Afghanistan: ఇంకా ఆఫ్గన్‌లోనే చిక్కుకుపోయినవారి పరిస్థితేంటి-అమెరికా నిష్క్రమణ తర్వాత అసలేం జరగబోతుంది..
ఆఫ్గన్ గడ్డపైనుంచి అమెరికా సైన్యం నిష్క్రమించింది. యుద్దాన్ని మధ్యలోనే వదిలేసిందనే విమర్శలను అమెరికా అంగీకరించట్లేదు. ఇక తమది కాని యుద్ధంలో తమ సైనికులను కోల్పోలేమని ప్రకటించింది. అల్‌ఖైదాను అంతం చేయాలనే తమ లక్ష్యం నెరవేరిందని... తాలిబన్లతో యుద్ధం లేదా ఆఫ్గనిస్తాన్ పునర్నిర్మాణం తమ పని కాదని తేల్చి చెప్పింది. ఎలాగైతేనేమీ తాలిబన్లతో శాంతి ఒప్పందం పేరుతో రెండు దశాబ్దాల తర్వాత అమెరికా అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇక ఇప్పుడు ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లకు పూర్తి స్వేచ్చ లభించినట్లయింది. ఈ నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్‌లో ఇకనుంచి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

స్వేచ్చ ఎవరికి లభించినట్లు...
ఆగస్టు 31 డెడ్ లైన్‌కు ఒకరోజు ముందుగానే అమెరికా ఆఫ్గన్ గడ్డను వీడింది. తాలిబన్లు బాణసంచా పేలుస్తూ... గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబరాలు జరుపుకున్నారు. ఆఫ్గనిస్తాన్‌కు పూర్తి స్వాతంత్ర్యం లభించిందని ప్రకటించారు. ఆఫ్గన్లకు పూర్తి స్వాతంత్య్రం లభించిందా లేక తాలిబన్లకు పూర్తి స్వేచ్చా, స్వాతంత్య్రం లభించిందా అనేది మున్ముందు పరిస్థితులు చెబుతాయి. తాలిబన్ల గత చీకటి పాలనకు ప్రస్తుత పాలన పెద్ద భిన్నంగా ఉండదనే గత 15 రోజుల పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఆఫ్గనిస్తాన్ ఆక్రమణ పూర్తయ్యాక తాలిబన్లు వల్లించిన శాంతి వచనాలు,భద్రత,స్వేచ్చ అనే మాటలకు,వారి చేతలకు ఏమాత్రం పొంతన లేదు.

ఇప్పటికీ వేలాది మంది అక్కడే... తాలిబన్లు అనుమతిస్తారా
అమెరికా ఆఫ్గనిస్తాన్ నుంచి నిష్క్రమించడంతో కాబూల్ విమానాశ్రయం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. ఇప్పటికీ వేలాది మంది ఆఫ్గనిస్తానీలు,ఇతర దేశస్తులు అక్కడినుంచి పారిపోయేందుకు కాబూల్ విమానాశ్రయం వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇందులో అమెరికన్లు కూడా ఇంకా కొంతమంది ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరు దేశాన్ని వీడేందుకు తాలిబన్లు అంగీకరిస్తారా... ఒకవేళ అంగీకరించినా... వీరి కోసం ఏ దేశాలు కాబూల్‌కు విమానాలు పంపుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు అమెరికా,నాటో దళాల ఆధీనంలో విమానాశ్రయం ఉంది కాబట్టి దాదాపు 20 పైచిలుకు దేశాలు అక్కడి నుంచి తమ దేశస్తులతో పాటు ఆఫ్గన్ల తరలింపు ప్రక్రియను చేపట్టాయి. ప్రస్తుతం విమానాశ్రయం తాలిబన్ల ఆధీనంలో ఉండటంతో కాబూల్‌కు విమానాలు నడపడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఆ రిస్క్‌కు అంగీకరించి ఏ దేశాలు ముందుకొస్తాయో చూడాలి.

అది సాధ్యపడుతుందా...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం తాలిబన్లపై నమ్మకంగానే ఉన్నారు. ఆఫ్గనిస్తాన్‌ను వీడాలనుకునే అమెరికన్లు,ఇతర దేశస్తులకు తాలిబన్లు సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలే లేని ప్రస్తుత పరిస్థితుల్లో అదెలా సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాలిబన్లు,ప్రయాణికులు,విమాన రాకపోకలకు అనుమతిస్తామని చెబుతున్నారు. అమెరికా,బ్రిటన్ తదితర దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఖతర్,టర్కీలతో తాలిబన్ సంప్రదింపులు...
ప్రస్తుతం తాలిబన్లు ఖతర్,టర్కీ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాబూల్ విమానాశ్రయానికి విమాన సర్వీసులు నడపాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన ఇతర దేశస్తులతో పాటు,సరైన డాక్యుమెంట్స్ ఉన్న ఆఫ్గన్లు ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని వారితో చెబుతున్నారు. టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కవుస్లోగు ఇదే అంశంపై మాట్లాడుతూ... ముందు కాబూల్ విమానాశ్రయానికి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాతే విమాన సర్వీసులు నడపడంపై ఆలోచిస్తామన్నారు.

కాబూల్ విమానాశ్రయమే కీలకం... అది నడిస్తేనే...
నాటో మిషన్‌లో భాగమైన టర్కీ గత ఆరేళ్లుగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భద్రతను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాబూల్ విమానాశ్రయం మూతపడితే ఆఫ్గనిస్తాన్‌కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే గూడ్స్ లేదా ఇతరత్రా సప్లై నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తుతుంది. ఇప్పటికైతే ఇరాన్,రష్యా,చైనా,పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలేవీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే పరిస్థితి లేదు. తాలిబన్లు మాత్రం తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరుకుంటున్నాయి.

వారి భద్రతపై ఆందోళన
ఆఫ్గనిస్తాన్‌లో అందరికీ రక్షణ ఉంటుందని,ఎవరినీ తమ శత్రువులుగా భావించట్లేదని తాలిబన్లు తమ మొదటి ప్రెస్ మీట్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చాలాచోట్ల ఆఫ్గన్ సైనికులను వెంటాడి మరీ తాలిబన్లు చంపేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి వారి కోసం వెతుకుతున్నారనే కథనాలు వచ్చాయి. తాజాగా అమెరికా దళాల నిష్క్రమణతో... ఇన్నాళ్లు వారితో కలిసి పనిచేసిన పనిచేసిన ఆఫ్గన్ వాసుల భద్రతపై ఆందోళన రేకెత్తుతోంది. ముఖ్యంగా జర్నలిస్టులు,మహిళా హక్కుల కోసం గొంతెత్తిన న్యాయవాదులను తాలిబన్లు ఉపేక్షిస్తారా అనే అనుమానం కలుగుతోంది.
Recommended Video

ఐసిస్ పుంజుకునే ప్రమాదం...
ఆఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం 2వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది. కాబూల్ విమానాశ్రయం వద్ద ఇటీవల ఐసిస్ చేసిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 200 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 30) మరో ఆత్మాహుతి దాడికి ఐసిస్ యత్నించగా అమెరికా వైమానిక దళం రాకెట్ లాంచర్లతో ఆ వాహనాన్ని పేల్చేసింది. ఈ ఘటనలో 10 మంది సాధారణ ఆఫ్గన్ పౌరులు మృతి చెందడం అందరినీ కలచివేసింది. అమెరికా ఆఫ్గనిస్తాన్‌ను వీడిన నేపథ్యంలో ఐసిస్ మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. కొత్త రిక్రూట్‌మెంట్లు జరుపుతూ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఐసిస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆఫ్గన్‌లో ఐసిస్ దాడులకు తెగబడితే... ప్రతిగా తాలిబన్లు దాడులకు పాల్పడుతారు. అదే జరిగితే ఆఫ్గనిస్తాన్‌లో పెను విధ్వంసం తప్పకపోవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications