కోవిడ్ 19 పోరులో సింగపూర్ విజయం... ఆ దేశానికి ఎలా సాధ్యమైంది...
కరోనా వైరస్‌ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాల్లో సింగపూర్ అగ్ర స్థానంలో ఉంది. 56లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటివరకూ కేవలం 58,721 కరోనా పాజిటివ్ కేసులు,29 మరణాలు మాత్రమే సంభవించాయి. ప్రస్తుతం రెండు వందల పైచిలుకు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్లే అక్కడ కరోనా వ్యాప్తికి బ్రేక్ పడింది.
కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిని నిరోధించేందుకు సింగపూర్‌లో ట్రేస్‌టుగెదర్ యాప్‌ను తీసుకొచ్చారు. కరోనా బాధితుల వివరాలను ఇందులో నిక్షిప్తం చేశారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి.. కరోనా బాధితుడు రెండు మీటర్ల దూరంలో ఉండగానే వారి ఫోనుకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యాప్ ఉపయోగించేవారిలో ఎవరికైనా కరోనా సోకినా అధికారులే ఆ వ్యక్తికి ఫోన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు.

షాపింగ్ మాల్స్,థియేటర్స్,ఆఫీసులు,స్కూళ్లు ఇలా ప్రతీచోటా ట్రేస్‌టుగెదర్ యాప్‌ను తప్పనిసరి చేశారు. ఆఖరికి ట్యాక్సీలకు కూడా క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా తమ యాప్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేశాకే అందులోకి ఎక్కాల్సి ఉంటుంది. విమాన ప్రయాణికులకు సింగపూర్ ఇమ్మిగ్రేషన్ డిజిటల్ కోవిడ్ 19 సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. తద్వారా సింగపూర్ నుంచి రాకపోకలు సాగించేవారిలో కరోనా పేషెంట్లను గుర్తిస్తోంది.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించనివారికి 225 డాలర్లు జరిమానాగా విధిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా విధిస్తున్నారు. రెండుసార్ల కన్నా ఎక్కువ ఇలా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
కరోనా లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే సింగపూర్‌లో అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. గత వారమే సింగపూర్ మూడో విడత రీఓపెనింగ్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సామూహిక సమావేశాలకు అనుమతించినప్పటికీ కేవలం 8 మందికి మించకూడదన్న నిబంధన పెట్టింది. అలాగే మతపరమైన సమావేశాలకు నిబంధనలతో కూడిన అనుమతులిచ్చింది.












Click it and Unblock the Notifications