ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..
ప్రపంచ దేశాధినేతలు మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పిలుపునిచ్చింది. తదుపరి సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సంసిద్దమయ్యేలా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ముందు ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పెట్టబోతున్నట్లు తెలిపింది. తద్వారా కోవిడ్ 19 లేదా ఇతర అంటువ్యాధులతో ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు... వాటిని గుర్తించడం,అందుకు తగినట్లుగా ప్రతిస్పందించేందుకు అన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడుతాయని పేర్కొంది.
Recommended Video
ఆరోగ్య లక్ష్యాలను చేరుకునే విషయంలో ప్రపంచ దేశాలు వెనక్కి తగ్గకూడదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ఆరోగ్యం అనేది ఎంత బలమైన పునాదో తెలిసివచ్చిందని పేర్కొంది. కరోనా కారణంగానే మొదటిసారి అన్ని దేశాలు వ్యాక్సిన్,డయాగ్నిస్టిక్స్,చికిత్స విధానాలను వేగంగా అభివృద్ది చేసుకుంటున్నాయని తెలిపింది.

కరోనాతో ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌ఓ 'ట్రిపుల్ బిలియన్' లక్ష్యాల ప్రాధాన్యం అవగాహనకు వచ్చిందని పేర్కొంది. ఆ లక్ష్యాలను మరింత ధృఢ నిశ్చయంతో,సంకల్పంతో, సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రాతిపదిక ఏర్పడిందని తెలిపింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 48.21 మిలియన్ల కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. 1.2మిలియన్ల మంది కరోనాతో మృత్యువాతపడినట్లు తెలిపింది.
కాగా,ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మరోసారి కలవరపెడుతోంది. ఫ్రాన్స్,జర్మనీ,ఇంగ్లాండ్ వంటి దేశాలు కరోనా సెకండ్ వేవ్ కట్టడికి మరోసారి లాక్ డౌన్లు విధించాయి. కరోనా మొదటి దశ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరమని చెబుతుండటంతో అన్ని దేశాలు మళ్లీ అప్రమత్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications