రూ.8,320 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం.. ఎక్కడంటే ??
ప్రపంచ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈజిప్టు రాజధాని కైరో సమీపంలోని గిజా పిరమిడ్ల దగ్గర నిర్మించిన "గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం" ఘనంగా ప్రారంభమైంది. ఈ మ్యూజియం పూర్తవ్వడానికి దాదాపు ఇరవై సంవత్సరాల సమయం పట్టిందని తెలుస్తోంది. ఇది ప్రాచీన ఈజిప్టు సంస్కృతి, నాగరికత ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియాన్ని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, సాంస్కృతిక ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ భారీ మ్యూజియం నిర్మాణంతో ఈజిప్టు మరోసారి ప్రపంచ పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానాన్ని నిరూపించుకుంది.
రూ.8,320 కోట్లతో నిర్మాణం..
కాగా ఈ గ్రాండ్ మ్యూజియం నిర్మాణానికి దాదాపు 8,320 కోట్ల రూపాయల వ్యయం అయినట్టు చెబుతున్నారు. 2002లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అనేక సాంకేతిక, రాజకీయ, ఆర్థిక అవరోధాలను అధిగమించి పూర్తి అయింది. దాదాపు 24,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియంగా నిలిచింది. ఈ మ్యూజియంలో మొత్తం 50,000 కళాఖండాలు ప్రదర్శనకు ఉంచారు. విభిన్న కాలాల్లో, వేర్వేరు రాజవంశాల్లోని ఆభరణాలు, విగ్రహాలు, రాతి శాసనాలు, సమాధులు, ఆయుధాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రాజు తుతున్‌కమన్ కలెక్షన్..
ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షణగా రాజు తుతున్‌కమన్ (Tutankhamun)కు చెందిన కళాఖండాలు నిలుస్తున్నాయి. ఆయనకు చెందిన 5,000కి పైగా వస్తువులు, బంగారు ముసుగులు, రత్నాభరణాలు, రథాలు, ఆయుధాలు, సమాధి వస్తువులు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి.
12 ప్రధాన గ్యాలరీలు..
మ్యూజియంలో మొత్తం 12 ప్రధాన గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి గ్యాలరీని ఆధునిక 3D ప్రదర్శన సాంకేతికత, డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, లైటింగ్ ఎఫెక్ట్‌లతో రూపొందించారు. సందర్శకులు ఈజిప్టు చరిత్రను క్రమానుగతంగా అనుభవించేలా సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు. ఈ మ్యూజియం ప్రారంభం ద్వారా ఈజిప్టులో పర్యాటక రంగానికి భారీ ఊపు రానుందని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం కనీసం 50 లక్షల అంతర్జాతీయ పర్యాటకులు ఈ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications