Viral Video: ఆ ప్రశ్న అడగ్గానే నవ్విన తాలిబన్లు... కెమెరా ఆపేయాలని హుకుం...
ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాక మంగళవారం(ఆగస్టు 17) మొదటిసారి తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు. ఇంటా,బయటా తాము యుద్దాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని... ఆఫ్గన్ గడ్డపై నుంచి ఏ దేశానికి ఎటువంటి ముప్పు ఉండబోదని తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు హక్కులు ఉంటాయన్నారు. మహిళలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నారు. అయితే రాజకీయంగా మహిళలకు తాలిబన్లు అవకాశం కల్పిస్తారా... తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మహిళల పట్ల వారి వైఖరిని మరోసారి బయటపెట్టింది.
ఆ వీడియోలో మహిళా జర్నలిస్ట్ ఒకరు తాలిబన్ ఫైటర్స్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాలిబన్ పాలనలో మహిళా హక్కులను గౌరవిస్తారా అని ఆమె వారిని ప్రశ్నించారు. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులు ఉంటాయని తాలిబన్లు బదులిచ్చారు. ఆ వెంటనే ఆమె మరో ప్రశ్న అడిగారు. మహిళా రాజకీయ నేతలకు ఓటు వేసేందుకు ఆఫ్గన్ ప్రజలను అనుమతిస్తారా అని అడిగారు. అంతే... ఆ ప్రశ్నకు తాలిబన్లు నవ్వేశారు. అంతేకాదు,కెమెరా ఆపేయాలంటూ హుకుం జారీ చేశారు. దీన్నిబట్టి మహిళల పట్ల తాలిబన్లు ఎంత చులకన భావంతో ఉన్నారో అర్థమవుతోంది. మహిళల హక్కులను గౌరవిస్తామని నేటి ప్రెస్ మీట్‌లో తాలిబన్లు వెల్లడించినప్పటికీ... అక్కడికి ప్రజలకు వారి మాటలపై విశ్వాసం కుదరట్లేదు.

గతంలో 1996లో ఆఫ్గన్‌ని ఆక్రమించిన తాలిబన్లు అప్పట్లో స్త్రీల పట్ల అత్యంత నిర్దయగా,కర్కషంగా వ్యవహరించారు.వారికి విద్య,ఉద్యోగం నిషేధించారు.పురుషుడి తోడు లేకుండా ఇంటి గడప దాటవద్దని... ముఖం నుంచి పాదం వరకూ ఆపాదమస్తకం బుర్ఖాతో కవర్ చేసుకోవాలని ఆంక్షలు విధించారు. వీటిని ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలు ఉండేవి. 2001లో తాలిబన్ల పతనం తర్వాత ఆఫ్గన్‌లో మహిళలకు మళ్లీ స్వేచ్చ లభించింది.విద్య,ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ వారికి అవకాశం లభించింది. కానీ ఆఫ్గన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో స్త్రీల హక్కులు మళ్లీ ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ ఏడాది జులైలో కాందహార్‌లోని ఓ బ్యాంకులోకి చొరబడ్డ తాలిబన్లు... అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది మహిళా ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. మళ్లీ ఉద్యోగాలకు రావొద్దని... వారి స్థానంలో కుటుంబ సభ్యుల్లోని మగవారిని పంపించాలని ఆదేశించారు. ఇలా మహిళల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే తాలిబన్లు... ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో కాస్త ఉదారంగా మాట్లాడినట్లు కనిపించారు. 'ఇస్లామిక్ షరియా చట్ట ప్రకారం మహిళా హక్కులు గౌరవించబడుతాయి.ఎడ్యుకేషన్,హెల్త్ సెక్టార్‌లతో పాటు వారి సేవలు ఏయే రంగాల్లో అవసరమో.. అక్కడ వారు పనిచేయవచ్చు.వారి పట్ల వివక్ష ఉండదు.' అని పేర్కొన్నారు.అయితే ఇది ప్రపంచాన్ని నమ్మించడానికా లేక మహిళల పట్ల వారి తీరు నిజంగానే మారనుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.
Taliban collapses with laughter as journalist asks if they would be willing to accept democratic governance that voted in female politicians - and then tells camera to stop filming. “It made me laugh” he says.pic.twitter.com/km0s1Lkzx5
— David Patrikarakos (@dpatrikarakos) August 17, 2021












Click it and Unblock the Notifications