ట్రంప్ పుతిన్ భేటీలో అనూహ్య పరిణామం; ఉక్రెయిన్ వార్ పై..
ప్రపంచం మొత్తం ట్రంప్ పుతిన్ భేటీపై ఆసక్తిగా ఎదురుచూసింది . అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ పైన ప్రపంచవ్యాప్తంగా అందరి ఆసక్తి కొనసాగింది. రెండున్నర గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత వీరికి కీలక భేటీ ముగిసింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎటువంటి ఒప్పందం జరగకుండానే వీరిద్దరి భేటీ ముగిసింది.
ట్రంప్ పుతిన్ చర్చల్లో పురోగతి
భేటీ అనంతరం మాట్లాడిన ఇరువురు నేతలు భేటీకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పుతిన్ తో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని, సమావేశం ఫలప్రదం అయిందని తెలిపారు. అయితే ఇంకా కొన్ని కీలక అంశాల పైన చర్చించాల్సి ఉందన్నారు. ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించుకో వలసిందిగా, ఈ దఫా జరిగిన చర్చల్లో చాలా పురోగతి ఉందని పేర్కొన్నారు.

జెలన్ స్కీతో మాట్లాడి మళ్లీ పుతిన్ తో భేటీ అవుతానన్న ట్రంప్
చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని చెప్పారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు ఒప్పందం తుది కాదని ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలో తను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడుతానని ట్రంప్ వెల్లడించారు. తర్వాత మళ్లీ తను పుతిన్ ను కలుస్తానని ట్రంప్ తెలిపారు.
మళ్లీ భేటీ మాస్కోలో.. వెల్లడించిన పుతిన్
ప్రస్తుతం వీరిద్దరి భేటీ అలస్కా లో జరగగా, మళ్లీ భేటీ మాస్కోలో జరుగుతుందని పుతిన్ పేర్కొన్నారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని, అనేక అంశాలపై జరిగిన చర్చల్లో పురోగతి ఉందని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించడానికి తాను నిజాయితీగా ఉన్నట్టుగా పుతిన్ తెలిపారు. వివాదానికి ముగింపు పలకడానికి ఇది ప్రారంభం అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు.
ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ తో యుద్ధమే వచ్చేది కాదు
ట్రంప్ తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయంలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్ తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకున్నట్టు పుతిన్ వెల్లడించారు. అసలు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ తో తమకు యుద్ధమే వచ్చేది కాదని పుతిన్ మరోమారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధానికి సంబంధించిన ఒప్పందం ఇంకా జరగకపోవడంతో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నది అందరిలో మళ్లీ ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications