వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1971 యుద్ధంలో భారత్‌ ముందు లొంగిపోయిన పాక్ ఫొటోను అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడెందుకు షేర్ చేశారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

1971 యుద్ధంలో భారత్ సైన్యం ఎదుట పాకిస్తాన్ సైన్యం లొంగిపోతున్న ఈ ఫొటోను షేర్ చేసి అఫ్గానిస్తాన్ తొలి ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ వాతావరణాన్ని వేడెక్కించారు.

గత కొన్నిరోజులుగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య తాలిబన్ల గురించి మాటల యుద్ధం జరుగుతోంది.

తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతిస్తోందని, వారికి శిక్షణ, ఆయుధాలు అందిస్తోందని అఫ్గానిస్తాన్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో అమరుల్లా సాలేహ్ బుధవారం ట్విటర్‌లో ఈ ఫొటో షేర్ చేశారు.

"మన చరిత్రలో ఇలాంటి ఫొటో ఏదీ లేదు, ఎప్పటికీ ఉండదు. అవును, నిన్న ఒక రాకెట్ నా మీది నుంచి వెళ్లి, కొన్ని మీటర్ల దూరంలో పడింది. నేను ఒక్కసారిగా కదిలిపోయాను. ప్రియమైన పాకిస్తాన్ ట్విటర్ అటాకర్స్.. ఈ ఫొటో చేసిన గాయాన్ని తాలిబన్లు, టెర్రరిజం నయం చేయదు. వేరే దారులు వెతకండి" అని ట్వీట్ చేశారు.

https://twitter.com/AmrullahSaleh2/status/1417723613784985602

అమరుల్లా షేర్ చేసిన ఈ ఫొటోను మొదటి మూడు గంటల్లోనే పది వేల మందికి పైగా లైక్ చేశారు. వందల మంది ఆయన ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు.

కొంతమంది ఆయన ట్వీట్‌కు భారత సైన్యం ముందు పాకిస్తాన్ లొంగిపోయినప్పటి వీడియోను కూడా పోస్ట్ చేశారు. మరికొందరు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి ఇంటి దగ్గర రాకెట్ పడినప్పుడు ఆయన ఆందోళనకు గురైన వీడియోను కూడా షేర్ చేశారు.

సోషల్ మీడియాలో అమరుల్లా సాలేహ్ ట్వీట్ చేసిన ఎన్నో ఫొటోల గురించి వాడివేడిగా చర్చ జరుగుతోంది.

అఫ్గాన్ ఉపాధ్యక్షుడు

సోషల్ మీడియాలో జనం ఏమంటున్నారు

"ఒక పేలుడు శబ్దం విని సాహసికుడైన ఒక ఉపాధ్యక్షుడి పాంట్ తడిచిపోవడం, ఆయన సిగ్గుపడి మళ్లీ నమాజ్ కొనసాగించిన వీడియో క్లిప్‌ను కూడా మేం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు" అని పాకిస్తాన్ టీవీ హోస్ట్, నటి సెహర్ షిన్వారీ ట్వీట్ చేశారు.

https://twitter.com/SeharShinwari/status/1417724710557782020

"ఐఎస్ఐఎస్, తాలిబన్లు మీలాంటి వారి నెర్వస్ సిస్టమ్‌ను ఎంత బలహీనంగా మార్చేసాయో చెప్పడానికి ఈ కొన్ని సెకన్ల వీడియో క్లిప్ చాలు" అని మరో ట్విటర్ యూజర్ పెట్టారు.

"తాలిబన్లు అఫ్గానిస్తాన్‌లో 60 శాతానికి పైగా స్వాధీనం చేసుకున్నారు. అక్కడి ఉపాధ్యక్షుడు మాత్రం ట్విటర్‌లో యుద్ధం చేస్తున్నారు" అని పాకిస్తానీ ట్విటర్ యూజర్ అబ్దుల్లా అన్నారు.

https://twitter.com/BushraGohar/status/1417774651208515587

"పేలుడు శబ్దం రాగానే మీ రియాక్షన్ సహజమే. దీనిని వేళాకోళం చేస్తున్న వారి మానసిక స్థితి సరిలేదు. మీరు బలంగా, ధైర్యంగా ఉండండి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడడం తప్ప వేరే దారి లేదు" అని పాకిస్తాన్ మాజీ ఎంపీ బుషారా గౌహర్ ట్వీట్ చేశారు.

"ట్రోల్ పాకిస్తాన్ ప్రచారంలో అఫ్గానిస్తాన్ కూడా భారత్‌కు మద్దతివ్వడం ప్రారంభించింది" అని విపుల్ గుప్తా అనే భారత ట్విటర్ యూజర్ అన్నారు.

సాలేహ్ చేసిన ఈ ట్వీట్‌ను రైట్ వింగ్ భావజాలాన్ని సమర్థించే ట్విటర్ యూజర్స్ చాలా మంది షేర్ చేశారు. పాకిస్తాన్‌ మీద జోకులు వేశారు.

ఈ ఫొటో ఎప్పటిది

సాలేహ్ షేర్ చేసిన ఈ ఫొటో 1971కి చెందిన ఒక చరిత్రాత్మక ఫొటో. పాకిస్తాన్ సైన్యం ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోతున్న సమయంలో దీన్ని తీశారు. 1971 యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్‌ పరాజయం పాలైంది.

1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ దాదాపు 90వేల మంది సైనికులతో తూర్పు పాకిస్తాన్‌లో లొంగిపోవాల్సి వచ్చింది.

ఆ లొంగుబాటు తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్‌కు స్వతంత్రం లభించింది. అది బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.

ఈ ఫొటోలో ఒప్పందంపై సంతకం చేస్తున్న జనరల్ నియాజీ పక్కనే అదే టేబుల్ దగ్గర అప్పటి ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జగ్‌జీత్ సింగ్ ఆరోడా కూడా కూర్చుని ఉంటారు.

భారత సైన్యం, బెంగాలీల చేతుల్లో పాకిస్తాన్ ఓడిపోయి, లొంగిపోయిన ఈ ఘటనను ఆ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా అక్కడి నిపుణులు వర్ణిస్తారు.

అప్పట్లో నావికా దళ తూర్పు కమాండ్ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్ ఎన్ కృష్ణన్ తన ఆత్మకథ 'ఎ సెయిలర్స్ స్టోరీ'లో ఈ ఘటన గురించి రాశారు.

"ఢాకా రేస్‌కోర్స్ మైదానంలో ఒక చిన్న టేబుల్, రెండు కుర్చీలు వేశారు. వాటిపై జనరల్ ఆరోడా, జనరల్ నియాజీ కూర్చున్నారు. నేను, ఎయిర్ మార్షల్ దేవాన్, జనరల్ సగత్ సింగ్, జనరల్ జాకబ్ వాళ్ల వెనుక నిలబడ్డాం. లొంగుబాటు పత్రాల ఆరు కాపీలు ఉన్నాయి. వాటిని మందంగా ఉన్న తెల్లకాగితాలపై టైప్ చేశారు"

"వాటిపై మొదట నియాజీ, తర్వాత జనరల్ ఆరోడా సంతకాలు చేశారు. నియాజీ తన సంతకం పూర్తిగా చేయలేదు, ఏఏకే నియా అని పెట్టారు. కావాలనే అలా చేశారా అనేది నాకు తెలీదు. జనరల్ ఆరోడా అది గమనించారు. నియాజీతో, మీరు పూర్తి సంతకం పెట్టండి అన్నారు. నియాజీ అలా సంతకం చేయగానే స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది"

ఆ సమయంలో నియాజీ కళ్లనిండా నీళ్లున్నాయి. ఆయన తన బ్యాడ్జీలు, రివాల్వర్ నుంచి బుల్లెట్లు తీశారు. వాటిని జనరల్ ఆరోరాకు అప్పగించారు" అని తన ఆత్మకథ 'ఎ సెయిలర్స్ స్టోరీ'లో అప్పుడు తూర్పు కమాండ్ చీఫ్‌గా ఉన్న అడ్మిరల్ ఎన్ కృష్ణన్ రాశారు.

పాక్-అఫ్గాన్ ఉద్రిక్తతలు

అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు

కొన్నిరోజుల క్రితం అఫ్గానిస్తాన్ తొలి ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ పాకిస్తాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు.

"స్పిన్ బోల్డక్ ప్రాంతం నుంచి తాలిబన్లను తరిమికొట్టేందుకు ఎవరూ ప్రయత్నించినా తమ వైమానిక దళం తగిన సమాధానం చెబుతుందని అఫ్గాన్ నేషనల్ ఆర్మీ (ఎఎన్ఏ), అఫ్గాన్ వైమానిక దళాన్ని పాకిస్తాన్ అధికారికంగా హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లకు పాకిస్తాన్ వైమానిక మద్దతు ఇస్తోంది" అని ఆయన ట్వీట్ చేశారు.

https://twitter.com/AmrullahSaleh2/status/1415710708541673475

దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు చూపిస్తానని కూడా ఆయన అన్నారు. కానీ, సాలేహ్ ఆరోపణలను పాకిస్తాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

తమ భూభాగంలోని పాక్ సైనికులు, ప్రజల రక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టామని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

"పాకిస్తాన్‌లోని చమన్ సెక్టార్ ముందున్న తమ ప్రాంతంలో వైమానిక ఆపరేషన్లు నిర్వహించాలని అనుకుంటున్నట్లు అఫ్గానిస్తాన్ తమకు సమాచారం ఇచ్చిందని, అయితే, ఆ దేశానికి చెందిన ప్రాంతంలో ఆపరేషన్లు చేసుకోవచ్చని చెప్పామని పాక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో చెప్పింది. ఇదొక సానుకూల స్పందన అని తెలిపింది.

అయితే ఆ తర్వాత పాకిస్తాన్ వాదనలు నమ్మకూడదంటూ సాలేహ్‌ మరో ట్వీట్ చేశారు.

https://twitter.com/AmrullahSaleh2/status/1415896175941668864

"పాకిస్తాన్, తమ భూభాగంలో క్వెట్టా షురా, తాలిబన్ తీవ్రవాద నేతల ఉనికే లేదని 20 ఏళ్లకు పైగా చెబుతూ వస్తోంది. ఆఫ్గానీలైనా, విదేశీయులైనా ఈ పాటర్న్ గురించి బాగా తెలిసినవారికి, ఇది ముందే రాసిపెట్టుకున్న మాట అనేది బాగా అర్థమవుతుంది" అన్నారు.

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉన్న స్పిన్ బోల్డాక్ క్రాసింగ్ దగ్గర ప్రాంతంపై నియంత్రణ సాధించామని తాలిబన్లు ప్రకటించిన తర్వాత అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమరుల్లాహ్ సాలేహ్ పాకిస్తాన్ మీద ఆరోపణలు చేశారు.

కాందహార్ దగ్గరునన ప్రధాన వ్యూహాత్మక ప్రాంతాల్లో స్పిన్ బోల్డాక్ క్రాసింగ్ ఒకటి. ఇది పాకిస్తాన్ సరిహద్దులతో ఉంటుంది.

అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ ఎంపీ మొహసీన్ డావర్‌కు ప్రశంసలు

క్వెట్టా, పెషావర్‌లో తాలిబన్లు చేసిన ర్యాలీల అంశాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తడానికి ప్రయత్నించానని, కానీ, మాట్లాడనీకుండా తనను అడ్డుకున్నారని పష్తూన్ తహఫ్పూజ్ మూవ్‌మెంట్ నేత, పాకిస్తాన్ ఎంపీ మొహసీన్ డావర్ చెప్పారు.

డావర్ ఈ ర్యాలీల గురించి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడారు.

https://twitter.com/mjdawar/status/1415969107464306691

"అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఆ ప్రభావం ఇక్కడ కూడా పడవచ్చనేది సుస్పష్టం. గత కొన్నిరోజులుగా క్వెట్టా, పెషావర్‌లో తహ్రీకే తాలిబాన్ ర్యాలీలు జరిగాయి. అఫ్గానిస్తాన్ పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తోంది" అన్నారు.

డావర్ పార్లమెంటులో మాట్లాడుతుండగానే, స్పీకర్ ఆయన మాటలను అడ్డుకున్నారు.

నేషనల్ అసెంబ్లీలో తాను మాట్లాడిన వీడియోను డావర్ ట్విటర్‌లో పోస్ట్ చేసినపుడు, దానికి అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్ సమాధానం ఇచ్చారు.

https://twitter.com/AmrullahSaleh2/status/1416216612101890049

"భాయీ డావర్, మీ మాట మేం వింటున్నాం. అముస్ నుంచి అబ్బాసిన్ వరకూ కోట్ల మంది మీ మాటలు వింటున్నారు. తీవ్రవాద తాలిబన్లకు జీహెచ్‌క్యూ (పాకిస్తానే ఆర్మీ హెడ్ క్వార్టర్) నుంచి అందుతున్న సహకారం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని మార్పులు వచ్చాయి. కానీ అఫ్గానిస్తాన్ ప్రజల సంకల్పం, ధైర్యం అలాగే ఉంది" అన్నారు.

తాలిబన్ ఫైటర్లను పాకిస్తానే అఫ్గానిస్తాన్‌కు పంపించిందని అంతకు ముందు మొహసీన్ డావర్ కూడా ఆరోపణలు చేశారు.

అఫ్గాన్ రాయబారి కూతురి ఘటన

పాకిస్తాన్‌లోని అఫ్గాన్ రాయబారి నజీబుల్లా అలీఖేల్ కూతురు సిల్‌సిలా అలీఖేల్‌ కిడ్నాప్, ఆమెపై దాడి జరిగిన తర్వాత తమ రాయబారి, మిగతా సీనియర్ దౌత్యాధికారులు అందరినీ అప్గాన్ ప్రభుత్వం ఆదివారం వెనక్కు పిలిపించింది.

భద్రతకు సంబంధించిన ఆందోళనలు దూరమయ్యేవరకూ, అఫ్గాన్ రాయబారి కూతురిపై జరిగిన ఘటనలో దర్యాప్తు ముగిసేవరకూ తమ రాయబారులు, సీనియర్ దౌత్యవేత్తలు అఫ్గానిస్తాన్‌లోనే ఉంటారని అక్కడి ప్రబుత్వం చెప్పింది.

https://twitter.com/KarzaiH/status/1416461894995509248

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ తర్వాత ఆ దేశంలో అస్థిరత ఏర్పడింది. గత కొన్ని రోజులుగా తాలిబన్లు కొత్త ప్రాంతాలపై పట్టు సాధిస్తూ వెళ్తున్నారు.

మధ్య, దక్షిణాసియా దేశాల సదస్సులో గత వారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కొన్ని అడుగుల దూరంలోనే కూర్చున్న అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ పాక్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద గ్రూపులతో పాకిస్తాన్ తమ సంబంధాలను తెంచుకోలేదని ఆరోపించారు.

నిఘా నివేదికలను ఉటంకిస్తూ ప్రసంగించిన అష్రఫ్ గనీ "తాలిబన్లను శాంతి చర్చల్లో పాల్గొనేలా ఒప్పించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందని, గత నెలలో 10 వేల మందికి పైగా జిహాదీలు అఫ్గానిస్తాన్‌లోకి వచ్చారు" అని ఆరోపించారు.

కాపీ - ప్రశాంత్ చాహల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why did the Vice President of Afghanistan now share a photo of Pakistan surrendering to India during the 1971 war?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X