36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!
ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇరాన్ ప్రభుత్వం అత్యంత సుదీర్ఘమైన ఇంటర్నెట్ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మొదలైన ఈ 'డిజిటల్ బ్లాక్‌అవుట్' ఇప్పుడు ఏకంగా 36 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇరాన్ ప్రస్తుతం ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని ఒక 'డిజిటల్ ఐలాండ్'లా మారిపోయింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గత ఐదు వారాలుగా, అంటే సుమారు 864 గంటల పాటు ఏకధాటిగా ఇంటర్నెట్ నిలిపివేసిన దేశంగా ఇరాన్ చరిత్రలో నిలిచిపోయిందని అంతర్జాతీయ ఇంటర్నెట్ పర్యవేక్షణా సంస్థ 'నెట్‌బ్లాక్స్' (NetBlocks) ధృవీకరించింది. 37వ రోజులోకి ప్రవేశించిన ఈ ఆంక్షలు ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన నేషన్-వైడ్ షట్‌డౌన్‌గా రికార్డులకెక్కాయి.

ప్రపంచంతో తెగిపోయిన బంధం..
సాధారణంగా యుద్ధ సమయాల్లో ఉక్రెయిన్ లేదా గాజా వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల ఇంటర్నెట్ నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ, ఇరాన్‌లో పరిస్థితి వేరు. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దేశవ్యాప్త దిగ్బంధనాన్ని విధిస్తోంది. శాటిలైట్ కనెక్షన్లు, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల (VPN)పై కూడా అధికారులు కఠినమైన నియంత్రణలు విధించడంతో, పౌరులకు బాహ్య ప్రపంచంతో కమ్యూనికేషన్ మార్గాలన్నీ మూసుకుపోయాయి. దేశీయంగా అత్యవసర సేవల కోసం పరిమిత స్థాయిలో నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, గ్లోబల్ ఇంటర్నెట్‌కు మాత్రం ప్రజలు ఆమడ దూరంలో ఉండిపోయారు.
Blackout రికార్డులు బద్దలు.. అగ్రస్థానంలో ఇరాన్..
గతంలో మయన్మార్, సూడాన్ వంటి దేశాల్లో అంతర్గత సంక్షోభాల సమయంలో సుదీర్ఘ కాలం పాటు ఇంటర్నెట్ ఆంక్షలు విధించిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఏ దేశం కూడా ఇంత తీవ్ర స్థాయిలో, ఇంత సుదీర్ఘ కాలం పాటు దేశవ్యాప్తంగా షట్‌డౌన్‌ను కొనసాగించలేదని నెట్‌బ్లాక్స్ పేర్కొంది. ఉత్తర కొరియా మొదటి నుంచీ గ్లోబల్ ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఒకసారి అనుసంధానమైన దేశం ఇలా ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేయడం ఇదే ప్రథమం. ఈ చర్య వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌర సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.












Click it and Unblock the Notifications