వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పిల్లలు ఎవరు... వాళ్లు ఏమయ్యారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఐన్‌స్టీన్ కుమారులు ఎడ్వర్డ్, హాన్స్ ఆల్బర్ట్

"ఐన్‌స్టీన్ తన కుమారుడి మానసిక వ్యాధితో చాలా ఇబ్బందులు పడ్డారని అనిపిస్తోంది" అని ఐన్‌స్టీన్ పేపర్స్ ప్రోజెక్ట్ డైరెక్టర్, ఎడిటర్ జీవ్ రోసెన్క్రాంజ్ చెప్పారు.

ఐన్‌స్టీన్ చిన్న కొడుకు ఎడ్వర్డ్‌ను ముద్దుగా అందరూ 'టెట్’ అని పిలిచేవారు.

ఆ బాబుకు చిన్నతనం నుంచే ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండేవి. యుక్త వయసుకొచ్చేసరికి ఆయనను మానసిక రుగ్మతలు పట్టి పీడించాయి.

"చాలా విషాదకరమైన జీవితం ఆయనది" అని రోసెన్క్రాంజ్ బీబీసీ ముండోతో చెప్పారు.

ఐన్‌స్టీన్, ఆయన మొదటి భార్య మిలేవా మారిక్‌కు మరో ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు.

మొదటి బిడ్డ జీవితం అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఆమె గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. రెండవ బిడ్డ తన కథను తానే చెప్పుకున్నారు.

ఐన్‌స్టీన్ కొడుకు హాన్స్ ఆల్బర్ట్ తన తండ్రి గురించి చెప్తూ.. "నా తండ్రి ఎందుకు గొప్పవాడంటే ఎన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ సమస్యలకు పరిష్కర మార్గాలను అన్వేషిస్తూనే ఉండేవారు. ఫలితాలు తారుమారైనా సరే ఆయన ఎప్పుడూ తన ప్రయత్నాలు ఆపలేదు" అని అన్నారు.

“అయితే, నన్ను బాగు చెయ్యడంలో మాత్రం ఆయన విఫలమయ్యారని భావిస్తున్నాను. నాకు చాలాసార్లు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ నేను చాలా మొండివాడినని, దేనికీ అంత త్వరగా అంగీకరించనని ఆయనకు అర్థమైంది" అని ఆల్బర్ట్ చెప్పారు.

మిలేవా మోరిక్, ఐన్‌స్టీన్

మొదటి కుమార్తె లీసర్ల్ ఐన్‌స్టీన్

ఐన్‌స్టీన్ మొదటి కుమార్తె లీసర్ల్ 1902లో జన్మించారు.

"తరువాత, రెండేళ్లకు ఆమె ఏమైందో ఎవరికీ తెలీదు. ఆమె గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. చనిపోయి ఉండొచ్చు. లేదా ఎవరికైనా దత్తతకు ఇచ్చి ఉండొచ్చు. మనకు తెలీదు" అని రోసెన్క్రాంజ్ చెప్పారు.

కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చొరవతో ఆరంభమైన 'ఐన్‌స్టీన్ పేపర్స్ ప్రోజెక్ట్‌’ను అభివృద్ధి పరచడంలో రోసెన్క్రాంజ్ కీలక పాత్ర పోషించారు.

అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, జెరూసలెంలోని హీబ్రూ యూనివర్సిటీ సహకారంతో ఈ ప్రోజెక్ట్ కింద ఐన్‌స్టీన్ రాసిన వేలాది పరిశోధనా పత్రాలను సేకరించి, అనువాదం చేసి పబ్లిష్ చేస్తున్నారు.

ఈ పత్రాలు, లేఖలు ఐన్‌స్టీన్ జీవితంలో మానవీయ కోణాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

ఐన్‌స్టీన్ మనకు ఒక శాస్త్రవేత్తగానే తెలుసు. కానీ, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉందన్నది మనకు స్వల్పంగానే తెలుసు. ఆ విషయాలన్నీ తెలుసుకునేందుకు ఈ పత్రాలు ఉపకరిస్తాయి.

ఈ పత్రాల ద్వారానే లీసర్ల్ గురించి తెలిసింది.

"పాప ఆరోగ్యంగా ఉందా? బాగా ఏడుస్తోందా? తన కళ్లు ఎలా ఉంటాయి? మనిద్దరిలో ఎవరి పోలికలు వచ్చాయి? తనకు పాలు ఎవరు పడుతున్నారు? పాపకు ఆకలేస్తోందా? తనకు జుత్తు లేకుండా గుండు ఉండి ఉంటుంది. నేనింతవరకు పాపను చూడలేదు కానీ తనంటే నాకు ప్రాణం" అని ఐన్‌స్టీన్ స్విట్జర్లాండ్ నుంచీ తన భార్య మిలేవాకు లేఖ రాశారు.

అప్పుడు ఆమె సెర్బియాలో ఉన్నారు. అక్కడే లీసర్ల్ పుట్టింది.

కుమారుడు హాన్స్ ఆల్బర్ట్, మనుమడు బెర్నార్డ్‌లతో ఐన్‌స్టీన్

ఐన్‌స్టీవి పెళ్లికి ముందు...

ఐన్‌స్టీన్ రాసిన ఈ లేఖలోని కొన్ని భాగాలను వాల్టర్ ఐజాక్సన్ రచించిన ఐన్‌స్టీన్ జీవిత చరిత్ర "ఐన్‌స్టీన్: హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్" పుస్తకంలో ప్రచురించారు.

అసలు మిలేవా ప్రసవం కోసం స్విట్జర్లాండ్ వదిలి తన పుట్టింటికి ఎందుకు వెళ్లారు?

అది తెలుసుకోవాలంటే ఐన్‌స్టీన్ యువకుడిగా ఉన్న కాలానికి వెళ్లాలి. ఆయన ఇంటి పరిస్థితులు తెలుసుకోవాలి.

"మిలేవాతో ఐన్‌స్టీన్ వివాహానికి ఆయన తల్లి అంగీకరించలేదు" అని హనోక్ గుట్‌ఫ్రెండ్ రాసిన ఐన్‌స్టీన్ ఆన్ ఐన్‌స్టీన్: ఆటోబయోగ్రఫికల్ అండ్ సైంటిఫిక్ రిఫ్లెక్షన్స్ పుస్తకంలో వివరించారు. గుట్‌ఫ్రెండ్ జెరూసలెంలోని హీబ్రూ యూనివర్సిటీలో పని చేస్తున్నారు.

ఐన్‌స్టీన్

మిలేవాను వివాహమాడితే తన కొడుకు జీవితం నాశనమైపోతుందని ఐన్‌స్టీన్ తల్లి భావించారు.

"మిలేవా గర్భవతి అయితే పెద్ద అపవాదు అని ఆమె ముందే హెచ్చరించారు. ఆరోజుల్లో పెళ్లికి ముందే గర్భవతి కావడం కళంకంలాంటిది."

అయితే, ఐన్‌స్టీన్, మిలేవా అప్పటికే వల్లమాలిన ప్రేమలో ఉన్నారు. ఆయనకు 19, ఆమెకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారిద్దరి మధ్య బంధం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆమె జూరిక్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్‌లో ఆయన భాగస్వామి. అక్కడ మిలేవా భౌతిక శాస్త్రంలో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఐన్‌స్టీన్ లేఖల్లో మిలేవా పట్ల అంతులేని ప్రేమ, తమ వివాహానికి తన తల్లి అనంగీకారం గురించి చాలా సమాచారం ఉంది అని ఐజాక్సన్ వివరించారు.

"నేనేదో చనిపోయినట్లు నా తల్లిదండ్రులు నా గురించి ఏడుస్తున్నారు. నీతో ప్రేమలో పడి నేను కష్టాలు కొని తెచ్చుకున్నానని వారు భావిస్తున్నారు. నువ్వు ఆరోగ్యంగా లేవని వారు అనుకుంటున్నారు" అని ఆ లేఖల్లో రాశారు.

అయితే, ఐన్‌స్టీన్ తన మనసుకు నచ్చించే చేశారు. మిలేవా గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఒక మంచి భర్తగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు.

మిలేవా ప్రసవానికి కొన్ని వారాల ముందు ఐన్‌స్టీన్ బెర్న్‌లో ఉన్నారు. ఫెడరల్ ఆఫీస్‌లో ఉద్యోగం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు.

ఐన్‌స్టీన్, మిలేవా

ఆ ఉద్యోగం వల్ల వాళ్ల జీవితం ఆర్థికంగా బలపడుతుందని ఆశించారు. అప్పటికి ఐన్‌స్టీన్ ప్రైవేటుగా లెక్కలు, భౌతికశాస్త్రాల్లో ట్యూషన్లు చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఒక గంట ఉచితంగా క్లాస్ చెప్తానని వార్తా పత్రికలో ప్రకటన కూడా వేయించారు.

"ఇప్పుడు మనకున్న ఒకే ఒక సమస్య ఏమిటంటే మన పాప లీసర్ల్‌ను వెనక్కి తెచ్చుకోవడం ఎలా? నేను ఆమెను వదులుకోవాలని అనుకోవట్లేదు" అని ఒక లేఖలో రాశారు.

ఆరోజుల్లో పెళ్లి కాకుండా బిడ్డను కనడం చట్టవిరుద్ధమని ఐన్‌స్టీన్‌కు తెలుసు. అందునా, ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్న వ్యక్తికి ఇది ఇంకా కష్టం.

అయితే, ఐన్‌స్టీన్ తన మొదటి బిడ్డను కలుసుకున్నట్లు లేదు. పాపను సెర్బియాలోనే తన బంధువుల ఇంట విడిచిపెట్టి మిలేవా స్విట్జర్లాండ్ తిరిగి వచ్చారు.

మిలేవాకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఆ పాప పోషణ బాధ్యతను తీసుకుని ఉండవచ్చని ఒక "నిగూఢ సూచన" ద్వారా తెలుస్తున్నట్లు ఐజాక్సన్ తెలిపారు. కానీ అలా అనుకోవడానికి సంభవనీయత తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని ఐజాక్సన్ అభిప్రాయపడ్డారు.

ఆ పాప గురించి ఐన్‌స్టీన్ ఉత్తరాల ద్వారానే మనకు తెలుస్తోంది. కొంతకాలం తరువాత లేఖల్లో ఆమె ప్రస్తావన ఆగిపోయింది. ఆ పాప ఏమైందనే అంతు చిక్కని రహస్యం గురించి పుస్తకాలు వచ్చాయి కానీ కచ్చితమైన సమాచారం ఎక్కడా దొరకలేదు" అని గుట్‌ఫ్రెండ్ తెలిపారు.

"ఈ పాప జాడను కనుక్కునేందుకు చరిత్రకారులు, జర్నలిస్టులు సెర్బియా వెళ్లి అక్కడి పత్రికల్లోనూ, రికార్డ్ పత్రాలోనూ, పాత దస్తావేజుల్లోను వెతికారు. కానీ లాభం లేకపోయింది. ఆ పాపకు రెండేళ్లున్నపుడు స్కార్లెట్ జ్వరం వచ్చిందని ఉత్తరాల్లో ఉంది. అదే చివరిగా ఆమె గురించి వచ్చిన ప్రస్తావన. మరి ఆ పాపకు జ్వరం తగ్గిందా, బతికిందా లేదా అనే విషయాలు తెలీవు" అని రోసెన్క్రాంజ్ చెప్పారు.

1955లో ఐన్‌స్టీన్ మరణించేవరకూ కూడా ఈ పాప గురించి ఆయన ఎక్కడా ఎవరితోనూ ప్రస్తావించలేదు. ఐన్‌స్టీన్ పేపర్స్ ప్రోజెక్ట్ ద్వారానే 1986లో ఈ పాప విషయం బయటకు వచ్చింది.

ఐన్‌స్టీన్

పెళ్లి, పిల్లలు

బెర్న్‌లో ఐన్‌స్టీన్‌కు ఉద్యోగం వచ్చిన తరువాత మిలేవాను 1903లో వివాహం చేసుకున్నారు. 1904లో హాన్స్ ఆల్బర్ట్, 1910లో ఎడ్వర్డ్ పుట్టారు. అప్పటికి ఐన్‌స్టీన్ కుటుంబం జూరిక్‌లో స్థిరపడింది.

"మా అమ్మ ఇంటి పనుల్లో బిజీగా ఉంటే, మా నాన్న తన వర్క్ పక్కన పెట్టి మమ్మల్ని చూసుకునేవారు. మాకు కథలు చెప్పడం, వయొలిన్ వాయించడం చేసేవారని హాన్స్ ఆల్బర్ట్ చెప్పినట్లు ఐజాక్సన్ తెలిపారు.

చిన్నతంలో ఎడ్వర్డ్ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. తరచు అనారోగ్యం పాలవుతూ ఉండేవాడు.

"నాలుగేళ్ల వయసులో ఎడ్వర్డ్ ఏడు వారాలపాటూ మంచం పట్టాడు" అని ఐన్‌స్టీన్‌ ఎన్‌సైక్లోపీడియాలో రాసి ఉంది.

1917లో ఎడ్వర్డ్ తీవ్ర ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఐన్‌స్టీన్‌ తన స్నేహితునికి ఉత్తరం రాస్తూ "మా చిన్నబ్బాయి ఆరోగ్య పరిస్థితి నన్ను తీవ్రంగా కలవరపెడుతోంది" అంటూ విచారం వ్యక్తం చేసారు.

ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎడ్వర్డ్ చదువుల్లో చురుకుగా ఉండేవారు. కళలపై మక్కువ ఉండేది. కవితలు రాయడం, పియానో వాయించడంపై ఆసక్తి చూపించేవారు. సంగీతం, తత్వశాస్త్రం గురించి తన తండ్రితో చర్చించేవారు.

తన కొడుకు జీవితంలోని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెడుతున్నాడని ఐన్‌స్టీన్‌ రాసుకున్నారు.

ఎల్సాతో ఐన్‌స్టీన్

ఐన్‌స్టీన్ రెండో ప్రేమ వ్యవహారం

ఐన్‌స్టీన్ శాస్త్రవేత్తగా తన పరిశోధనలో ముందుకు వెళుతూ ఉండగా, తన భార్యతో సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి.

మరో వైపు ఆయన తన కజిన్ ఎల్సాతో ప్రేమలో పడడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

1914లో ఐన్‌స్టీన్ కుటుంబం బెర్లిన్‌కు మారింది. కానీ ఐన్‌స్టీన్ తిరస్కార ధోరణి వలన మిలేవాకు, ఆయనకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. దాంతో, ఆమె తన పిల్లలను తీసుకుని మళ్లీ స్విట్జర్లాండ్ తిరిగొచ్చేశారు.

1919లో వారిద్దరు విడాకులు తీసుకోవడం అనివార్యమైంది.

పిల్లలకు దూరంగా ఉండడం ఐన్‌స్టీన్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకని, పిల్లలతో తన బంధం బలంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేసేవారు.

"ఐన్‌స్టీన్‌కు తన పిల్లలంటే చాలా ప్రేమ" అని రోసెన్క్రాంజ్ తెలిపారు.

మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఐన్‌స్టీన్‌ తన పిల్లలను కలిసేవారు. పిల్లలిద్దరితోనూ ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా చిన్నబ్బాయిపై ఆయనకు మమకారం ఎక్కువగా ఉండేది.

వాళ్లిద్దరి మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతుండేవి. అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉండేవారు. ఒకరికొకరు విపరీతంగా ఉత్తరాలు రాసుకునేవారు.

1930లో ఐన్‌స్టీన్‌ తన కొడుకుకు రాసిన ఉత్తరంలో "జీవితం సైకిలు తొక్కడంలాంటిది. సమతౌల్యం కొనసాగాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి" అని వివరించారు.

ఎడ్వర్డ్ కూడా భౌతిక శాస్త్రవేత కావాలని ఆకాంక్షించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతాలపై ఆసక్తి చూపించేవారు.

1932లో ఎడ్వర్డ్ మెడిసిన్ చదువుతున్నప్పుడు మానసిక రుగ్మతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది.

ఇది ఐన్‌స్టీన్‌ను తీవ్రంగా కలచివేసిందని గుట్‌ఫ్రెండ్ తెలిపారు.‌

"బంగారాల్లాంటి నా పిల్లల్లో ఒకడిని, అచ్చం నాలాగే ఆలోచిస్తాడు అనుకునేవాడిని మానసిక వ్యాధి కబళించింది" అని ఐన్‌స్టీన్ రాసినట్లు గార్డియన్ పత్రిక తెలిపింది.

1933లో జర్మనీలో నాజీయిజం ప్రబలుతున్నప్పుడు ఐన్‌స్టీన్‌ ఆ దేశం విడిచి అమెరికా వెళిపోవాలని నిశ్చయించుకున్నారు. వెళ్లే ముందు ఆస్పత్రిలో ఉన్న చిన్న కొడుకును కలుసుకున్నారు. అదే వారిద్దరూ చివరిసారి కలుసుకోవడం.

ఐన్‌స్టీన్ చిత్రాల ప్రదర్శన

దుఃఖాంతం

మిలేవా ఇంట్లో ఎడవర్డ్‌ను ఎంతో బాగా చూసుకున్నప్పటికీ ఆయన వ్యాధి ముదిరిపోవడంతో ఆస్పత్రిలో చేర్చవలసి వచ్చింది.

1948లో మిలేవా మరణించిన తరువాత ఎడ్వర్డ్‌ను చూసుకోవడానికి ఒక చట్టపరమైన సంరక్షకుడిని నియమించారు. దానీ అయ్యే ఖర్చులన్నీ ఐన్‌స్టీనే భరించారు.

ఎడ్వర్డ్‌కు ఉన్న మానసిక వ్యాధి కారణంగా ఆయన్ను అమెరికా వెళ్లడానికి అనుమతించి ఉండరని ఐజాక్సన్ అభిప్రాయపడ్డారు.

ఎడ్వర్డ్ జీవితమంతా మానసిక రోగుల ఆస్పత్రిలోనే గడిపారు. చివరికి, 1965లో 55 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు.

హాన్స్ ఆల్బెర్ట్

ఐన్‌స్టీన్ రెండవ సంతానం హాన్స్ ఆల్బర్ట్ వ్యక్తిత్వం పూరిగా భిన్నమైనదని నిపుణులు అంటున్నారు. హాన్స్ పూర్తిగా నేల మీద నిలబడే మనిషి.

ఆయన జూరిక్‌లోని ఫెడరల్ పాలిటెక్నిక్ పాఠశాలలో చదువుకున్నారు.

1924లో హాన్స్ స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు.. "నా కొడుకు సమర్థవంతుడైన, నిజాయితీ గల వ్యక్తిగా ఎదిగాడు" అని ఐన్‌స్టీన్ రాసుకున్నారు.

హాన్స్ 1926లో పట్టభద్రులయ్యారు. 1936లో టెక్నికల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పుచ్చుకున్నారు.

1938లో తండ్రి సలహాతో హాన్స్ అమెరికా వెళ్లి సెడిమెండ్ ట్రాన్స్‌పోర్ట్‌పై పరిశోధన కొనసాగించారు.

హాన్స్ ఆల్బర్ట్ చేసిన పరిశోధనలు విస్తృతంగా గుర్తింపు పొందాయి.

ఈ ఫీల్డ్‌లో హాన్స్ చేసిన కృషికి గుర్తుగా 1988లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ ఆయన పేరు మీద హాన్స్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డ్ ప్రారంభించింది.

ఐన్‌స్టీన్

ప్రశంసలు పొందిన ప్రొఫెసర్

అమెరికా వెళ్లిన తరువాత హాన్స్ కొంత కాలం సౌత్ కరోలినా అగ్రికల్చరల్ ఎక్స్‌పెరిమెంట్ స్టేషన్‌లో, ఆపై అక్కడి వ్యవసాయ విభాగంలో పనిచేశారు.

ఆ తరువాత ఆయన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ బోధించేవారు.

"హాన్స్ గొప్ప శాస్త్రవేత్తగా, అద్భుతమైన ఇంజనీర్‌గా మాత్రమే కాక అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా కూడా మన్ననలు పొందారు" అని విశ్వవిద్యాలయం పత్రాల్లో రాశారు.

1954లో ఐన్‌స్టీన్ రాసిన ఒక లేఖలో తన కొడుకును ప్రశంసిస్తూ.. "నాలో ఉన్న ప్రత్యేక లక్షణమే హాన్స్‌లో కూడా ఉంది. తన పూర్తి సామర్థ్యాన్ని, శక్తిని వినియోగిస్తూ నిరంతరం ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు" అని అన్నారు.

అభిప్రాయ భేదాలు

ఐన్‌స్టీన్ తన లేఖల్లో ఒక్కోసారి పిల్లలపై అమితమైన ప్రేమను కనబరిచేవారు. ఒక్కోసారి వారిని మందలిస్తూ ఉండేవారు.

తన పిల్లలతో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉండేవని రోసెన్క్రాంజ్ చెప్పారు.

హాన్స్ ఇంజినీరింగ్ చదువుకోవాలనుకున్నప్పుడు ఐన్‌స్టీన్ అభ్యంతరం తెలిపారు. తరువాత హాన్స్ వివాహ విషయంలో కూడా ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు పొడజూపాయి. మిలేవా కూడా హాన్స్ వివాహ విషయంలో అభ్యంతరాలు లేవదీశారు.

అయితే, తల్లిదండ్రుల మాటను కాదని హాన్స్ వయసులో తనకన్నా తొమ్మిదేళ్లు పెద్దదైన్ ఫ్రీడా నెక్ట్‌ను 1927లో పెళ్లి చేసుకున్నారు.

ఆ తరువాత ఐన్‌స్టీన్ వారి వివాహ బంధాన్ని అంగీకరించి కోడలిని సాదరంగా ఆహ్వానించారు. ఐన్‌స్టీన్‌కు ముగ్గురు మనుమలు ఉన్నారు.

ఐన్‌స్టీన్‌కు వయోలిన్ వాయించడమంటే చాలా ఇష్టం

ఐన్‌స్టీన్‌కు, హాన్స్‌కు మధ్య రాకపోకలు ఉండేవిగానీ వారిద్దరి మధ్య అంత దగ్గర సంబంధం ఉండేది కాదు. ఐన్‌స్టీన్‌ రెండవ వివాహమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐన్‌స్టీన్‌ ఎల్సాను వివాహం చేసుకున్నారు. ఎల్సాకు అంతకుముందు జరిగిన వివాహం కారణంగా పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కూడా ఐన్‌స్టీన్‌, ఎల్సాలతో కలిసి ఉండేవారు.

ఫ్రీడా మరణం తరువాత హాన్స్ కూడా బయోకెమిస్ట్ అయిన ఎలిజబెత్ రోబోజ్‌ను ద్వితీయ వివాహం చేసుకున్నారు.

హాన్స్ ఆల్బర్ట్ 1973లో 69 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు.

తన ఇద్దరు పిల్లలు తన అంతరాత్మకు ప్రతిబింబాలని ఐన్‌స్టీన్‌ మిలేవాతో అంటుండేవారని ఐజాక్సన్ తెలిపారు.

తాను మరణించిన తరువాత కూడా తన పిల్లలు తన వారసత్వాన్ని కొనసాగిస్తారని ఐన్‌స్టీన్‌ భావించేవారు.

అయితే, ఐన్‌స్టీన్‌లాంటి గొప్ప శాస్త్రవేత్తకు పిల్లలుగా పుట్టడం వలన వారు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

"కొన్నిసార్లు అంత గొప్ప తండ్రికి పిల్లలుగా పుట్టడం సమస్యలను సృష్టిస్తుంది. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం" అని ఎడ్వర్డ్ ఒక లేఖలో రాశారు.

ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాతం (థియరీ ఆఫ్ రెలిటివిటీ) ప్రచురించడానికి ఒక సంవత్సరం ముందు హాన్స్ పుట్టారు.

"ఇంత గొప్ప వ్యక్తికి బిడ్డగా పుట్టడం గురించి మీ అభిప్రాయం ఏమిటని హాన్స్‌ని అడిగితే.. "నేను చిన్నప్పుడే నవ్వడం నేర్చుకోకపోయి ఉంటే ఈ పాటికి నాకు పిచ్చెక్కి ఉండేది" అని అన్నారు.

ఐన్‌స్టీన్

ఒక తండ్రిగా ఐన్‌స్టీన్‌

ఈ లేఖలన్నీ ఐన్‌స్టీన్‌లోని భిన్నమైన కోణాన్ని, ప్రపంచానికి తెలియని కోణాన్ని చూపెడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

తమ సంస్థకు 1,500లకు పైగా ఐన్‌స్టీన్‌ ఉత్తరాలు లభ్యమయ్యాయని గుట్‌ఫ్రెండ్ తెలిపారు.

ఈ ఉత్తరాలనీ తండ్రిగా ఐన్‌స్టీన్‌ మమకారాన్ని, హృదయపు వెచ్చదనాన్ని కళ్లకు కట్టిస్తాయని గుట్‌ఫ్రెండ్ అన్నారు.

మిలేవాతో సంబంధం తెగిపోయినప్పటికీ ఐన్‌స్టీన్‌ చివరి వరకూ తన పిల్లలతో ప్రేమ పూర్వక సంబంధాన్నే కొనసాగించారు.

ఐన్‌స్టీన్‌ పిల్లల భవిష్యత్తు గురించి తపనపడ్డారు, ఆందోళన చెందారు. వారి పురోగతిని చూసి సంతోషించారు.

ఆయన ఎప్పుడూ పిల్లల పట్ల శ్రద్ధ చూపేవారని మిలేవా కూడా అంగీకరించారు.

"ఐన్‌స్టీన్‌ తనను తాను ఒక మంచి భర్తగా భావించి ఉండకపోవచ్చు. మంచి భర్తగా కన్నా మంచి తండ్రిగా ఉండడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారని అనిపిస్తుంది" అని రోసెన్క్రాంజ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Who were the children of Albert Einstein,where are they now
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X