ఉచిత ప్రయాణానికి ఆధార్ తో పని లేదు- కీలక మార్పు, ఇక నుంచి కొత్తగా..!!
ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రయాణ సమయంలో ఆధార్ కార్డును ఎక్కువ మంది గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు. కాగా, ఇప్పుడు ప్రయాణీకులకు ఇక నుంచి ఆధార్ తో అవసరం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా టికెట్.. ఆధార్ లేకుండా ఈ కొత్త నిర్ణయం మేరకు ఉచిత ప్రయాణం కొనసాగించే వెసులుబాటు మహిళా ప్రయాణీకులకు దక్కనుంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వు ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ చేయను న్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో విద్యార్థులకు రాయితీ, ఉద్యోగులకు, ఇతరులకు నెలవారీగా సీజన్ పాస్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మహాలక్ష్మిలకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక నుంచి ఆధార్ కార్డుకు బదులు స్మార్ట్ కార్డు చూపించాల్సి ఉంటుంది. స్మార్ట్ కార్డులు వచ్చే నెల 2వ తేదీ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత జిల్లాకు ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని, సాంకేతిక సమస్యలు పరిష్కరించుకొని జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై కసరత్తు జరుగుతోంది.

జూన్ 2వ తేదీ నుంచి పంపిణీకి సన్నాహకాలు
మహాలక్ష్మీ పథకం లబ్దిదారులకు ఏటీఎం తరహాలో చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డు జారీ చేస్తారు. ముందుగా ఆధార్ కార్డు, ఒక ఫొటో సేకరించి మహాలక్ష్ముల ప్రాథమిక సమాచారం చిప్‌తో అనుసంధానిస్తారు. ఈ స్మార్ట్ కార్డులో లబ్ధిదారుడి పూర్తి వివరాలు, ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. తర్వాత వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్‌కార్డు చూపకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతివ్వరు. ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, నకిలీ ఆధార్ కార్డుల సాయంతో బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీని వల్ల ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. కార్డులు అందే వరకు ఆధార్ కార్డు చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కుతుంది.













Click it and Unblock the Notifications