారాలను అందిస్తోంది భారత్. ఆ దేశ పౌరులకు అత్యవసరమైన వస్తువులు, మెడిసన్‌ను సరఫరా చేస్తోంది. ఆయా వస్తువులతో కూడిన వాహనాలు ఉక్రెయిన్‌కు తరలి వెళ్లాయి కూడా. ఉక్రెయిన్‌కు తాము సహాయాన్ని అందిస్తామని అత్యుత్తమ అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిలోనూ ప్రకటించింది. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఓటింగ్‌లో తటస్థ వైఖరిని అనుసరించింది. ఓటింగ్‌కు దూరంగా ఉంది.

భారత వైఖరిని స్వాగతించిన రష్యా..
దీని పట్ల రష్యా స్పందించింది. భారత్ అనుసరించిన విధానాలను స్వాగతించింది. తటస్థంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆరంభించిన తరువాత భారత్‌తో దశాబ్దాల కాలంగా ఉన్న సంబంధాల గురించి రష్యా స్పందించడం ఇదే తొలిసారి. సుదీర్ఘకాలంగా భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ఉంటోన్నాయని, ఆ సంబంధాలు మరింత కాలం పాటు కొనసాగించాలనేదే తమ ఉద్దేశమని భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపొవ్ చెప్పారు.

ఎస్-400 సరఫరాపై..
ఐక్యరాజ్య సమితిలో భారత్ తటస్థంగా వ్యవహరించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అది చాలా గొప్ప విషయమని డెనిస్ అన్నారు. సంక్షోభ తీవ్రతను భారత్ అర్థం చేసుకోగలిగిందని వ్యాఖ్యానించారు. భారత్‌కు ఎస్-400 సరఫరాపై ఈ యుద్ధ ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పారు. భారత్‌కు కుదిరిన డీల్‌కు అనుగుణంగా వాటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా అన్ని యూరోపియన్ దేశాలు విధించిన ఆంక్షలు, నిషేధాజ్ఞలు- ఈ డీల్‌ను ప్రభావితం చేయలేవని అన్నారు.
Recommended Video

రష్యా తరఫు నుంచీ తరలింపు..
రణరంగంగా మారిన ఖార్‌కివ్ నుంచి భారత విద్యార్థులు, సాధారణ పౌరులను తరలించడానికి తాము కూడా సహకరిస్తామని డెనిస్ అలిపొవ్ చెప్పారు. తమ దేశ భూభాగం మీదుగా భారతీయులను తరలించడానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇస్తామని చెప్పారు. దీనిపై తాము భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. రష్యా భూభాగం మీదుగా తమ దేశ పౌరులను సురక్షితంగా తరలించడానికి అనుమతులు ఇవ్వాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తులు అందాయని, దీనిపట్ల సానుకూలంగా స్పందించామని చెప్పారు. ఈ విషయంలో అన్ని రకాలుగా భారత్‌కు సహకరిస్తామని అలిపొవ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications