• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో పాప పుట్టిన తర్వాత ఈమె జీవితం ఎందుకు తలకిందులైంది? ఎంతమందికి ఇలాంటి సమస్య వస్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

బీబీసీ రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా పని చేస్తున్న హెలెనా మెరిమన్‌కు మూడేళ్ల కిందట ఓ షాకింగ్ జబ్బు బైటపడింది. అనూహ్యంగా ఈ సమస్యకు గురైన వాళ్లు పడే ఇబ్బందులేమిటో, తనకు ఎదురైన అనుభవాలేమిటో ఆమె వివరించారు.

ఉదయం నాలుగు గంటలకు నేను లేచి చూసే సరికి మా వారు బెడ్ మీద లేరు. మా నాలుగేళ్ల బేబీ సామ్‌ని ఎత్తుకుని దూరంగా నిలబడి ఆడిస్తున్నారు. నేను ప్రతిరోజు సామ్ ఏడుపుతోనే మేల్కొనేదానిని.

ఆ రోజు ఆ ఘటన జరిగిన తర్వాత, రెండు మూడు వారాలపాటు ఇదే పరిస్థితి ఎదురైంది. రాత్రిపూట సామ్ ఏడుస్తున్నా నేను నిద్రపోతూనే ఉన్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు పగటి పూట మెలకువగా ఉన్నప్పుడు కూడా శబ్దాలు వినిపించడం మానేశాయి.

నా స్నేహితులు మాట్లాడుతుండే వారి పెదాల కదలికలను గమనించడం మొదలు పెట్టాను.

డాక్టర్‌ సూచన మేరకు నేను ఆడియాలజీ క్లినిక్‌కు వెళ్లాను. అక్కడ వివిధ రకాల టెస్టులు చేసి చివరకు నా కుడి చెవి వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయిందని తేల్చారు. కంగారు పడాల్సిన పనిలేదు, జలుబు వల్ల కావచ్చు, కొన్నాళ్లకు సర్దుకుంటుందని డాక్టర్లు అన్నారు.

ఆరు వారాల తర్వాత నేను మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ రూమ్-5లో నా చెవి సమస్య, దాని లక్షణాలను పరిశీలించిన డాక్టర్, మీకు ఓటోస్క్లెరోసిస్ అనే వినికిడి సమస్య వచ్చిందని అనుమానంగా ఉందని చెప్పారు. వినికిడి శక్తి క్రమంగా తగ్గుతుందని, ఇది జన్యుపరంగా వచ్చే సమస్యని, చికిత్స లేదనీ చెప్పారు.

ఆ రోజు నేను పడుకుని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎన్నిరోజుల్లో నా వినికిడి శక్తి పూర్తిగా పోవచ్చు? అంటే నేను కొన్నాళ్లకు చెవిటిదానిని అవుతానా? అది జన్యు సమస్య అయితే, నా పిల్లలకు కూడా వస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు.

నా చిన్నతనంలో నేను విన్న రకరకాల శబ్దాలు నాకు గుర్తుకు వస్తున్నాయి. చిన్నప్పుడు మా తాతయ్య మాటలు, మా పెంపుడు పిల్లి అరుపులు టేప్‌లో రికార్డు చేశాను. ఆ క్యాసెట్‌లు ఇంకా నా దగ్గరున్నాయి. మళ్లీ నేను వాటిని వినలేనా ? ఒక్కసారిగా భయం వేసింది.

ఓటోస్క్లెరోసిస్ అనే సమస్య ఒకటి రెండు శాతంమందిలో కనిపిస్తుంది. అయితే, అది మగవాళ్లకన్నా ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది. పిల్లల్నికన్న మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

గర్భం ధరించిన తర్వాత హార్మోన్లు ఈ సమస్య వేగాన్ని పెంచుతాయని విన్నాను. నాకు డెలివరీ అయిన తర్వాత నుంచి ఈ సమస్య ఎందుకు మొదలైందో అప్పుడు నాకు అర్ధమైంది.

హెలెనాకు రెండో పాప పుట్టాక వినికిడి సమస్య మొదలైంది.

రెండో పాప పుట్టాక వినికిడి సమస్య మొదలైందని హెలెనా గుర్తించారు

తర్వాత కొన్ని నెలలపాటు నేను నా సమస్యను ఎవరికీ చెప్పలేదు. బ్రాడ్‌కాస్టర్ వృత్తిలో ఉన్న నాకు, వినికిడి సామర్ధ్యం నా విధుల్లో చాలా ముఖ్యం. అందుకే నాకీ సమస్య ఉందని ఎవరితో అనలేదు.

ఓటోస్క్లెరోసిస్ సమస్య నాకు వచ్చిందని తెలిసిన తర్వాత నేను దాని గురించి చాలా చదివాను. అప్పుడు నాకు ఈ సమస్య గురించి పూర్తిగా అర్ధమైంది.

మనం ఒక సముద్రం దగ్గర నిలబడినట్లు ఊహించుకుంటే, అక్కడి అలల చప్పుడు గాలి ద్వారా మన చెవిని చేరుతుంది. అవి ఇయర్ డ్రోమ్‌లోకి ప్రవేశించి కర్ణభేరిని కంపింపజేస్తాయి.

ఆ కంపనం చెవి వెనక ఉండే మూడు మృదువైన చిన్న ఎముకలను చేరుతుంది. వీటిని మాల్యూస్, ఇంకస్, స్టేప్స్ అనే పేర్లతో పిలుస్తారు. ఇవి శబ్ధాన్ని చెవిలోపల ఉండే కొఖ్లియా ఎముకల సమూహానికి చేరుస్తాయి.

కొఖ్లియా మెకానికల్ శబ్ధ తరంగాలను ఎలక్ట్రికల్ తరంగాలుగా మారుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ తరంగాలను మన మెదడు ప్రాసెస్ చేసుకోగలుగుతుంది. అప్పుడు మనకు శబ్ధం వినిపిస్తుంది.

కానీ ఓటోస్క్లెరోసిస్ సమస్య ఉన్నవారిలో ఈ ప్రక్రియ క్రమంగా క్షీణిస్తుంది. ప్రకంపనలను స్టేప్స్ దాకా చేరినా అక్కడి నుంచి ముందుకు కదలవు. మెదడుకు శబ్దాలను చేరవేసే ఆ సన్నని ఎముకలను దెబ్బతీయడమే ఓటోస్క్లెరోసిస్.

దీనికి చికిత్స లేదని తెలిసినా, ఒక ఆపరేషన్ ద్వారా శబ్ధ గ్రహణాన్ని సాధించవచ్చని చదివాను. అయితే, దీంట్లో ఒక సమస్య కూడా ఉంది. చాలా అరుదైన సందర్భాల్లో ఈ ఆపరేషన్ కారణంగా ముఖానికి పక్షవాతం రావొచ్చు. ఉన్న వినికిడి శక్తి కూడా పూర్తిగా పోవచ్చు.

ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అన్నదానిపై చాలా మదనపడ్డాను. అసలు పూర్తిగా వినికిడి కోల్పోయేకన్నా ఎంతోకొంత వినపడటం నయమనుకున్నాను. ఆపరేషన్ వద్దన్న నిర్ణయానికి వచ్చాను.

కానీ, తర్వాతి రోజుల్లో నా పరిస్థితి మరింత దిగజారింది. హియరింగ్ ఎయిడ్ తెచ్చుకున్నాను. కానీ ఇతర శబ్దాలకు, మాటలకు తేడా తెలియకుండా రణగొణ ధ్వని మాత్రమే వినిపిస్తోంది. నా కుడి చెవి వినికిడి శక్తి మరింతగా క్షీణించింది. ఇక లాభం లేదనుకుని ఆపరేషన్‌కు సిద్ధపడ్డాను. .

రాయల్ ఇయర్ నోస్ అండ్ థ్రోట్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. డాక్టర్ జెరెమీ లెవీ నాకు ఆపరేషన్ చేస్తున్నారు. ఆయన కొంత వరకు నా చెవి లోపల ఉన్న స్టేప్స్‌ను గుర్తించగలిగారు. నా కర్ణభేరిని ముందుకు లాగి, ఒక చిన్న లేజర్‌ను అందుకున్నారు. దానిని స్టేప్స్‌కు గురి పెట్టారు.

ఇది చాలా కీలకమైన సమయం. ఈ ప్రయత్నంలో ఆయన చెయ్యి ఒక మిల్లిమీటర్ అదనంగా జరిగినా, నేను పూర్తిగా వినికిడి కోల్పోవడమో, నా ముఖం పక్షవాతానికి గురికావడమో జరిగేది.

ఆయన లేజర్‌ను ఫైర్ చేశారు. చెవిలోని స్టేప్స్ కాస్త వదులయ్యాయి. ఒక కృత్రిమ స్టేప్స్‌ను జత చేసి, దానిని కాస్త లాగి దానిని ఎముకకు తగిలించారు. అంతే, ఒక్కసారి నా కుడి చెవి శబ్ధాలను గ్రహించడం మొదలైంది.

అక్కడి వారి మాటలు, ఇతర సౌండ్లు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ చేసే వస్తువులు ఒకదానికొకటి తగిలినప్పుడు అయ్యే శబ్ధాలను నా చెవి గుర్తించగలుగుతోంది. ఏదో అద్భుతం జరుగుతోందని నాకు అనిపించింది.

ఆపరేషన్ జరిగిన రెండు గంటల తర్వాత నేను బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇంతలో ఒక్కసారి నా చెవిలో పెద్ద సౌండ్ మొదలైంది. అది ఎలా ఉందంటే, కుక్కర్ విజిల్ లాగా కీచుమనే శబ్ధం.

వింత వింత శబ్దాలు వినిపించే అవకాశం ఉంటుందని నర్స్ నాకు అంతకు ముందే చెప్పింది. తగ్గిపోతుందనుకున్నాను, కానీ, ఎంతకీ ఆ శబ్ధం ఆగిపోలేదు. కొన్ని సంవత్సరాలపాటు ఆ సౌండ్ వినిపిస్తూనే ఉంది.

ఆపరేషన్ తర్వాత 90 శాతం కేసుల్లో ఈ కీచు శబ్ధం తగ్గుముఖం పట్టడమో, లేదంటే పూర్తిగా పోవడమో జరుగుతుందని, కానీ, 10శాతం కేసుల్లో అది తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉందని, అది అలా ఎందుకు జరుగుతుందో తెలియదని డాక్టర్ జెరెమీ లెవీ చెప్పారు. ఈ సమస్యను టిన్నిటస్ అంటారు.

హెలెనాకు వినికిడి శక్తి వచ్చినా, ఆమె చెవిలో వినిపించే సౌండ్ మాత్రం తగ్గలేదు

కుక్కర్ విజిల్ శబ్ధం చెవిలో మోగుతూ ఉంటే..వేరే విషయాల గురించి ఆలోచించడం కష్టం. నా చెవికి ఇతర శబ్ధాలు వినిపిస్తే, ఆ శబ్ధం ప్రభావం తగ్గుంది. అందుకే నేను లండన్ టన్నెల్ ట్రైన్ స్టేషన్‌ను నాకు ఇష్టమైన ప్రాంతంగా మార్చుకున్నాను. అందులో నుంచి వచ్చే భీకర శబ్ధాలు నన్ను విజిల్ మోత కష్టాల నుంచి బయటపడేశాయి.

ఒక సాయంత్రం పిల్లలతో ఇంటి దగ్గర ఉన్నాను. మేమంతా బొమ్మల పుస్తకం చూస్తున్నాం. మా పెద్దమ్మాయి మటిల్డా తమ్ముడు సామ్‌కు చదువు నేర్పడానికి ప్రయత్నిస్తోంది. క్యాట్, డక్ అని సామ్ గజిబిజిగా అరుస్తున్నప్పుడు విజిల్ శబ్ధం లేకుండా ఆ మాటలు వినిపిస్తున్నట్లు గుర్తించాను.

అదే రాత్రి టిన్నిటస్ ఫోరమ్ గురించి ఆన్‌లైన్‌లో చూశాను. అందులో మెసేజ్ పోస్ట్ చేశాను. ఆ మెసేజ్‌కి కొంతమంది స్పందించారు.

మందు తాగద్దని, ఎక్కువగా నిద్రపోవాలని, వ్యాయామం చేయాలని, శబ్ధాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని... ఇలా తలా ఒక సలహా ఇచ్చారు. కొన్ని వారాలు వాళ్లు చెప్పినట్లే చేశాను. కొన్ని రాత్రులు ఆ విజిల్ శబ్ధం తగ్గింది. అదే సమయంలో నేను దేనికో దూరమయ్యాయని అనిపించింది.

మనలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న 8 మందిలో ఒకరు చెవిలో ఈ గుయ్‌మనే మోతతో జీవిస్తున్నారు. అది రకరకాల శబ్ధాలతో అలా మోగుతూనే ఉంటుంది.

మరొక సమస్య పల్సటైల్ టిన్నిటస్. అంటే మీ పల్స్ మీకే వినపడుతుంది. టిన్నిటస్ ఫోరమ్‌లలో చాలామంది చెవిలో రొద గురించి ఆలోచించ వద్దని చెబుతుంటారు. నేను చాలా ప్రయత్నాలు చేశా, కానీ వీలుకాలేదు.

చెవిలో ఈ రొదతో కలిసి జీవించడానికి ఒక మార్గం కనుక్కునే ప్రయత్నం చేశాను. నా సమస్య గురించి అందరికీ చెప్పడం మొదలు పెట్టాను. నేను నా సమస్య చెబితే, వారు వాళ్ల అనుభవాలను నాకు చెప్పారు.

ఈ చర్చలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. అంతకు ముందు దశాబ్ధాల పాటు మనం వినని, మనకు ఎదురుకాని, చికిత్స ఉంటుందో లేదో కూడా తెలియని సమస్యపై సాగిన అనేక పరిశోధనల గురించి నాకు తెలిసింది.

గర్భస్థ దశలో ఉన్న మహిళలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి

ఏదైనా జబ్బు రావడం, చికిత్స తీసుకోవడం, తర్వాత వాళ్లు ఎలా కోలుకున్నారనేది నాకు బాగా ఆసక్తి కలిగించిన అంశం. ఇలాంటి అంశాలను అందరికీ ఎందుకూ చెప్పకూడదని ఆలోచించాను.

పబ్బుల్లో కూడా వదలకుండా నా స్నేహితులకు రకరకాల అనారోగ్యాలు, ఆపరేషన్ల గురించి చెప్పాల్సిందేనని నిర్ణయించుకున్నాను. అందులో నుంచే నా పాడ్‌ కాస్ట్ సిరీస్ 'రూమ్-5' అనేది పుట్టింది.

రకరకాల ఆరోగ్య సమస్యలున్న వారిని ఇంటర్వ్యూ చేయడం, వారి అనుభవాలను అందరికీ తెలిసేలా చేయడం మొదలు పెట్టాను.

నా చెవికి శస్త్రచికిత్స జరిగి రెండేళ్లైంది. ఆపరేషన్ వల్ల నాకు ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు. కానీ అలా జరగాల్సిందే. మనకు ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. అందులో కొన్ని అనూహ్యమైనవి ఉండవచ్చు. దాని వల్ల మన జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కోలుకోవడంలో సహకరించేందుకు నిపుణులు ఉన్నారు.

కానీ, వారికంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. వైద్య పుస్తకాల్లో లేని పరిష్కారాలకు మనమే సమాధానాలు వెదుక్కోవాలి.

మనలో చాలామంది ఏదో ఒక రోజు ఆ డయాగ్నాసిస్ గదిలోకి వెళ్లి మనకున్న జబ్బు గురించి తెలుసుకున్న వాళ్లమే. నాకు అది ఐదో నెంబర్ గది. మీకు మరో నెంబర్ గది కావచ్చు, కాకపోవచ్చు కూడా. కొందరికి అసలు అలాంటి పరిస్థితే ఎదురై ఉండకపోవచ్చు కూడా.

కానీ, ఎదురైనప్పుడు...ఐదో నెంబర్ గది కథ మిమ్మల్ని కాపాడుతుందని అనుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why did her life turn upside down after the birth of her second child? How many people have a similar problem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X