Year Ender 2024: కొమ్ములు విరిచిన ఇజ్రాయెల్
Year Ender 2024 Israel: ఇజ్రాయెల్ ప్రతీకారదాడులతో ఈ ఏడాది మధ్య తూర్పు దేశాలు భగ్గుమన్నాయి. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. ఈ రోజుకూ ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్ తాజాగా నిర్వహించిన దాడుల్లో గాజా రక్తసిక్తమైంది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు.
దాదాపు 14 నెలలుగా మధ్య- తూర్పు దేశాలు అగ్నిగుండంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగేవి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వచ్చింది.

ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. ఈ దాడులతో లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూపుల కొమ్ములు విరిచింది ఇజ్రాయెల్.
దీనికి కారణాలు లేకపోలేదు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురిని అపహరించింది హమాస్. ఇప్పటికీ వందమంది వరకు ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నారు.
దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ క్రమం తప్పకుండా డ్రోన్ దాడులను నిర్వహించింది. హెజ్బొల్లా, హమాస్..ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుపెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తంగా 1,300లకు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది ఇజ్రాయెల్.
బీకా వ్యాలీ,సిడాన్, మర్జయాన్, నబాటి, టయర్, జెజ్ఝీన్, జెహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు ప్రాంతంలోని జహ్లేయ్, బాల్బెక్, హెర్మెల్ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు సాగాయి. ఇలా హమాస్, హెజ్బొల్లాలను కంటి మీద కునుకు లేకుండా చేసింది.
హెజ్బొల్లాపై నిర్వహించిన పేజర్ దాడులు వీటన్నింటికీ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో ఈ ఘటన సంభవించింది. లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్లు వినియోగించిన పేజర్లు వరుసగా పేలిపోయిన ఉదంతం ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి.
తొలుత రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. హెజ్బొల్లాకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం ఇది. ఆ తరువాత దేశవ్యాప్తంగా పలు చోట్ల పేజర్ల పేలుళ్లు సంభవించాయి. వరుసగా ఒక్కో ప్రాంతంలో అనుమానాస్పద మెసేజ్ అందుకున్న ప్రతి పేజర్ కూడా భారీ శబ్దం చేస్తూ పేలిపోయాయి. మొత్తంగా 1,500లకు పైగా పేజర్లు పేలిపోయినట్లు లెబనాన్ వెల్లడించింది అప్పట్లో.
ఈ ఘటనలో పేజర్ల యూజర్లు, ఆ సమయంలో వారితో పాటు ఉన్న వాళ్లు, సానుభూతిపరులు.. ఇలా 30 మంది మృతి చెందారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. దీని వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ ఉందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనికి ప్రతిగా హమాస్, హెజ్బొల్లా కూడా వేర్వేరుగా ఇజ్రాయెల్‌పై వరుస దాడులు చేశాయి గానీ అవి సఫలం కాలేదు. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడులు సాగించాయి. ఆయన స్వస్థలం సిజేరియాలో రెండు ఫ్లాష్ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.












Click it and Unblock the Notifications