Royal Enfield: బుల్లెట్ 650 వచ్చేసింది, ధర ఎంతంటే?
బైక్ లవర్స్‌కు 'బుల్లెట్' అంటే కేవలం ఒక వాహనం కాదు.. అదొక ఎమోషన్! రోడ్డుపై ఆ 'దుగ్ దుగ్' సౌండ్ వినబడితే చాలు, ఎంతటి వారైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాల్సిందే. 1932లో పుట్టిన ఈ లెజెండరీ బైక్, సుదీర్ఘ కాలంగా భారతీయ రోడ్లను ఏలుతోంది. ఇప్పుడదే ఐకానిక్ 'బుల్లెట్' పేరును మరింత పవర్‌ఫుల్ ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకొస్తూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సరికొత్త 'బుల్లెట్ 650' మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి దించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హెవీ వెయిట్ మెషీన్‌ను కంపెనీ రూ.3.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అధికారికంగా లాంచ్ చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ GT, సూపర్ మెటియోర్, షాట్‌గన్, క్లాసిక్ 650 వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, 'బుల్లెట్' రాకతో ఈ 650 సీసీ శ్రేణికి అసలైన గంభీరత్వం వచ్చింది. సరికొత్త 'క్యానన్ బ్లాక్', 'బ్యాటిల్‌షిప్ బ్లూ' అనే రెండు అదిరిపోయే రంగులలో లభిస్తున్న ఈ మోటార్‌సైకిల్, దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో ఇప్పుడు కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

పాత తరం దటీజ్ 'బుల్లెట్' శైలి.. ఆధునిక పవర్!
ఈ కొత్త బుల్లెట్ 650 ప్రత్యేకత ఏంటంటే.. దశాబ్దాలుగా ఈ బ్రాండ్‌కు గుర్తింపు తెచ్చిన పాత తరం రెట్రో లుక్‌ను ఎక్కడా పాడుచేయకుండా, ఆధునిక ఇంజనీరింగ్ పనితీరును దీనికి జోడించారు. నిటారుగా ఉండే రాజసం ఉట్టిపడే భంగిమ (Stance), సిగ్నేచర్ సిల్హౌట్ డిజైన్‌ను అలాగే ఉంచుతూ.. లాంగ్ రైడింగ్ చేసే టూరర్లకు నచ్చేలా దీని బాడీ నిర్మాణాన్ని మరింత బలంగా మార్చారు.
ఈ రాయల్ బైక్ గుండెకాయలో 647.95 సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఫ్యూయల్-ఇంజెక్టెడ్ SOHC సాంకేతికతతో పనిచేసే ఈ మోటార్ గరిష్టంగా 46.4 hp శక్తిని, 52.3 Nm టార్క్‌ను ప్రసరిస్తుంది. దీనికి జత చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ , వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్ వల్ల గేర్లు చాలా సున్నితంగా పడతాయి. హైవేలపై సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి కుదుపులు లేకుండా, క్లాసిక్ బుల్లెట్ రైడింగ్‌ను పూర్తిగా ఆస్వాదించేలా దీనిని ట్యూన్ చేశారు.
గంభీరమైన డిజైన్.. అదిరిపోయే ఫీచర్లు!
డిజైన్ పరంగా చూస్తే, ఇది పక్కా ఓల్డ్-స్కూల్ బుల్లెట్ స్టైల్‌ను గుర్తుకు తెస్తుంది. కన్నీటి బిందువు ఆకారంలో ఉండే (Teardrop) ఇంధన ట్యాంక్, దానిపై చేతితో పెయింట్ చేసిన మెరిసే గోల్డ్ పిన్‌స్ట్రైప్‌లు బైక్‌కు క్లాసిక్ లుక్ ఇచ్చాయి. ముందు భాగంలో 19-అంగుళాల చక్రం, వెనుక 18-అంగుళాల చక్రంతో పాటు సాంప్రదాయక నాసెల్-స్టైల్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌ను అందించారు. ఇందులో 1954 నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ సిగ్నేచర్ 'టైగర్-ఐ' పైలట్ ల్యాంప్‌లను కూడా అలాగే కొనసాగించడం విశేషం. క్రోమ్ ఫినిషింగ్‌తో వచ్చే పీషూటర్ ఎగ్జాస్ట్‌లు (సైలెన్సర్లు) ఈ బైక్ గంభీరత్వాన్ని మరింత పెంచాయి.
ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా క్యాస్క్వెట్-మౌంటెడ్ LED హెడ్‌ల్యాంప్, LED టైల్ ల్యాంప్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్‌ను కూడా ఇందులో చేర్చారు. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా ఇంధన స్థాయి, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
సేఫ్టీలోనూ కింగే..
స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌పై నిర్మించిన ఈ బైక్‌లో.. ముందు భాగంలో 43 mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఎంతటి వేగంలోనైనా బైక్ తక్షణమే కంట్రోల్ అవ్వడం కోసం ముందు వైపు 320 mm డిస్క్, వెనుక వైపు 300 mm డిస్క్ బ్రేక్ సెటప్ ఇచ్చారు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS - యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉండటం వల్ల ఎలాంటి రోడ్లపై అయినా నమ్మకమైన, సురక్షితమైన బ్రేకింగ్ లభిస్తుంది. మొత్తానికి, పాత తరం రాయల్ లుక్ , ఆధునిక 650 సీసీ పవర్‌ను కోరుకునే బైక్ ప్రియులకు 'బుల్లెట్ 650' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.














Click it and Unblock the Notifications