ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ కన్ను ఎందుకుపడింది ? టర్నింగ్ పాయింట్ అదేనా ? అసలు జరిగిందిదీ..
అంతర్జాతీయంగా ప్రముఖ సామాజిక దిగ్గజాల సరసన చేరిన ట్విట్టర్ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కన్ను ఎప్పుడు పడింది ? ట్విట్టర్ కు ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా దాన్ని కొనేస్తానంటూ మస్క్ ఎందుకు ఉరుముతున్నారు ? అసలు మస్క్ ఇగో ఎక్కడ హర్ట్ అయింది ? ఒకవేళ ట్విట్టర్ అంగీకరించకపోతే ఎలాన్ మస్క్ ప్లాన్ బీ అమల్లో పెట్టబోతున్నారా ? హాలీవుడ్ సినిమాను ఏమాత్రం తగ్గకుండా ఆసక్తిరేపుతున్న ఈ డ్రామాపై ఓ కథనం..
Recommended Video


ట్విట్టర్ పై ఎలాన్ మస్క్ కన్ను
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూ, ట్విట్టర్ కూ మధ్య బంధానికి కీలక కారణాలున్నాయి. చట్టపరమైన సమస్యలతో సంబంధం లేకుండా జనం స్వేచ్ఛగా తమ వాణి వినిపించేలా ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ తీసుకురావాలా అంటూ ఈనెల ఆరంభంలో తమ వినియోగదారులను ఎలాన్ మస్క్ ప్రశ్నించాడు. దీంతో వారంతా ట్విట్టర్ ను కొనేయాలని సూచించారు. అప్పటి నుంచి ట్విట్టర్ కు ఓనరయ్యేందుకు మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వాంకోవర్‌లో జరిగిన TED 2022 కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఎలాన్ మస్క్.. తాను ట్విట్టర్ ను కొనాలనుకుంటున్నాననని, అయితే డబ్బు కోసం మాత్రం కాదన్నాడు. ఇది డబ్బు సంపాదించడానికి ఒక మార్గం కాదని, తన బలమైన సహజమైన భావన ఏమిటంటే, ఎక్కువమంది విశ్వసించే, విస్తృతంగా కలుపుకొనిపోయే పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యమని తన మనసులో మాట చెప్పేశాడు.

ట్విట్టర్ లో వాటా కొనుగోలుతో మొదలు
ఆ తర్వాత గత వారం ట్విట్టర్ లో 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కీలకపరిణామాలకు బీజం వేశాడు. దీంతో ట్విట్టర్ లో అతిపెద్ద వాటాదారుగా మారాడు. అయితే తాజాగా యూఎస్ సెక్యూరిటిస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ ల ప్రకారం చూస్తే వాన్ గార్డ్ అనే సంస్ధ 10.4 శాతం వాటాతో టాప్ లో నిలిచింది. దీంతో మస్క్ ఇగో హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో వందశాతం వాటా కొనుగోలు కోసం మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో వార్ మరింత ముదిరింది.

ఎలాన్ మస్క్ వర్సెస్ ట్విట్టర్
ట్విట్టర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మస్క్ ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడే ఎలాన్ మస్క్ వర్సెస్ ట్విట్టర్ వార్ కూ బీజం పడింది. వాస్తవానికి మస్క్ ట్విట్టర్ లో 9.2 శాతం షేర్లు కొన్న రెండు రోజుల తర్వాత ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మస్క్‌ను బోర్డులోకి ఆహ్వానించారు. మస్క్ తమ కంపెనీకి గొప్ప విలువ తెస్టాడని చెప్పాడు. దీనికి అనుగుణంగా రాబోయే నెలల్లో ట్విటర్‌లో పెనుమార్పులు తెస్తానని మస్క్ కూడా ప్రకటించారు. అయినా పరిస్ధితులు సహకరించకపోవడంతో మస్క్ ట్విట్టర్ బోర్డులో చేరకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ట్విట్టర్ నేపథ్య తనిఖీ అనే పదబంధాన్ని హైలైట్ చేసింది. దీంతో ట్విట్టర్ సీఈవోమస్క్ కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయినందున తాము అతని ఇన్‌పుట్‌లను తీసుకుంటామన్నారు. అయితే మస్క్ మాత్రం దీనిపై జోకులు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏకంగా 100 శాతం వాటా కొనేస్తానంటూ ప్రకటించారు.

ట్విట్టర్ స్వాధీనానికి మస్క్ ప్రకటన
మస్క్ ఇప్పుడు ట్విటర్‌లో 100 శాతం వాటాను 43 బిలియన్లకు కొనుగోలు చేయడానికి ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఒక్కో షేరుకు $54.20 మొత్తం నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌లో దాఖలు చేసిన ఫైల్‌లో ట్విట్టర్‌కు అసాధారణమైన సామర్థ్యం ఉందని, దానిని అన్‌లాక్ చేయాలనుకుంటున్నట్లు మస్క్ పేర్కొన్నారు. నా ఆఫర్ నా ఉత్తమ, చివరి ఆఫర్ అని కూడా తెలిపారు. దీన్ని అంగీకరించకపోతే తాను వాటాదారుగా స్థానాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుందంటూ హెచ్చరించారు.

ట్విట్టర్ స్పందించకపోతే మస్క్ ప్లాన్ బీ
ఎలాన్ మస్క్ చేసిన ప్రతిపాదన కంపెనీతో పాటు ట్విట్టర్ స్టాక్‌హోల్డర్లందరికి మేలు జరుగుతుందని భావిస్తూ దీనిపై తదుపరి నిర్ణయం కోసం డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదనను జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది.మస్క్ ప్రైవేట్‌గా తీసుకునే ప్రతిపాదనను ట్విట్టర్ సమీక్షిస్తున్నట్లు కంపెనీ సీఈవో ఉద్యోగులకు చెప్పారు. ఇందులో బోర్డు కఠినమైన ప్రక్రియని అనుసరించడం ద్వారా వాటాదారుల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటుందని సీఈవో తెలిపారు.
మస్క్, అదే సమయంలో, ట్విట్టర్ ఆఫర్‌ను అంగీకరించకపోతే తన వద్ద ప్లాన్ బి ఉందని చెప్తున్నారు. TED ఈవెంట్‌లో మస్క్ మాట్లాడుతూ, ట్విట్టర్ తన ఆఫర్‌ను తిరస్కరిస్తే తనకు ప్లాన్ B ఉందని చెప్పాడు. అతను తన తదుపరి నిర్ణయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. మరోవైపు ట్విట్టర్ ప్రస్తుతం మస్క్ ఆఫర్‌ను విశ్లేషిస్తోంది అలాగే త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ట్విట్టర్ మస్క్ కంపెనీకి పూర్తి యాజమాన్యాన్ని ఇస్తుందా లేదా ఆఫర్‌ను తిరస్కరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారుతోంది. కానీ, మస్క్ మాత్రం తన ప్లాన్ పై వెనక్కి తగ్గేలా లేరు.












Click it and Unblock the Notifications