వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్‌లో యుద్ధంతో ఈ దేశం సంపద ఎందుకు పెరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఖతార్ ప్రధాని ఖాలిద్ బిన్ ఖలీఫా

యుక్రెయిన్‌పై రష్యా దాడితో అరబ్ దేశం ఖతార్ సంపద విపరీతంగా పెరుగుతోంది. ఎందుకు ఖతార్ అంత కీలకంగా మారుతోంది, ఆ దేశ సంపద ఎలా పెరుగుతోంది?

ఖతార్ జనాభా 30 లక్షలు మాత్రమే. అయితే, ఇప్పుడు ఐరోపా దేశాల ఇంధన దిగుమతులకు ఖతార్ కీలకంగా మారుతోంది. రష్యా ఎగుమతులకు ఈ అరబ్ దేశం ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది.

ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ – లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)ను అధికంగా ఎగుమతిచేసే దేశాల్లో ఆస్ట్రేలియా, ఖతార్ అగ్ర స్థానంలో ఉంటాయి. ఇప్పుడు యూరప్‌కు ఈ రెండు దేశాలు కీలకంగా మారుతున్నాయి.

యూరోపియన్ యూనియన్‌ గ్యాస్ అవసరాల కోసం 40 శాతానికిపైనే రష్యాపై అధారపడుతోంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడికి ముందువరకు, యూరోపియన్ యూనియన్(ఈయూ)-రష్యా మధ్య ఇంధన సంబంధాలు సాఫీగా ఉండేవి. కానీ, ఫిబ్రవరిలో దాడి మొదలైన తర్వాత రష్యాను లక్ష్యంగా చేసుకుంటూ ఈయూ ఆంక్షలు విధించింది.

ఖతార్

గ్యాస్ దిగుమతికి సంబంధించి ఇప్పటికే చాలా దేశాలతో యూరప్ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అయితే, రష్యా ఎగుమతులను పూర్తిగా భర్తీచేసే స్థాయిలో ఈ ఒప్పందాలు లేవు.

జర్మనీని ఉదాహరణగా తీసుకుంటే, ఈ ఐరోపా దేశానికి అవసరమైన గ్యాస్‌లో 55 శాతం రష్యా నుంచే వస్తోంది.

రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అసాధారణ చర్యలు తప్పనిసరని ఇటీవల జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ చెప్పారు. రష్యా ఇంధనం పేరుతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

జర్మనీతోపాటు చాలా దేశాలు ఇప్పుడు ఎల్ఎన్‌జీని సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ఐరోపా దేశాలు రష్యాపై పూర్తిగా ఆధారపడటం తగ్గించడానికి మూడు నుంచి ఐదేళ్ల వరకు సమయం పట్టొచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్డ్ హెబెక్

''చాలా కష్టమైనప్పటికీ, ఈ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే’’అని రాబర్ట్ వ్యాఖ్యానించారు.

అమెరికాతోపాటు ఖతార్ నుంచి కూడా ఎల్‌ఎన్‌జీని భారీగా దిగుమతి చేసేందుకు ప్రస్తుతం జర్మనీతోపాటు చాలా దేశాలు సిద్ధం అవుతున్నాయి.

యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇంధన కోసం ఖతార్‌తో ఐరోపా దేశాలు చర్చలు మొదలుపెట్టాయి. అదే సమయంలో ఖతార్ కూడా గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పెట్టుబడులను మరింత పెంచింది.

''ఇది ఖతార్‌కు చాలా మంచి అవకాశం’’అని వాషింగ్టన్‌లోని మిడిల్‌ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌లో ఎకనామిక్స్ అండ్ ఎనర్జీ ప్రోగ్రామ్ డైరెక్టర్ కరేన్ యంగ్ చెప్పారు.

ఖతార్

విస్తరణ కోసం..

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుకాకముందే, ఖతార్ గ్యాస్ ఎగుమతులను 2027 కల్లా 60 శాతం పెంచాలని నిర్ణయించింది. ముఖ్యంగా యూరప్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచాలని ఖతార్ లక్ష్యంగా పెట్టుకుంది. ''ఇది ఖతార్‌కు సువర్ణావకాశం లాంటిది. అన్నీ సవ్యంగా జరిగితే ఇటు రాజకీయంగా, అటు ఆర్థికంగా ఖతార్‌కు చాలా మేలు జరుగుగుతుంది’’అని కరేన్ చెప్పారు.

రాజ్యాంగ బద్ధమైన రాచరిక వ్యవస్థ ఉండే ఖతార్‌లో దేశానికి నాయకుడిగా ''ఎమిర్ (రాజు)’’ ఉంటారు. ప్రభుత్వానికి నాయకుడిగా ప్రధాన మంత్రి ఉంటారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఖతార్ క్లిష్టతరమైన ప్రక్రియలను అనుసరించాల్సిన అవసరం లేదు. మరోవైపు ఏకాభిప్రాయం కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాల్సిన అవసరం కూడా లేదు.

ఖతార్‌ను పశ్చిమ దేశాలు ''నిరంకుశ దేశం’’గానే చూస్తుంటాయి. అయితే, ఖతార్ మాత్రం ఆ వాదనతో విభేదిస్తుంటాయి.

మరోవైపు వలస కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసిన ఆరోపణలను కూడా ఖతార్ ఖండిస్తూ వస్తోంది.

ఖతార్

ఖతార్ లక్ష్యాలు ఏమిటి?

ఎల్‌ఎన్‌జీని కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద ద్రవరూపంలోకి మారుస్తారు. దీని ధర సాధారణ సహజ వాయువు కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని రవాణా చేయడం కూడా చాలా తేలిక. దీన్ని తేలిగ్గానే నౌకల్లో రవాణా చేయొచ్చు. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సుదీర్ఘమైన పైప్‌లైన్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదు.

ఎల్‌ఎన్‌జీపై పెట్టుబడులను పెంచుతున్నట్లు 2019లోనే ఖతార్ ప్రకటించింది. 2027నాటికి 64 శాతం ఎగుమతులను పెంచాలని నిర్ణయం తీసుకుంది.

ఇరాన్ తీరానికి సమీపంలో ఉండే నార్త్ ఫీల్డ్ రిజర్వ్‌ను మరింత విస్తరించాలని ఖతార్ ప్రభుత్వ సంస్థ ''ఖతార్ గ్యాస్’’ నిర్ణయించింది. ప్రపంచంలో భారీగా సహజ వాయువు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.

ఖతార్

ఈ నిక్షేపాన్ని విస్తరించడం ద్వారా ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని ప్రస్తుతమున్న 77 మిలియన్ టన్నుల నుంచి 2025నాటికి 110 మిలియన్ టన్నులకు పెంచే అవకాశముంది.

ప్రస్తుతం ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం జర్మనీతోపాటు మరికొన్ని యూరప్ దేశాలు కూడా ఖతార్‌తో చర్చలు జరుపుతున్నాయి.

ఇటీవల కాలంలో ఖతార్‌తో ఇంధన ఒప్పందాలు ఐరోపా దేశాలకు మరింత అనివార్యం అయ్యాయి. యుద్ధం నేపథ్యంలో పోలండ్, బల్గేరియాలకు రష్యా ఇంధన సరఫరాలు నిలిపివేయడంతో ఐరోపా దేశాలు మరింత అప్రమత్తం అయ్యాయి.

మరింత సంపద

ఖతార్ తలసరి ఆదాయం స్విట్జర్లాండ్, అమెరికాల కంటే ఎక్కువ. తాజా పరిణామాల నడుమ దేశ తలసరి సంపద మరింత పెరిగే అవకాశముంది.

ప్రస్తుతం ఐరోపాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎల్‌ఎన్‌జీకి డిమాండ్ పెరుగుతోంది.

ప్రస్తుతం ఖతార్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో 80 శాతం ఆసియా దేశాలకు వెళ్తున్నాయి. దక్షిణ కొరియా, భారత్, చైనా, జపాన్‌లకు ప్రధానంగా ఈ ఎగుమతులు వెళ్తున్నాయి.

మార్కెట్ పరంగా చూస్తే ఖతార్ ఎల్‌ఎన్‌జీని భారీగా దిగుమతి చేసుకుంటున్న తొలి దేశం చైనానే. 15ఏళ్లకు ఎల్‌ఎన్‌జీ సరఫరాపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో ఎల్‌ఎన్‌జీకి డిమాండ్ పెరుగుతుండటంతో.. ఖతార్ ప్రత్యేకమైన షరతులతో భారీ లాభాలను తెచ్చిపెట్టే ఒప్పందాలను కుదుర్చుకుంటోంది.

ప్రస్తుతం ఖతార్ ఎనర్జీ సంస్థ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. చాలా యూరోపియన్ దేశాలతో ఈ సంస్థ చర్చలు జరుపుతోంది.

పరిస్థితులు ఇలానే కొనసాగితే, ఖతార్ వృద్ధి రేటు నాలుగు శాతానికిపైనే ఉంటుందని సిటీగ్రూప్ అంచనా వేసింది. 2015 తర్వాత ఈ స్థాయిలో వృద్ధి కనిపించడం ఖతార్‌లో ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is the wealth of this country increasing with the war in Ukraine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X