వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్‌కు చైనా సాయం చేయకపోతే ఏమవుతుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తాలిబాన్

ప్రపంచ ప్రఖ్యాత దండయాత్రల గురించి చెప్పుకునేటప్పుడు, ఖైబర్ పాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ పర్వత మార్గం మీదుగా వెళ్లేటప్పుడు శత్రు దుర్భేధ్యమైన లోయలు, గుట్టలు కనిపిస్తాయి.

పాకిస్తాన్‌లోని పెషావర్ వ్యాలీ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దుకు 32 కి.మీ. దిగువ వరకు ఈ ఖైబర్ పాస్ విస్తరించి ఉంది.

దాదాపు 3 వేల ఏళ్లుగా ఎన్నో సైన్యాలు ఈ పర్వత మార్గాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్లాయి. మార్గమధ్యంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి.

ఇప్పటికీ రహదారుల పక్కన బ్రిటిష్, బ్రిటిష్ ఇండియా సైన్యాలకు చెందిన చిహ్నాలు మనకు కనిపిస్తుంటాయి. రహదారుల పక్కన గస్తీ కోసం నిర్మించిన కోటలు నేడు నిర్మానుష్యంగా మారాయి.

ఈ పర్వత మార్గంలోని రాళ్ల మీది నుంచి అద్భుతమైన కచ్చితత్వంతో సంప్రదాయ ఆయుధమైన జెజైల్స్ లేదా ఫ్లింట్ లాక్ రైఫిల్స్‌తో గురిపెట్టే నైపుణ్యం పస్తూన్ తెగ సొంతం.

నేడు అఫ్గానిస్తాన్ కూలీల వ్యవసాయ ఉత్పత్తులతో నిండిన ట్రక్కులు ఇక్కడ తిరుగుతున్నాయి. కొన్నిసార్లు ఈ ట్రక్కులకు ఇరువైపులా మనుషులు వేళాడుతూ ప్రయాణిస్తున్నారు.

ఇక్కడి ప్రధాన రహదారి పక్కన చిన్న చిన్న మార్గాలలో వృద్ధులు స్మగ్లింగ్‌ సరకులను పెద్ద పెద్ద పెట్టెల్లో రవాణా చేస్తుంటారు.

తాలిబాన్

'భయానక వాతావరణం'

పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ల మధ్య అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు కూడలి టోర్ఖామ్ వద్ద ఖైబర్ పాస్ ముగుస్తుంది.

చాలా ఏళ్ల క్రితమే పాకిస్తాన్ అధికారులు ఈ మార్గాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దులు దాటేందుకు ఇక్కడ ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.

అఫ్గానిస్తాన్ కొత్త పాలకవర్గమైన తాలిబాన్ల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ భయానక వాతావరణం నెలకొనివుంది.

మిట్ట మధ్యాహ్నం విపరీతమైన ఎండను కూడా భరిస్తూ తీగల ఆవలి నుంచి పత్రాలను చూపుతూ, తమను పాక్‌లోకి అనుమతించమని కొందరు ఇక్కడ ప్రాథేయపడుతున్నారు.

ప్రస్తుతం కేవలం వైద్య కారణాల రీత్యా మాత్రమే కుటుంబం సహా అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లభిస్తోంది.

వీల్‌ చైర్లు, సూట్‌ కేసులతో చిందరవందరగా ఉన్న పొడవైన లైన్, వివిధ చెక్‌ పోస్టుల ద్వారా నెమ్మదిగా ముందుకు కదులుతోంది.

తాలిబాన్

సరిహద్దు రోడ్డు మీద, తాత్కాలిక యూనిఫారాలు ధరించిన తాలిబాన్ గార్డులు, పాకిస్తానీ సైనికులు ఎదురెదురుగా నిలుచున్నారు.

నాతో మాట్లాడటానికి తాలిబాన్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ముఖానికి మాస్కు ధరించిన, పెద్ద గడ్డంతో ఉన్న ఓ తాలిబాన్‌తో నేను మాట్లాడాను.

సరిహద్దు పోస్ట్‌పై ఆకుపచ్చ, ఎరుపు రంగులు కలిగిన అఫ్గానిస్తాన్ జాతీయ జెండా ఎందుకు ఎగరడం లేదని ఆయన్ను అడిగాను. దాని స్థానంలో తాలిబాన్‌కు చెందిన తెల్ల జెండా ఉంది.

''మా దేశం ఇప్పుడు ఇస్లామిక్ ఖలీఫేట్‌గా మారింది'' అని ఆ సరిహద్దు గార్డు గర్వంగా సమాధానం చెప్పాడు. ''ఇదే మొత్తం దేశానికి సరైన జెండా'' అని పేర్కొన్నాడు.

ఇక్కడ అప్పుడప్పుడు ఉద్రిక్తత పరిస్థితులు ఎదురవుతుంటాయి. కానీ చాలావరకు పాకిస్తానీ, తాలిబాన్ సరిహద్దు గార్డులు ప్రశాంతంగా ఒకరికొకరు ఎదురుగా నిల్చుంటారు.

అయితే, స్నేహపూరిత వాతావరణం అన్న ప్రశ్నే లేదు. తాలిబాన్ల విజయానికి పాకిస్తానే కారణమని చాలా మంది అఫ్గాన్‌లు నిందిస్తుంటారు. తాలిబాన్లను పెంచి పోషించింది పాకిస్తాన్, దాని గూఢచార్య సంస్థ ఐఎస్ఐయే అని వారు విశ్వసిస్తున్నారు.

వాస్తవానికి 2018లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అయినప్పటి నుంచీ తాలిబాన్లతో పాకిస్తాన్‌కు సత్సంబంధాలు లేవు. తాలిబాన్లపై పాకిస్తాన్ ప్రభావం గణనీయంగా తగ్గుతూ వచ్చింది.

తాలిబాన్

చైనా శక్తి

చాలా ప్రభుత్వాలకు, తాలిబాన్లతో సంబంధాలు ఏర్పరుచుకోవడం ఇబ్బందికరమనే చెప్పాలి. ఈ మిలిటెంట్ గ్రూపుతో సౌదీ అరేబియా, కొన్ని గల్ఫ్ దేశాలకు సంబంధాలు ఉన్నాయి. అయితే, అవి మరీ అంత సన్నిహితంగా లేవు.

తాలిబాన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న దేశం చైనా. ఇలా చెప్పుకోవడానికి ఆ దేశం ఎలాంటి ఇబ్బందిపడటం లేదు.

చాలా మంది సాధారణ అఫ్గాన్‌ పౌరులు దేశం నుంచి పారిపోవడాన్ని చూస్తుంటే.. 1996 నుండి 2001 మధ్య జరిగినట్లే, దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పతనం కావడం ఖాయమనిపిస్తోంది.

దీంతో, అఫ్గానిస్తాన్‌కు చైనా ఆర్థిక మద్దతు అవసరం. దీనికి ప్రతిగా తాలిబాన్ విధానపర నిర్ణయాలపై బీజింగ్‌ ప్రభావమూ కనిపిస్తుంది.

చైనాలో ముస్లింలు, వీగర్ జనాభా ఎదుర్కొంటున్న సమస్యలపై తాలిబాన్లు ప్రశ్నించబోరని మనం కచ్చితంగా చెప్పగలం.

గత 20ఏళ్లుగా అఫ్గాన్‌కు సహాయం చేసిన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇతర దేశాలకు తాలిబాన్ అధికారంలోకి రావడమనేది దారుణమైన పరిణామం.

తాలిబాన్ల రాకతో అఫ్గాన్‌పై భారత్ అనుసరిస్తున్న విధానాల్లో కూడా భారీ మార్పులే వచ్చాయి. గత కొన్నేళ్లుగా అఫ్గాన్‌లో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. అఫ్గాన్ వాసుల నైపుణ్యాల మెరుగుకూ కృషిచేసింది.

ఇదివరకటి హమీద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీ ప్రభుత్వాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు భారత్‌కు పాక్‌ కంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాయి. ఇప్పుడు అదంతా ముగిసిన అధ్యాయంగా మారింది.

తాలిబాన్

ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా?

చివరిసారిగా తాలిబాన్ల నియంత్రణలో అఫ్గానిస్తాన్‌ ఉన్నప్పుడు, తాలిబాన్లను అంతర్జాతీయ సమాజం పట్టించుకోలేదు.

దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిందంటే, 2001నాటికి ఇంధనం కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితి వచ్చింది. చాలామంది కార్లను రోడ్లపైకి తేవడం ఆపేశారు. జనరేటర్లను కూడా కొనుగోలు చేయలేకపోయేవారు.

విద్యుత్ కోతలు విస్తృతంగా ఉండేవి. రాత్రుళ్లు వీధుల్లో చీకటి ఆవరించేది. పగటిపూట చాలా మంది ప్రజలు తాలిబాన్ ముఠాలకు భయపడి, వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండేవారు.

నాటికీ నేటికీ మధ్య ప్రధాన తేడా చైనా మద్దతు మాత్రమే. తమకు తగినంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దక్కుతాయని భావిస్తే, తాలిబాన్లకు చైనా సాయం అందిస్తుంది. ఫలితంగా అఫ్గాన్ పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుంది. లేకపోతే, వాళ్లు వారి దారి చూసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
What will happen if Afghanistan is not helped by China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X